NTV Telugu Site icon

Off The Record: కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి ఆయనకే ఎందుకు ఇచ్చింది..? ఎలా వచ్చింది..?

Pcc

Pcc

Off The Record: తెలంగాణ పిసిసి చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ని నియమించింది ఏఐసీసీ. పార్టీలో సీనియర్ నాయకుల అభిప్రాయ సేకరణ తర్వాతే అధికారిక ప్రకటన వెలువడింది. అదంతా ఒక ఎత్తయితే… అసలు మొదట్నుంచి ఈ రేస్‌లో ముందు వరుసలోనే ఉన్నారు మహేష్‌గౌడ్‌. ఆ విషయంలో ఆయనకు చాలా అంశాలు కలిసివచ్చాయన్నది పార్టీ టాక్‌. అందరికీ ఆమోదయోగ్యుడు కావడం కూడా ప్లస్‌ అయిందని అంటున్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డికి సన్నిహితుడుగా పేరుంది మహేష్‌కు. ఆ తరువాత పీసీసీ ప్రెసిడెంట్ గా వచ్చిన రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగానే ఉన్నారాయన. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన కొత్తల్లో పార్టీలోని సీనియర్ నేతలకు, ఆయనకు మధ్య కొంతకాలం గ్యాప్ నడిచింది. ఆ టైంలో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో మహేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారన్నది పార్టీ వర్గాల మాట.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాంధీభవన్‌ నిర్వహణ అంతా ఆయనే చూసేవారు. దీంతో పదవుల పంపకం, ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు, సీనియర్స్‌కు రేవంత్‌కు మధ్య సమన్వయం లాంటి విషయాల్లో ఆయన పాత్ర పెరిగిందంటున్నారు. అదే ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో కూడా ప్లస్‌ అయిందన్నది నేతల మాట. దీనికి తోడు ఎన్ఎస్‌యూఐ నుంచే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు మహేష్‌గౌడ్‌. కొన్ని సందర్భాల్లో ఆఖరి నిమిషంలో పార్టీ టిక్కెట్‌ కేన్సిల్ అయినా… పక్క చూపులు చూడకుండా నిబద్దతగా పనిచేయడం మరింత కలిసివచ్చిందంటున్నారు. మరోవైపు అధికార పార్టీగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ సామాజిక సమతుల్యత పాటించాల్సిన అవసరం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉండే బీసీ, ఎస్సీలను సమతుల్యం చేసుకోవాల్సి ఉంది. ఇన్నాళ్ళు రెడ్డి సామాజిక వర్గం నుంచి పిసిసి చీఫ్‌గా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియడంతో.. ఇప్పుడు పార్టీ పగ్గాలను బీసీకే అప్పగించాలని నిర్ణయించింది హైకమాండ్‌.

బీసీ అంశాన్ని పదేపదే రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న సమయంలో తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం మహేష్‌ గౌడ్‌కు కలిసివచ్చిందని అంటున్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేయడం, సామాజికవర్గం రెండూ కలిసి మహేష్‌గౌడ్‌ని పీసీసీ పీఠం మీద కూర్చోబెట్టాయంటున్నారు పరిశీలకులు. బీసీ నుంచే ఆఖరి నిమిషం వరకు మధుయాష్కి గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే మహేష్ గౌడ్ కి పార్టీ వ్యవహారాలు, నాయకుల మధ్య సమన్వయం లాంటి అంశాల్లో సానుకూలత ఉండటం ప్లస్‌ అయిందని అంటున్నారు. ఈ పదవి ద్వారా తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్‌ని కాంగ్రెస్ పార్టీ భుజానికెత్తుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రభావవంతంగా ఉండే సామాజికవర్గాలను బ్యాలెన్స్‌ చేసే కార్యక్రమం మొదలైందని అంటున్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షపదవి ద్వారా రెడ్డి, బీసీలను సంతృప్తి పరిచారని, ఇక మరో కీలక సామాజికవర్గం మాదిగలకు ఎలాంటి ఇంపార్టెన్స్‌ ఇస్తారన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. మాదిగల్ని కూడా సంతృప్తిపరచగలిగితే సామాజిక సమతుల్యత పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అంటున్నారు.

Show comments