NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీ లిస్ట్‌ ఎప్పుడు? కాషాయ దళం మాత్రం కామ్‌గా ఉంది ఎందుకు..?

Bjp

Bjp

Off The Record: ఓవైపు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన అయిపోయింది. మరోవైపు కాంగ్రెస్‌ 55 మందితో ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించేసింది. ఇప్పటికే ప్రచారంగంలోకి దూకేశారు రెండు పార్టీల అభ్యర్థులు. కానీ… బీజేపీ మాత్రం ఇంకా తమ జాబితాను బయటపెట్టలేదు. దీంతో ఆశావహుల పల్స్‌ రేట్‌ అంతకంతకూ పెరిగిపోతోందట. ఇతర పార్టీల అభ్యర్థులు ఫీల్డ్‌లో ఉంటే … తాము వెనకబడిపోతామేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కమలం పార్టీ లీడర్స్‌. పితృపక్షం ముగిసిన వెంటనే మొదటి జాబితా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ…ఇప్పుడు మాత్రం కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగితే అప్పుడే తమ లిస్ట్ వస్తుందని , 50 శాతం సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారన్నది పార్టీ వర్గాల టాక్‌. కానీ… సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎప్పుడు భేటీ అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. కొన్ని స్థానాల విషయంలో స్పష్టత ఉన్నా… ఎక్కువ చోట్ల పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సీనియర్స్‌ కొందరు అసెంబ్లీకి పోటీ చేయడానికి ఆసక్తిగా లేనందున… వాళ్ళు బలవంతంగా బరిలోకి దిగాల్సి వస్తుందా లేక వదిలేస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. అదే సమయంలో చాలా చోట్ల టిక్కెట్‌ వస్తుందో రాదోనన్న డైలమాలో… ఆశావహులు పని చేసుకోలేక పోతున్నారట. బడా నేతలు కూడా ముందుకెళ్ళమని వారికి భరోసా ఇవ్వలేక పోతున్నట్టు తెలిసింది. దీంతో… ఏం జరుగుతుందో… ఎందుకొచ్చిన గొడవ. ఆశగా ముందుకు వెళ్ళి డబ్బు ఖర్చుపెట్టి రేపు టిక్కెట్‌ రాకుంటే… చేతులు కాల్చుకున్నట్టే కదా అన్న అభిప్రాయమే ఎక్కువ మంది నాయకుల్లో ఉందంటున్నారు. దీంతో లిస్ట్‌ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆశావహులు.

Also Read: Story Board: బీఆర్ఎస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్స్.. గట్టెక్కాలంటే స్కీములే శరణ్యమా?

తెలంగాణతోపాటు ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలో ఇప్పటికే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. కానీ… ఇక్కడ మాత్రం మీన మేషాలు లెక్కించడం ఏంటో అర్ధం కావడంలేదట పార్టీ నేతలకు. పక్క పార్టీలు ఫుల్‌ స్వింగ్‌లో పని చేసుకుంటుంటే… తాము మాత్రం టిక్కెట్‌ వస్తుందో రాదోనన్న గందరగోళంలో చేతులు కట్టుకుని కూర్చోవాల్సి వస్తోందన్న ఆందోళన ఎక్కువ మంది తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అధికారిక ప్రకటన రాకున్నా… అంతో ఇంతో కాస్త క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే జాతీయ నాయకుల పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తోందట పార్టీ. కాస్త ముందో, వెనకో… ఫలానా రోజున లిస్ట్‌ ప్రకటిస్తారన్న క్లారిటీ ఉంటే… నింపాదిగా ఉండవచ్చని, ఆ స్పష్టత కూడా లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు టి బీజేపీ నాయకులు. మరోవైపు తాను రెండు చోట్ల పోటీ చేస్తానని అంటున్నారు ఈటల రాజేందర్. హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కూడా సీఎం కేసీఆర్‌ మీద పోటీ చేస్తానని అంటున్నారాయన. మరి అలా రెండు చోట్ల పోటీకి పార్టీ అనుమతిస్తుందా అన్న డౌట్స్‌ వస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి స్టేట్‌మెంటే ఇచ్చి ఉన్నారు ఈటల. అయితే… ఈసారి మాత్రం హైకమాండ్‌ అనుమతితోనే మాట్లాడి ఉంటారని అంటున్నాయి పార్టీ వర్గాలు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ ముఖ్యులు సిద్దరామయ్య, డికే శివకుమార్‌లపై పోటీ చేసిన నాయకులు రెండు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నారు. అందులో ఒకటి తమ సొంత నియోజకవర్గం కాగా.. రెండోది కీ సెగ్మెంట్‌. తెలంగాణలో కూడా అదే ప్రయోగం చేయవచ్చంటున్నారు. మరి లిస్ట్‌ విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి.