Site icon NTV Telugu

OTR about Telangana BJP: బీజేపీ ఆఫీసు గడప తొక్కేందుకు ధైర్యం చేయని నేతలు..? కారణం అదేనా..?

Bjp

Bjp

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ముందస్తు ఎన్నికలపైనా ప్రచారం జరుగుతోంది. రాబోయే మూడు నాలుగు నెలలు కమలం పార్టీకి కీలకం. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కూడా ముఖ్యమే. అందుకు పెద్దఎత్తున చేరికలు అవసరం. అయితే బీజేపీలో అనుకున్నంతగా చేరికలు లేవు. ఎప్పటికప్పుడు కాషాయ శిబిరంలో చేరికల జాతర ఉంటుందని భావించినా.. ఆ ఛాయలు కనిపించడం లేదు. బీజేపీ నాయకులు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాషాయ కండువా కప్పుకోవాలని ఆహ్వానిస్తున్నా ఆసక్తి చూపించడం లేదు. పలానా వాళ్లు బీజేపీ తీర్థం పుచ్చుకొంటారని జోరుగా ప్రచారం జరుగుతున్నా.. ఎవరూ పార్టీ ఆఫీసు గడప తొక్కేందుకు ధైర్యం చేయడం లేదు.

Read Also: Off The Record: తెరమీదకు గుడివాడ పంచాయతీ

బీజేపీలో చేరికలపై కమిటీ వేసినా.. బిజెపి ముఖ్యనేతలు ప్రత్యేక దృష్టి పెట్టినా.. కేంద్ర నాయకత్వం పదేపదే చెబుతున్నా.. ఆ మేరకు అడుగులు పడితే ఒట్టు. ఏదో అడపా దడపా అప్పుడోకరు ఇప్పుడొకరు అన్నట్టుగా బీజేపీ గూటికి వస్తున్నారు. అదేస్థాయిలో మరికొందరు పార్టీ నేతలు బీజేపీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. బీజేపీలో చేరితే భరోసా ఇచ్చేవారు ఎవరో క్లారిటీ లేక నేతలు ముందుకు రావడం లేదనే వాదన ఉంది. కాషాయ కండువా కప్పుకొంటే తమకు సీటు వస్తుందనే నమ్మకం లేదని.. కమిట్‌ కావడం లేదట. ఇతర పార్టీల ప్రముఖులు బిజెపితో టచ్‌లో ఉన్నా.. వారితో మాట్లాడుతున్నా సానుకూలంగా స్పందిస్తున్నా.. సీటుపై హామీ ఇవ్వలేని పరిస్థితి.

ఎవరైనా పార్టీ మారుతున్నారు అంటేనే.. సీటుపై హామీ కోరుతున్నట్టు లెక్క. ఆ మేరకు భరోసా లభిస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటారు. బీజేపీలో సీటుపై నమ్మకం లేకపోతే ఎవరు ఆసక్తి కనబరుస్తారనేది ప్రశ్న. సీటు విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే వస్తామని చాలా మంది నేతలు చెబుతున్నారట. బీజేపీ పెద్దలు మాత్రం ముందు మీరు రండి.. సీటు గురించి తర్వాత చూద్దామని చెబుతున్నారట. ఆ ఒక్క మాటతోనే చర్చలకు బ్రేక్‌ పడుతున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని డిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. ముందుగా సీటుపై హామీలు ఉండబోవని స్పష్టం చేస్తున్నారట. బీజేపీలో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన ఉండబోదని.. అది పార్టీ లైన్ కాదని ఎదురు తలంటుతున్నారట. ఎన్నికల టైమ్‌లో సర్వేల ఆధారంగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని బీజేపీ ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నారట. దీంతో కాషాయ శిబిరానికి వచ్చేందుకు చాలా మంది నాయకులు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్రమంతా బీజేపీ విస్తరించని తరుణంలో ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో? అప్పటి వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని కొందరు నేతలు ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉన్నారట. మరి.. ఈ సమస్యను బీజేపీ ఎప్పటికి అధిగమిస్తుందో..?

Exit mobile version