Site icon NTV Telugu

OFF The Record: తెలంగాణలో బీజేపీ బలమెంతో ఈనెల 7న తెలిసిపోతుందా?

Telangana Bjp

Telangana Bjp

OFF The Record: తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని కమలంపార్టీ గట్టిగా చెప్పుకొంటోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఢంకా బజాయిస్తున్నారు నేతలు. మరి.. క్షేత్రస్థాయిలో బీజేపీకి ఆమేరకు బలం.. బలగం ఉందా? అది తెలుసుకోవడానికే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారా? ఆ భేటీ తర్వాత క్లారిటీ వచ్చేస్తుందా? ఇంతకీ ఏంటా సమావేశం?

తెలంగాణలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఏంటి? పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా కమలనాథులు ఏం చేస్తున్నారు? తమకు బలమని చెబుతున్న బూత్‌ కమిటీలు ఎంత వరకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ నెల 7న బీజేపీ నేతలకు దొరకనుంది. తెలంగాణలో 34 వేలకుపైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 250కిపైగా పోలింగ్‌ బూత్‌లు ఉంటాయి. వీటిపైనే దృష్టిపెట్టాయి బీజేపీ శ్రేణులు. వాస్తవానికి బీజేపీలో ఎన్నికల వ్యూహాలన్నీ పోలింగ్‌ బూత్‌ కేంద్రంగానే జరుగుతూ ఉంటాయి. బూత్‌ కమిటీలే తమ బలమని.. అవే తమను ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని భావిస్తారు నాయకులు. పోలింగ్‌ బూత్‌ను గెలిస్తే అసెంబ్లీని గెలిచినట్టేనని కమలనాథులు చెబుతారు.

తెలంగాణలోనూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది బీజేపీ. పోలింగ్‌ బూత్‌ కమిటీలు వేయడంపై కసరత్తు చేస్తున్నారు నాయకులు. కొన్ని నెలలుగా ఈ అంశంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమో.. అన్ని కమిటీలు వేశాం.. ఇన్ని కమిటీలు పూర్తయ్యాయి అని ఓ రేంజ్‌లో లెక్కలు వేసి.. బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు పంపించారు జిల్లా నాయకులు. వారు ఇచ్చిన గణాంకాల ప్రకారం పార్టీకి రాష్ట్రంలో 25 వేల పోలింగ్‌ బూత్‌ కమిటీలు కొలిక్కి వచ్చాయట. ఒక్కో పోలింగ్‌ బూత్‌ కమిటీలో 22 మంది ఉండాలి. ఒక అధ్యక్షుడు.. ఒక సోషల్‌ మీడియా కన్వీనర్‌తోపాటు.. 20 మంది సభ్యులు ఉండాలి. ఈ లెక్కన చూస్తే ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి. ఇక రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ బూత్ స్థాయి కార్యకర్తల బలమే 5 లక్షలుగా లెక్క తేలుతోంది. చెప్పుకోవడానికి ఈ లెక్కలు ఘనంగా ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని తెలుసుకుని.. రాష్ట్రంలో తమ బలాన్ని అంచనా వేసుకోవడానికి చూస్తున్నారు కమలనాథులు.

ఈ నెల 7న పోలింగ్‌ బూత్‌ సమ్మేళనాలను ఏర్పాటు చేసింది బీజేపీ. 119 నియోజకవర్గాల్లో ఈ సమ్మేళనాలు జరుగుతాయి. వీటిని ఉద్దేశించి వర్చువల్‌గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఈ సమావేశాలకు వచ్చే వారి సంఖ్య.. అలాగే బూత్‌ కమిటీల వాస్తవ చిత్రం పార్టీ నేతలకు అవగతం అవుతుంది. పేపరు మీద ఉన్న లెక్కలకు.. మీటింగ్‌కు వచ్చిన వారి లెక్కతో పోల్చుకుంటే పరిస్థితి తేటతెల్లం కానుంది. సంస్థాగతంగా బీజేపీ బలపడిందా లేదా? ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి? కమిటీల పేరుతో నాటకాలు ఆడింది ఎవరో తెలిసిపోతుందని కమలనాథులు చెబుతున్నారు. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ఏ స్థాయిలో పోరాటం చేయొచ్చో.. ఎంత వరకూ రాణించగలమో తెలుస్తుందని అనుకుంటున్నారు.

ఎక్కడికక్కడ కేంద్ర పార్టీ నుంచి ఓ వ్యక్తి పరిశీలన
సమ్మేళనాలకు వచ్చే వారంతా తప్పకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఏ బూత్‌ నుంచి వచ్చారో తెలుస్తుంది. ఈ సమాచారాన్ని ప్రతి అసెంబ్లీ పరిధిలో కేంద్ర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి పరిశీలిస్తారట. తద్వారా ఢిల్లీ నాయకత్వమే ఇక్కడి పరిస్థితిని నేరుగా అంచనా వేసే అవకాశం చిక్కుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలు ఏ మేరకు రాణించగలరో బూత్‌ కమిటీల సమ్మేళనాలు తేల్చేస్తాయిని.. అందుకే ఈ సమ్మేళనాలను ఢిల్లీ పెద్దలే పెట్టించారని టాక్‌. ప్రస్తుతం బీజేపీ శిబిరంలో అందరి చూపు ఏడున జరిగే సమ్మేళనాలపై నెలకొంది.

 

Exit mobile version