Off The Record : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట…రాజకీయ నేతలకు అదొక సంపన్న నియోజకవర్గం. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటంతో…ఈ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకు అధికార పార్టీలోని కీలక నేతలు పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో వైద్యురాలు నెలవల విజయశ్రి 25వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికైనా…పెత్తనమంతా వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. విజయశ్రీకి ఆర్థికంగా అండగా నిలబడటంలో, టికెట్ ఇప్పించడంలో ఓ పారిశ్రామికవేత్త కీలకపాత్ర పోషించారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే విజయశ్రీని కాదని.. ఆయన తండ్రి నెలవల సుబ్రమణ్యం ఫ్రేంలోకి వచ్చారట. ప్రతి దాంట్లో వేలు పెడుతూ.. అంతా తాను చెప్పినట్లే జరగాలని ఆదేశాలిస్తున్నారట. విజయశ్రీ కుటుంబం జోక్యం ఎక్కువ కావడంతో…పారిశ్రామికవేత్తతో పాటు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యేను పిలిపించిన అధిష్ఠానం…కేడర్‌ను కలుపుకొని వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.
అధిష్టానం సీరియస్ కావడంతో కొద్ది రోజులు సైలెంట్ అయిన నెలవల సుబ్రహ్మణ్యం…మళ్లీ పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడం స్టార్ట్ చేశారట. అధికారులు, పార్టీ నేతలందరూ తన వద్దకే రావాలని సూచిస్తున్నారట. నాయుడుపేటను కేంద్రంగా చేసుకుని ఆయన రాజకీయాలు చేస్తున్నారట. తిరుపతి ఎంపీగా.. సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన అనుభవం ఉండటంతో.. ఆయనే చక్రం తిప్పుతున్నారట.. తాను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌నని చెప్పుకుంటూ…ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటున్నారట సుబ్రమణ్యం. గతంలో ఇసుక, గ్రావెల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో..ఓ పారిశ్రామికవేత్తతో నెలవలకు బాగా గ్యాప్ వచ్చిందట. అదే గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందనేది లోకల్‌గా వినిపిస్తోంది. అధిష్టానం మందలించిన తర్వాత ఎమ్మెల్యే విజయశ్రీ నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు కేడర్ చర్చించుకుంటోంది. అయితే ప్రతిదాంట్లో నెలవల సుబ్రహ్మణ్యం ఇన్వాల్వ్ అవుతుండటంతో… ఆమె కూడా తండ్రి తీరుపై విజయశ్రీ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. తాను రాజకీయంగా రాణించకపోతే.. భవిష్యత్తు ఉండదనే బెంగలో సదరు ఎమ్మెల్యే ఉన్నారట. దీంతో అధికారులను, నేతలను కలుపుకొని వెళ్తున్నారు. ఇదే సమయంలో తండ్రి నెలవల సుబ్రహ్మణ్యానికి పోటీగా రాజకీయం చేసేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం తెలుగు తమ్ముళ్లలో జరుగుతోంది.
ఇక్కడి వరకు ఎలాంటి సమస్య లేకపోయినా…తండ్రి, కూతుళ్లు వైసీపీ నేతలకు పనులు చేయడాన్ని లోకల్ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. వారిపై గుర్రుగా ఉందట.. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా.. ఫ్యాన్ పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటాన్ని కొందరు తెలుగు తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఒక్కరిద్దరూ వైసీపీ నేతలు సైతం నెలవల సుబ్రహ్మణ్యంతో ఉన్న పాత పరిచయాల కారణంగా పనులు చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం లోకల్‌గా ఉండే టీడీపీ క్యాడర్‌కి ఇబ్బందికరంగా మారినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్త వర్గాన్ని…ఎమ్మెల్యే వర్గం దూరం పెట్టడం నియోజకవర్గంలో విభేదాలకి కారణమైందట. ఇటీవల మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ కీలక నేతకు రాష్ట్రస్థాయి డైరెక్టర్ పదవి వచ్చింది. ఆ వ్యక్తి పారిశ్రామికవేత్త అనుచరుడు కావడంతో ఎమ్మెల్యే వర్గం దూరం పెతున్నారని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది. ఈ వ్యవహారంపై అధిష్టానం మరోసారి జోక్యం చేసుకుని.. అందరినీ కలుపుకు పోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఆమె తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం, పారిశ్రామికవేత్త ఎవరికి వారన్నట్లుగా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. దీంతో కేడర్ అయోమయంలో పడిపోయింది. నేతల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే…వచ్చే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని సొంత పార్టీ కేడర్ హెచ్చరిస్తోంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు నేతల మధ్య విభేదాలు సర్దుమణుగుతాయో లేదో చూడాలి.
