Off The Record: తూర్పుగోదావరి జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయనేంటి…. ఇలా అయిపోయారేంటి…. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సోము వీర్రాజు ఇలా కామ్‌గా మారిపోయారేంటి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ గట్టిగానే ఉందా అంటూ…. రకరకాల విశ్లేషణలు చేసేస్తూ ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు. ఈ మౌనం వ్యూహాత్మకమా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. ఫైర్ బ్రాండ్ నుంచి ఫ్రెండ్లీ టోన్‌కు ఎందుకు మారారంటూ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మిత్రపక్షమా? కాదా..? అన్నదాంతో సంబంధం లేకుండానే… ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పైకి ఒంటికాలి మీద లేచేవారు సోము వీర్రాజు. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూసిన సందర్భాలు సైతం ఉన్నాయంటారు పొలిటికల్ పండిట్స్.
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారాయన. అప్పుడు మిత్రపక్షంగా ఉన్నా కూడా… స్పేర్ చేయలేదు. సరే….. అధికారంలో ఉన్నారు కాబట్టి విమర్శలు, ఆరోపణలు చేసి ఉండవచ్చుగానీ…. 2019-24 మధ్య ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సోము వీర్రాజు టీడీపీని విడిచిపెట్టలేదు. ఆ దెబ్బకు మా మద్దతుతో ఎమ్మెల్సీ అయి మమ్మల్నే టార్గెట్ చేస్తారా అంటూ సైకిల్ నాయకులు సోమును ప్రశ్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి.
14-19 మధ్య టీడీపీకి అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వ ఇసుక విధానం, అవినీతి ఆరోపణలు, స్థానిక సమస్యలపై గట్టిగా స్పందించేవారు సోము. మధ్యలో తేడా వచ్చిందిగానీ, నాడు, నేడు టీడీపీకి పవర్ ఉన్నప్పుడు బీజేపీ మిత్రపక్షమే. కానీ… సోము వీర్రాజు వైఖరిలోనే మార్పు కనిపిస్తోందని అంటున్నారు. అప్పట్లో అంతలా చెలరేగిపోయి ఇప్పుడు కామ్‌గా ఉండటం వెనక భారీ వ్యూహమే ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఏపీ కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారట ఈ బీజేపీ సీనియర్. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయమని చెబుతున్న టైంలో… అనవసరంగా హైపర్ అయిపోయి ఏదేదో మాట్లాడ్డం వల్ల లాభం లేకపోగా నష్టం జరుగుతుందని, అందుకే…. ఆయన ప్రస్తుతం నోటికి తాళం వేశారన్నది తూర్పు గోదావరి టాక్. గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా… తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలు జోరుగా జరుగుతున్నాయని, ఆ సంగతి తెలిసి కూడా సోము వీర్రాజు రియాక్ట్ అవకపోవడానికి కారణం మంత్రి పదవి మీద ఆశేనన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి.
అదే సమయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన, రాజకీయ సమన్వయం కోసం సంయమనం పాటిస్తున్నట్టు కొందరు చెబుతున్నా…. మరి ఇదే సంయమనం అప్పుడేమైందన్నది ఇంకొందరి క్వశ్చన్. ఇది ఖచ్చితంగా అదేనన్నది ఈ ప్రశ్న వేస్తున్నవారి మాట. ఏపీ కేబినెట్‌లో ప్రస్తుతం ఒక్క పదవే ఖాళీ ఉంది. దాని కోసం చాలామంది రేస్‌లో ఉన్నారు. అయితే… పునర్‌వ్యవస్థీకరణలో కొందర్ని తప్పించి కొత్త వాళ్ళను తీసుకుంటారన్న లీకులు వస్తున్న టైంలో… సోము వీర్రాజు వైఖరి చర్చనీయాంశం అవుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా…. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మాత్రం అదేనన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట. ఈ మౌనం, ఆశలన్నీ సోము వ్యక్తిగతమా లేక పార్టీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయా అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
