NTV Telugu Site icon

Off The Record about Putta Sudhakar: టీడీపీ కేడర్‌కు అంతుచిక్కని పుట్టా తీరు.. పోటీ చేస్తారా..?

Putta Sudhakar

Putta Sudhakar

Off The Record about Putta Sudhakar: పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. టిటిడి మాజీ ఛైర్మన్‌. కడ‌ప జిల్లా మైదుకూరు టిడిపి ఇంఛార్జ్‌. 2019 త‌రువాత పెద్దగా చురుగ్గాలేని పుట్టా ఇటీవ‌ల యాక్టివ్‌గా క‌నిపిస్తున్నారు. మొన్నటి దాకా నియోజకవర్గంలో పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో కనిపించింది తక్కువే. ఈ మధ్య తరచూ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. అయితే కొద్దిరోజుల కింద‌ట మైదుకూరులో కాకుండా పక్కన ఉన్న ప్రొద్దుటూరులో త‌న ఇంటి వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాల‌యంలో కనిపిస్తున్నారు. ఇదే మైదుకూరు టిడిపీలో చ‌ర్చగా మారింది. కాంట్రాక్టర్‌గా ఉన్న పుట్టా 2012లో టీడీపీలో రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో సుధాకర్‌ యాదవ్‌ తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. అయితే బలమైన పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా.. మైదుకూరులో మాత్రం సక్సెస్‌ కాలేకపోతున్నారు. పుట్టా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లకు వియ్యంకుడు. రెండుసార్లు ఓడినా పుట్టాను మైదుకూరు ఇంఛార్జ్‌గా ఉంచింది పార్టీ.

Read Also: Off The Record about Anil Kumar Yadav: మాజీ మంత్రి ఒంటరి అవుతున్నారా..? లేక మిగిలిన నేతలే ఏకం అవుతున్నారా..?

మరోవైపు సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి అసంతృప్త నేతగా కొంతకాలం వైసీపీలో ఉన్నా ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. పుట్టా కూడా డీఎల్‌ 2014 ఎన్నికల్లో తనకు మంచే చేశారని చెబుతున్నారు. ఈసారి డీఎల్‌ టీడీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మైదుకూరులో టీడీపీకి పెద్దగా ట్రాక్‌ రికార్టు లేదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985, 1999 రెండుసార్లే టీడీపీ గెలిచింది. దీనిని బట్టి చూస్తే అక్కడ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్ధం అవుతుంది. మైదుకూరులో కొత్త ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో ఈ సీటును జనసేనకు ఇస్తారన్న ఊహాగానాలు బయలుదేరాయి. అంతేకాకుండా పుట్టా కుమారుడు మహేష్‌యాదవ్‌ను నరసరావుపేట పార్లమెంట్‌ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందట. దీంతో మైదుకూరులో పుట్టా పోటీలో ఉంటారా లేదా అనే చర్చ నడుస్తోంది. నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. దీంతోపాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసొస్తాయన్న లెక్కలు వేసుకుంటున్నారట. పైగా ఆర్థికంగా స్థితిమంతుడు. ఒకే ఇంట్లో ఒక టికెట్‌ షరతు పుట్టా కుటుంబానికి కూడా వర్తింప చేస్తే మైదుకూరు టికెట్‌ మరొకరికి ఇవ్వాలన్న యోచన ఉదంట.

Read Also: Off The Record: నేను రాను బిడ్డో

ఈ పరిణామాలతో పుట్టా మైదుకూరుపై దృష్టి పెట్టడం తగ్గించారట. కొద్దిరోజులుగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై పుట్టా అవినీతి ఆరోపణలు చేశారు. ఇసుక క్వారీ అక్రమాలపై ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. ఎమ్మెల్యే వర్సెస్‌ పుట్టా అన్నట్టు మాటల యుద్ధం బాగా సాగింది. ఈ స్థాయిలో పోరాటం చేసి కూడా.. మైదుకూరును కాదని.. ప్రొద్దుటూరులో తన సొంత ఇంటిలో పార్టీ ఆఫీసు ప్రారంభించడం.. దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఆహ్వానించడం ఏంతో ఎవరికీ అంతుచిక్కడం లేదట. పుట్టా సీరియస్‌.. నాన్‌ సీరియస్‌ పొలిటికల్‌ కార్యక్రమాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్న కేడర్‌కు సందిగ్ధత ఎప్పుడు వీడుతుందో ఏమో..!