Off The Record: తాడికొండ వైసీపీలో తన్నులాట.. అసలు ఏం జరుగుతోంది?

  • తాడికొండ వైసీపీలో అంతా గందరగోళమే..
  • డైమండ్‌బాబు ఇన్ఛార్జ్‌ అయ్యాక మారిన పరిస్థితులు..
  • ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారంటూ నిరసనలు..
  • గుంటూరులో పార్టీ నేతల మీటింగ్‌, అధిష్టానానికి అల్టిమేటమ్‌..
  • జగన్‌ బెంగళూర్‌ వెళ్లే ఫ్లైట్‌లో టిక్కెట్స్‌ బుక్‌ చేసుకుని మరీ ఫిర్యాదులు..
  • తాజాగా వెన్నుపోటుకు రెండేళ్ళులో సీన్‌ రివర్స్‌..
  • డైమండ్‌ బాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన కార్యకర్తలు..
  • తాడికొండ గ్రామ పదవిని రూ.3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణ..

Off The Record: ఏపీ రాజధాని అమరావతి ఉన్న కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం తాడికొండ. 2024లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఓడిపోయారు. తర్వాత కొన్నాళ్లపాటు పార్టీకి దూరంగా ఉన్నారామె. దీంతో వైసీపీ అధిష్టానం గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును సమన్యయకర్తగా నియమించింది. ఇక అప్పటి నుంచి అంతా గందరగోళమే. స్థానిక నాయకులు, కార్యకర్తల మాటల్ని డైమండ్ బాబు అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా స్థానిక నాయకుల మాటలను లెక్కచెయ్యకుండా తనకు అనుకూలమైన వారికే పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నియోజకవర్గంలో తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలున్నాయి. గతంలో వివిధ సామాజికవర్గాలకు చెందిన వారికి మండల అధ్యక్ష పదవులు ఇస్తూ అందర్నీ కలుపుకుని వెళ్లేవారు. కానీ డైమండ్ బాబు మాత్రం ఒకే సామాజికవర్గానికి మూడు మండలాల అధ్యక్ష పదవులు కట్టబెట్టారు. దానిపై పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తం అయింది. అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. చివరకు తాడికొండ మండల అధ్యక్ష పదవిని డైమండ్ బాబు పెట్టిన వ్యక్తికి కాకుండా మరో సామాజికవర్గానికి ఇవ్వాల్సి వచ్చింది.

మరో మండల అధ్యక్షుడిని కూడా మార్చాలని అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారట లోకల్‌ లీడర్స్‌. ఈ వ్యవహారం పార్టీలో కాకరేపింది. దీంతో ఏకంగా మాకు ఈ సమన్వయకర్త వద్దంటూ అసంతృప్త నేతలంతా గుంటూరులో మీటింగ్ పెట్టి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అనేకసార్లు పార్టీ పెద్దలను కలిసి డైమండ్ బాబు వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేశారు. అంతేకాదు కొంతమంది నేతలైతే… జగన్ బెంగళూరు వెళ్లే సమయం చూసుకుని సరిగ్గా అదే ఫ్లైట్ లో ప్రయాణిస్తూ నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు, డైమండ్ బాబు వ్యవహరిస్తున్న తీరుపై అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారంటే… పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇక పార్టీ పదవులు కట్టబెట్టే వ్యవహారంలో కూడా ఇన్ఛార్జ్‌ టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి పదవులు కేటాయిస్తున్నారంటూ ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి చూపించారట.

×
×
Ad

ఇక తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధిష్టానం పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాలతోపాటు తాడికొండలో కూడా కార్యక్రమం భారీగా జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కార్యక్రమంలో భాగంగా… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చెయ్యనందుకు వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చెయ్యాలి. కానీ ఇక్కడ మాత్రం… ఆ పని మానేసి సొంత సమన్వయకర్త మీదే నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొంతమంది నాయకులైతే… డైమండ్ బాబు తాడికొండ గ్రామ పార్టీ అధ్యక్ష పదవి మూడు లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. పార్టీ జెండాలతో ఆయన ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. పార్టీ పదవి కట్టబెట్టడానికి డబ్బులు ఎందుకు తీసుకున్నావంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే సొంత పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని ఇన్ఛార్జ్‌ ప్రశ్నిస్తున్నవారిని నెట్టుకుంటూ వెళ్లిపోయారు. ఆ రకంగా రాజధాని ప్రాంతం ఉన్న తాడికొండ నియోజకవర్గంలో అసమ్మతి పీక్స్‌కు చేరడం పార్టీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చెయ్యాల్సిన కార్యక్రమంలో సొంత పార్టీ సమన్వయకర్త మీదే నిరసన తెలిపి ఘెరావ్ చెయ్యడంపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టిందట. అసలు తాడికొండలో ఏ జరుగుతోందో పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.