Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె రాజకీయం కాస్త డిఫరెంట్. డెల్టా ఏరియాలో కీలకమైన సెగ్మెంట్ ఇది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన అనగాని సత్యప్రసాద్ విజయంసాధించారు. దీంతో రేపల్లె టీడీపీ అడ్డాగా మారింది. మరోవైపు 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా గెలిచిన మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీనుంచి వరుసగా 2014, 2019లో పోటీచేసి అనగాని చేతిలో ఓడిపోయారాయన. దీంతో వైసీపీ అధిష్టానం మోపిదేవిని కాదని డాక్టర్ ఈవూరి గణేష్‌ను రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్‌గా ప్రకటించింది. ఇక 2024లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన గణేష్ ఓటమిపాలయ్యారు. తర్వాత కూడా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్నారాయన. కానీ… పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మినహా యాక్టివ్‌గా ఉండటం లేదన్నది రేపల్లె వైసీపీ వర్గాల మాట. కార్యకర్తలకు అండగా నిలబడడం, అగ్రెసివ్‌గా ముందుకెళ్లడంలో ఆయన వెనుకబడ్డట్టు చెప్పుకుంటున్నారు. అధికారపార్టీ నేతలు చేస్తున్న దందాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం, విమర్శలు చెయ్యడంలోకూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న అసంతృప్తి సైతం వైసీపీ కేడర్‌లో ఉందట.
ఈ పరిస్థితుల్లో… ఇటీవల రేపల్లె ఇన్ఛార్జ్ మార్పుపై తెగ చర్చలు జరుగుతున్నాయి వైసీపీలో. అధిష్టానం కూడా ఆయన పని తీరు విషయంలో సంతృప్తిగా లేదని, మార్పు తధ్యమన్న చర్చలు నడుస్తున్నాయి. నెల రోజుల క్రితం మాజీ మంత్రి విడదల రజిని రేపల్లె వైసీపీ ఇన్ ఛార్జిగా వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక్కడ టీడీపీ, వైసీపీ బీసీ అభ్యర్దినే పోటీకి పెడుతున్నాయి. దాంతో… బీసీ అయిన రజినీని రేపల్లెకు పంపుతారన్న టాక్ నడిచింది. అలాగే ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు పాతిక వేలవరకూ ఉన్నాయి. విడదల రజనీ బీసీ, ఆమె భర్త కాపు కావడంతో… రెండు ఓట్ బ్యాంకులు కలిసి వస్తాయని లెక్కలేసినట్టు చెప్పుకున్నారు. కానీ… దీని మీద ఇటీవల మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చేశారు. తాము మళ్లీ చిలకలూరిపేట నుంచే పోటీ చేస్తానని, రేపల్లె ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల రేపల్లెలో కాపు కార్తీక వన సమారాధన జరిగింది. ఈ సమావేశానికి రేపల్లె నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు.
ఈ మీటింగ్‌లో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో రేపల్లెలో కాపు అభ్యర్ది పోటీలో ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారాయన. 1989లో రేపల్లెనుంచి తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. తన తర్వాత ఇప్పటివరకూ ఏ కాపు అభ్యర్ది ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యలేదన్నారు. అయితే తాను రేపల్లె వస్తానని అనుకోవద్దని, తాను పోటీ చేసేందుకు వేరే నియోజకవర్గం ఫిక్స్ అయ్యిందని కూడా చెప్పారు అంబటి. దీంతో మరోసారి రేపల్లె వైసీపీ ఇన్ చార్జి మార్పు ప్రచారం తెరపైకి వచ్చింది. ఇలా ఇద్దరు మాజీ మంత్రులు తేల్చిచెప్పినా కూడా ఇన్ చార్జి మార్పు ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ ఆశించినంత దూకుకుడా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రచారాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. వోవరాల్‌గా చూసుకుంటే మాత్రం… గణేష్ పోస్టు డేంజర్‌లో పడినట్లేనని గట్టిగా నమ్ముతున్నాయి రాజకీయవర్గాలు.