Site icon NTV Telugu

Off The Record: ఆ సీనియర్ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని కొడుక్కి రాసిచ్చేశారా..?

Mla Varadarajulu Reddy

Mla Varadarajulu Reddy

Off The Record: కడప జిల్లాలో కడప నగరం తర్వాత అత్యంత పెద్దది ప్రొద్దుటూరు. బంగారం, వస్త్ర వ్యాపారానికి పాపులర్‌. అందుకే దీన్ని చిన్న ముంబై అని కూడా పిలుచుకుంటారు స్థానికంగా. దీంతో ఈ నియోజకవర్గంలో పట్టు కోసం తహతహలాడుతుంటాయి, రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి అన్ని పార్టీలు. ఇక ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే.. ఆ లెక్కే వేరు. 2024లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున గెలిచారు సీనియర్‌ లీడర్‌ వరదరాజులురెడ్డి. కానీ… ఇప్పుడాయన పేరుకు ఎమ్మెల్యే తప్ప గ్రౌండ్‌లో ఉండటంలేదని, మొత్తం వ్యవహారాలను ఆయన కొడుకు కొండారెడ్డే షాడోలా నడిపిస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని చెలరేగుతూ.. చివరికి ప్రభుత్వ, ప్రోటోకాల్‌ కార్యక్రమాల్లో సైతం నేనేనని అంటున్నారట. అధికారుల బదిలీలు అయితే.. ముందు చిన్నసార్‌ స్టాంప్‌ పడాల్సిందేనని చెప్పుకుంటున్నారు. పనేదైనా సరే… ఆయన ఎస్‌ అంటే ఎస్‌. నో అంటే నో. మొదట్లో తండ్రి చాటు కొడుకుగా ఉన్నా… ఇప్పుడు మాత్రం పెత్తనమంతా తన చేతుల్లోకి తీసుకున్నారట కొండారెడ్డి.

Read Also: Operation Sindoor: ‘‘మాట వినకుంటే పాక్ ఖతం అయ్యేది’’.. టాప్ ఆర్మీ అధికారి సంచలనం..

86 ఏళ్ళ వయసులో ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు నంద్యాల వరదరాజుల రెడ్డి. గత ఎన్నికల్లో తన శిష్యుడైన వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఓడించారాయన. గెలిచిన ఏడాదికే తీవ్ర అనారోగ్యానికి గురవడంతో….. ఇదే అదునుగా కొడుకు కొండారెడ్డి షాడో ఎమ్మెల్యే అవతారం ఎత్తినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలకు ఆయనే హాజరవుతున్నారట. మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడం లాంటి అని ప్రోగ్రామ్స్‌లో పాల్గొని ఆయనే ఎమ్మెల్యేగా బిల్డప్‌ ఇస్తున్నారంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అందుకే అసలిప్పుడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు…. అదే ఊపులో అసెంబ్లీకి కూడా వెళ్ళి కూర్చోండంటూ ఘాటు కామెంట్స్‌ చేస్తున్నారట వైసీపీ నేతలు. శంకుస్థాపనల నుంచి అధికారుల బదిలీల దాకా… అన్నీ ఎమ్మెల్యే కొడుకు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, ఏదో చూశాంగానీ… మరీ ఇంత దారుణంగానా, ఎలాంటి హోదా లేని వ్యక్తి అంతా తానై నడిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థులు.

Exit mobile version