Off The Record: నందమూరి కుటుంబానికి, టీడీపీకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అట్నుంచి వచ్చే ఆశీస్సులు, ఆదేశాల కోసం అర్రులు చాచే తెలుగుదేశం నాయకులకు కొదవే లేదు. కానీ… మారుతున్న పరిస్థితులు, సమీకరణల దృష్ట్యా లెక్కలు మారిపోతున్నట్టే కనిపిస్తోంది. ఆ మార్పు ఇన్నాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌కే పరిమితం కాగా… ఇప్పుడు ఆయన సోదరుడు కళ్యాణ్‌రామ్ వంతొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా కాకినాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు కళ్యాణ్‌రామ్. పైగా… రెండు రోజులపాటు అక్కడే ఉన్నారు. అయినాసరే…ఏ ఒక్క ఎమ్మెల్యే ఆయన్ని కలిసే ప్రయత్నం చేయలేదట. సాధారణంగా నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా ఇలా బయటికి వచ్చి ఒకటి రెండు రోజులు ఉంటే… స్థానిక టీడీపీ నాయకులు వెళ్ళి వాళ్ళని మర్యాద పూర్వకంగా కలుస్తారు. కానీ… కాకినాడ టీడీపీ నాయకులు మాత్రం ఈసారి కళ్యాణ్‌రామ్‌ని పట్టించుకోకపోవడం గురించి సొంత కేడరే గుసగుసలాడేసుకుంటోంది. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుటుంబ సభ్యులు పెట్టిన ఓ రెస్టారెంట్ ఓపెనింగ్‌కి కుటుంబంతో సహా వచ్చారు కళ్యాణ్. హరికృష్ణ కుమార్తె సుహాసిని, చుండ్రు శ్రీహరి బంధువులు. పైగా… ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు మేనల్లుడు కూడా ఇందులో పార్టనర్.
ఆ సంగతి అలా ఉంచితే… ఇప్పుడు టీడీపీ లీడర్స్ కళ్యాణ్‌కు ముఖం చాటేయడం గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు తూర్పు గోదావరిలో. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో కాస్త చనువున్న ద్వితీయ శ్రేణి ప్రస్తావిస్తే…. మీరు ఊరుకోండ్రా బాబూ…దాని గురించి చర్చ పెట్టి మమ్మల్ని ఇరికించొద్దురా నాయనా… అంటూ దండం పెడుతున్నట్టు సమాచారం. పైన పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఎంత తప్పించుకు తిరిగితే అంత ధన్యులం అవుతాం. ఏదో… మర్యాదకని పోయి.. ఆయన్ని బాగున్నారా అని పలకరిస్తే… రేపు మేం బాగుంటామో లేదో తెలియదు. ఇక్కడ ఎవరు ఎవర్ని కలిసినా అన్నీ పైకి వెళ్ళిపోతాయి. అందుకే నోరు మూసుకోవడం బెటర్ అని చెప్పేస్తున్నారట. మనకు అంతా బాగున్నప్పుడు మర్యాదలకు పోయి కోరి తలనొప్పులు తెచ్చుకోవడం అవసరమా అన్నది కాకినాడ టీడీపీ నాయకుల క్వశ్చన్. పార్టీ పెద్దలు, కళ్యాణ్‌రామ్ బ్రదర్స్‌కు మధ్య ప్రస్తుతానికి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, అలాంటప్పుడు మనం ఓవర్‌గా ఇన్వాల్వ్ అయిపోయి ఇరుక్కోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటూ టీడీపీ నేతలు సన్నిహితులకు సర్ది చెప్పినట్టు తెలిసింది.
అదే సమయంలో కార్యక్రమానికి అటెండ్ అయిన ఒకరిద్దరి గురించి కూడా చర్చ జరుగుతోంది. వ్యాపారంలో తన కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉంది కాబట్టి ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు వచ్చారని, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అదే సామాజికవర్గం కాబట్టి వాళ్ళ తరపున అటెండ్ అయి ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. అయితే… తన అటెండెన్స్ గురించి వర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారట. నాకు బౌండరీస్ లేవు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తా….. పెద్దవాళ్ల వ్యవహారాలు వాళ్లు చూసుకుంటారు, మనం కలవడంలో తప్పేముందని ఆయన క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరూ తప్ప మిగతా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మామూలుగా చిన్న షాపు ఓపెనింగ్ అయినా వదలకుండా వెళ్ళిపోయే ఎమ్మెల్యేలు… ఇక్కడ భారీ ప్రోగ్రామ్ పెట్టినా… తమకు ఏ మాత్రం సంబంధం లేదన్నట్టు ఉండటానికి పొలిటికల్ భయాలే కారణం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అప్పటికీ పట్టు వదలని కార్యకర్తలు మీరు కూడా వర్మలాగే కళ్యాణ్‌రామ్‌తో కలిసి వేదిక పంచుకుంటే తప్పేముందని ప్రశ్నిస్తుంటే… అవన్నీ మీకు తెలియదు, అనుభవించే మాకే తెలుస్తుందంటూ టీడీపీ లీడర్స్ అసహనం వ్యక్తు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరైనా అభిమానం కొద్దీ ఫ్లెక్సీలు పెట్టినా… తమను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దని ముందే చెప్పేశారట. మనం ఊరికే వెళ్లి పక్కన కూర్చున్నా… దాన్ని చిలువలు పలువలు చేసి చేర్చాల్సిన చోటికి చేర్చే వాళ్ళు తాలామందే ఉంటారు. అందుకే మేం మా స్టైల్లో జాగ్రత్త పడ్డాం, ఇక ఆ టాపిక్ వదిలేయమని అనుచరులకు చెప్పినట్టు తెలిసింది. మీ అభిమానాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. అందుకు మమ్మల్ని బలి చేయవద్దని చెప్పినట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. మొత్తానికి నందమూరి హీరో వచ్చినా తమ్ముళ్లు మాత్రం కర్టసీకి కూడా కలవకపోవడం హాట్ టాపిక్ అయింది. దాంతో ఎవరి అవసరాలు వాళ్ళవి అంటూ నిట్టూరుస్తున్నారు టీడీపీ కార్యకర్తలు