NTV Telugu Site icon

Off The Record: సంతనూతలపాడు వైసీపీలో ఎమ్మెల్యేపై తిరుగుబాటు..? కమ్మ సామాజికవర్గం నేతల గుర్రు

Tjr Sudhakar Babu

Tjr Sudhakar Babu

Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు. సొంత పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేకు పడటం లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనే రాజు.. నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ ద్వితీయశ్రేణి నేతల ఆరోపణ. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్‌బాబు గత ఎన్నికల సమయంలో సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా తర్వాత సొంత పార్టీ నేతలతో గ్యాప్‌ వచ్చింది. తమకు ఓ మాట కూడా చెప్పకుండా ఎమ్మెల్యే ఇష్టారీతిన అధికారులను బదిలీ చేస్తున్నారని.. నచ్చిన వారికి పనులు కేటాయిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఆ సమస్యను ఎమ్మెల్యే సరిచేసుకోక పోవటంతో గ్యాప్ పెద్దదైంది. తాజగా SNపాడులోని కమ్మ సామాజికవర్గ నేతలు డేంజర్‌ బెల్స్‌ మోగించారు.

Read Also: Off The Record: కామ్రేడ్స్‌ కంట్లో నలుసు పడిందా? వాళ్లు అనుకున్నదొక్కటీ.. అవుతోంది ఒక్కటా?

ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కమ్మ సామాజికవర్గ నేతలు ప్రత్యేకంగా మీటింగ్‌ పెట్టుకుని మరీ అసంతృప్తి వెళ్లగక్కారు. SNపాడులో కమ్మ సామాజికవర్గం ఓట్లర్లు ఎక్కువ. మొదట్లో కాంగ్రెస్‌కు ఆ తర్వాత వైసీపీకి వాళ్లంతా జైకొట్టారు. గతంలో సుధాకర్‌బాబుతో ఏ సమస్య వచ్చినా వాళ్లంతా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకొనేవారు. బాలినేని పరిధి నుంచి ప్రకాశం, బాపట్ల జిల్లాలను తప్పించడంతో వారి పరిస్థితి ఇరకాటంలో పడింది. ఎమ్మెల్యేతో ఉన్న గొడవలు ఇంకా పెరిగి పెద్దవైనట్టు తెలుస్తోంది. తనకు నచ్చిన వారిని ఒకలా.. నచ్చకపోతే మరోలా ట్రీట్‌ చేస్తున్నారని సుధాకర్‌బాబుపై ఫైర్‌ అవుతున్నారు వైసీపీలోని కమ్మ సామాజికవర్గం నేతలు. ఈ అంశంపై గడిచిన నెలలోనే రెండుసార్లు సమావేశాలు పెట్టుకున్నారట.

Read Also: Off The Record: అధినేత దృష్టిలో పడేందుకే ప్రయారిటీ..! మంత్రిపై అధిష్టానికి ఫిర్యాదులు..

రహస్య సమావేశాల గురించి ఉప్పందడంతో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారట. అయితే అవేమీ వర్కవుట్‌ కాలేదని సమాచారం. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి SNపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కమ్మ సామాజికవర్గ ముఖ్య నేతలు హాజరయ్యారట. ఇకపై తమకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకునేందుకు సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఆ కమిటీలో మండలానికి ముగ్గురు చొప్పున 12 మందిని నియమించారట. త్వరలో మాజీ మంత్రి బాలినేని దగ్గరకు వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరవు పెట్టాలని తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ SNపాడులోనే మరో సామాజికవర్గ నేతలతో ఉన్నతగవులతో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు తలబొప్పి కట్టింది .చివరకు బతిమాలో.. బామాలో.. బుజ్జగించో వారితో కుదిరి.. కుదరని ఓ సయోధ్య కుదుర్చుకున్నారట. దానిపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఇప్పుడు కొత్త జగడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం బాల్‌ బాలినేని కోర్టుకు వెళ్లనుండటంతో.. మాజీ మంత్రి ఏం చేస్తారు? అసంతృప్త నేతలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచిస్తారా? దానికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అంగీకరిస్తారా? అనేది ప్రశ్న.