NTV Telugu Site icon

Off The Record: పక్కా ప్లాన్‌..! రేవంత్‌ పాదయాత్రపై కాంగ్రెస్‌ పార్టీలో చర్చ

Revanth Reddy Padayatra

Revanth Reddy Padayatra

Off The Record: యాత్ర… ఫర్ ది చేంజ్.. అంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారు. మేడారం సమ్మక్క సారలమ్మ నుండి యాత్ర మొదలైంది. హాత్ సే హాత్ జొడో యాత్ర పేరుతో… ఐదు నెలలపాటు తిరగాలని స్కెచ్ వేశారు రేవంత్‌. దీనికి కొందరు సీనియర్లు అభ్యంతరం తెలిపారు. హాత్ సే హాత్ జోడో కాన్సెప్ట్ వేరు.. రేవంత్ యాత్ర వేరు అని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే ముందే చెప్పేశారు AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి. అయితే ఇంచార్జి థాక్రే ఒకటే అజెండాగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర చేస్తానన్నా ముందుగా షెడ్యూల్ ఇవ్వాలని షరతు పెడుతున్నారు. దీనికి అభ్యంతరం లేదని కొందరు చెప్పారట.

Read Also: Revanth Reddy: వైఎస్సార్ సెంటిమెంట్‌ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా..

పార్టీ నాయకులంతా తిరిగినా ఇబ్బంది లేదని థాక్రే అనడం.. ఒక్కరే పాదయాత్ర చేయాలనే నిబంధన పెట్టకపోవడంతో కొంత తలనొప్పి తగ్గింది అనే భావనలో ఉన్నారు నాయకులు. అయితే పాదయాత్రపై అభ్యంతరం చెప్పే వారిలో ముగ్గురు కీలక నాయకులు ఉన్నారు. కాంగ్రెస్‌ కొందరు నేతలు మరో చర్చకు తెరతీశారు. అందరూ పాదయాత్ర చేసినా… టికెట్స్‌ విషయంలో పీసీసీ చీఫ్ కీలకంగా ఉంటారు కాబట్టి… ఆయన వెంటే ఎక్కువ మంది ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. పాదయాత్ర చేసే మిగిలిన నేతల వెంట వెళ్తే టికెట్ వస్తుందో రాదో అనే డైలమా ఉంటారని అనుకుంటున్నారు. అందుకే పార్టీ నాయకులు అంతా పీసీసీ చీఫ్‌తోనే యాత్రలో ఉంటారనే లెక్కలు వేస్తున్నారట. అయితే కాంగ్రెస్‌లో అది అంత ఈజీ కాదనే అభిప్రాయం లేకపోలేదు. పీసీసీ చీప్‌నే తమ జిల్లాకు రావాల్సిన పని లేదని చెప్పేంత ప్రజాస్వామ్యం పార్టీలో ఉంది. అలాంటిది టికెట్ల కేటాయింపు ఒకరిలో చేతిలో ఉంటుందా అనేది ప్రశ్న.

తన యాత్రకు పార్టీ అనుమతి ఉందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నంలో రేవంత్‌ ఉన్నారు. అందుకే తనకు అనుకూలమైన సీతక్కనియోజకవర్గాన్ని సెంటిమెంట్‌గా ఎంచుకున్నారు రేవంత్‌. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ ఈ యాత్రలో చర్చకు పెట్టాలని కూడా అనుకుంటున్నారట. దీంట్లో భాగంగానే తన యాత్రకి యాత్ర ఫర్ ది చేంజ్ అనే టైటిల్‌ పెట్టుకున్నారు. అలాగే పాదయాత్రలో ముందు అడుగుపడితే చాలు స్పందన బట్టి అడుగుల వేగం పెంచాలనే వ్యూహంలో ఉన్నారట. ఇప్పటికే కాంగ్రెస్‌లోని సీనియర్లలో కొంతమందితో రేవంత్‌ మాట్లాడినట్టు తెలుస్తుంది. రేవంత్‌ మాట్లాడిన వెంటనే తానూ యాత్రలో పాల్గొంటానని VH ప్రకటించారు. రేణుకాచౌదరి కూడా మద్దతు పలికారు. పార్టీలో అంతర్గత అంశాలపై ముందుగా స్పందించే VHను వ్యూహాత్మకంగా రేవంత్ సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో కీలకంగా ఉన్న ముగ్గురు నాయకులు ఎలా స్పందిస్తారు అనేది ప్రశ్న. వాళ్ల వ్యూహం ఏంటో ఇంకా బయట పడలేదు. రేవంత్ పాదయాత్రలో ఏ చిన్న పొరపాటు జరిగినా.. ఆయన స్టేట్మెంట్లలో ఎక్కడ తేడా కొట్టినా కాంగ్రెస్‌లోని ప్రత్యర్థులకు ఆయన అస్త్రం ఇచ్చినట్టే. గతంలో ఉత్తమ్‌ పాదయాత్ర మధ్యలో ఆగిన సందర్భాన్ని కొందరు గుర్తు చేస్తున్నారట. మరి.. రేవంత్‌ విషయంలో ఆయనతో విభేదిస్తున్న సీనియర్లు ఏం చేస్తారో చూడాలి.