Site icon NTV Telugu

Off The Record about Telangana BJP Leaders: టీబీజేపీలో సీఎం పదవి కోసం రేస్‌..! అధికారంలోకి రాకముందే సీఎం పీఠంపై ఆశ

Bjp Leaders

Bjp Leaders

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కైవశం చేసుకుంటుందో క్లారిటీ లేదు. కానీ.. అధికారంలోకి వస్తామనే ధీమాతో మాత్రం కమలనాథులు ఉన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని గట్టి వ్యాఖ్యానాలే చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందని.. ప్రజలు తమవైపే చూస్తున్నారని చెప్పుకొస్తున్నారు నాయకులు. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొందరు నాయకులు మరో అడుగు ముందుకేసి.. కీలక పదవులపై సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు. అదే కమలంపార్టీలో తాజాగా రచ్చ లేపుతోంది.

ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కీలక నేతలు పదవులపై తమ మనసులో ఉన్న మాటను బయట పెడతున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే ప్రశ్నను చర్చల్లోకి తీసుకొస్తున్నారు. గతంలో బీజేపీలో సీఎం అయ్యే అర్హతలు ఉన్నవారు ఎవరు అనే ప్రశ్న వినిపించేది. ఇప్పుడు ఆ ప్రశ్నకు తావులేకుండా ఆ పార్టీ నేతలే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. తాము కూడా రేస్‌లో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. అందుకు తమకున్న అర్హతలను ఏకరవు పెడుతున్నారు నాయకులు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలు కాషాయం శిబిరంలో ప్రస్తుతం అలజడి రేపుతున్నాయి. గతంలో పదేళ్లు మంత్రిగా చేసిన తనకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని డీకే అరుణ చేసిన కామెంట్స్‌తో ఉలిక్కిపడ్డారు కమలనాథులు. ఇంతలో ప్రజలు కోరుకుంటే తప్పకుండా సీఎంను అవుతానని ఈటల అనడంతో ఇదేం గొడవ అని బీజేపీ నేతలు తల పట్టుకున్నారట. పైగా ఓ సర్వేలో తెలంగాణ ప్రజలు ఈటల సీఎం కావాలని కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహితులు ప్రచారం కూడా మొదలు పెట్టేశారు.

డీకే అరుణ.. ఈటల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీలో సీఎం పదవికి మరికొన్ని పేర్లూ చర్చల్లో ఉన్నాయి. పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలాంటి వారి పేర్లు చూట్టూ తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అప్పట్లో సంజయ్‌ సీఎం రేస్‌లో ఉన్నారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చేసిన ప్రకటనపై కొంతకాలం చర్చ సాగింది. వాస్తవానికి బీజేపీలో ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించే సాంప్రదాయం లేదు. ఆ విధమైన చర్చకు ఆస్కారం కల్పించదు అధిష్ఠానం. అలాంటి ఆలోచన చేస్తే ఢిల్లీ నుంచి చీవాట్లు తప్పవు. ఆ సంగతి పార్టీ పెద్దలకు తెలియంది కాదు. అయినప్పటికీ నాయకులు ఎందుకలా స్పందిస్తున్నారు అనేది ప్రశ్న. బిజెపిలో సీఎం అభ్యర్థుల అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో అని చర్చ జరుగుతుంది. ఈ ప్రచారాలు పార్టీకి మేలు చేస్తాయో, కీడు చేస్తాయో తెలియదు. పార్టీ శ్రేణులు మాత్రం ఇదేమి లొల్లిరా నాయన అని తలపట్టుకుంటున్నారట. మరి.. ఆలు లేదు చూలు లేదన్నట్టుగా సాగుతున్న నేతలపై ఢిల్లీ పెద్దలు వైఖరి ఏంటో కాలమే చెప్పాలి.

Exit mobile version