Site icon NTV Telugu

Off The Record: టీడీపీకి అత్యంత సమస్యాత్మకంగా ఆ నియోజకవర్గం..!

Singanamala Mla Bandaru Sra

Singanamala Mla Bandaru Sra

Off The Record: తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచి సమస్యగా ఉన్న నియోజకవర్గాల్లో శింగనమల ప్రధానమైనది. ఇప్పుడే కాదు…. గత ఏడేళ్ళుగా ఇక్కడ ఏకాభిప్రాయం లేదు.. కార్యకర్తలు సంతృప్తిగా లేరు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకటే గొడవగా మారింది. అందుకు ప్రధాన కారణం 2019 ఎన్నికలకు ముందు బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడమేనన్నది లోకల్‌ కేడర్‌ చెప్పే మాట. శ్రావణి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు కొందరు. ఈ గొడవల క్రమంలో… 2024 ఎన్నికలకు ముందు కూడా ఆమెకు టికెట్ ఇవ్వవద్దంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు చాలామంది నియోజకవర్గ నాయకులు. కానీ…ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో…చివరికి బండారు శ్రావణినే ఫైనల్‌ చేసింది టీడీపీ అధిష్టానం. ఇక ఎన్నికల్లో ఆమె గెలిచాక అంతా సెట్ అవుతుందని భావించారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు సరి కదా.. మరింత ముదిరింది. ఇక్కడ మండలానికి మూడు గ్రూపులు లెక్కన మారిపోయింది వ్యవహారం. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు పార్టీ పరిస్థితి తయారైంది. దీన్ని చక్కదిద్దడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో పాటు అధినేత చంద్రబాబు కూడా చాలాసార్లు చొరవ తీసుకున్నా నో యూజ్‌. పైగా ఇక్కడ పార్టీ సమావేశాలు నిర్వహించాలంటేనే ఎమ్మెల్యే శ్రావణి తో పాటు ఇతర నాయకులు భయపడే పరిస్థితి ఏర్పడింది.

పార్టీలో మితిమీరిన స్వతంత్రం, ఆధిపత్య ధోరణి, వర్గాలు అన్నీ కలగలిసి గందరగోళపు వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సాధారణంగా… ఎవరైనా కార్యకర్తల మీటింగ్ నిర్వహించాలంటే నియోజకవర్గంలోని ఏదో ఒక మండలంలోనో లేదా నియోజకవర్గ కేంద్రంలోనో పెడతారు. కానీ… విచిత్రంగా శింగనమలకు సంబంధించిన ఏ సమావేశం జరిగినా.. అనంతపురం పట్టణంలో, అందునా….అండ్.బి గెస్ట్ హౌస్ నే వేదికగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అధిష్టానం నుంచి వచ్చిన కమిటీ సభ్యులైనా.. ఇన్చార్జి మంత్రి అయినా లేదా ఇతర ముఖ్య నాయకులు ఎవరైనా సరే…. కేరాఫ్‌ ఆర్ అండ్ బీ గెస్ట్‌ హౌసే. సరే…. ఎక్కడో ఒకచోట మీటింగ్‌ అయితే పెట్టారు… ఎలాగోలా సర్దుకుపోదామని అనుకున్నా,నాయకులు కార్యకర్తల ఆవేదన వింటారా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే. ఎప్పుడు మీటింగ్ జరిగినా ఏదో ఒక గొడవ కామన్‌ అయిపోయింది. ఇటీవల ఇన్చార్జి మంత్రి భరత్ నిర్వహించిన సమావేశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇన్చార్జి మంత్రి ఎదుటనే ఎమ్మెల్యే శ్రావణి, వేరే వర్గాల నాయకులు ఢీ అంటే ఢీ అన్నారు.

ఇలా… ప్రతిసారి గొడవ జరగడం, చివరకు పోలీసులు ఎంటరై టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్ళడం రొటీన్‌ అయిపోయింది. ఇక తాజాగా నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కమిటీలఎంపిక ప్రక్రియ జరిగింది. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో ఆర్‌ అండ్‌ బీ వేదికగానే ఈ కార్యక్రమం కూడా నిర్వహించారు. కానీ… కొందరు నాయకులను లోపలి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో మరోసారి మీటింగ్‌లో రచ్చ అయింది. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలకు ప్రయారిటి ఇచ్చే పార్టీగా చెబుతారు. కానీ శింగనమలలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని అంటున్నారు. ఎప్పుడు సమావేశాలు జరిగినా… పోలీసుల వలయంలోనే ఉంటాయి. కార్యకర్తలే పార్టీకి బలం, అన్ని నిర్ణయాలు కార్యకర్తల సమక్షంలోనే జరగాలని పార్టీ పెద్దలు తరచూ చెబుతుంటారు. ఇక్కడ మాత్రం అలాంటివేం వర్కౌట్‌ అవడంలేదని గుర్రుగా ఉంది టీడీపీ కేడర్‌. ఈ నియోజకవర్గం పరిస్థితులపై పార్టీ ముఖ్యులు సీరియస్‌గా దృష్టి పెట్టి, ఇప్పటికైనా మండల కేంద్రాల్లో కార్యకర్తల సమక్షంలో మీటింగ్‌లు నిర్వహించి పార్టీ కమిటీల్ని ఎంపిక చేయాలన్నది కార్యకర్తల డిమాండ్‌.

Exit mobile version