NTV Telugu Site icon

Off The Record: బీఆర్ఎస్‌కు పట్నం దంపతులు తలనొప్పిగా మారారా..? భర్త దారిలోనే భార్య కూడా..!

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy

Off The Record: పట్నం మహేందర్‌రెడ్డి. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఈయన కొంతకాలంగా అధికారపార్టీలో చర్చగా మారారు. ఆయన వైఖరి వల్ల పార్టీ హైకమాండ్‌ దగ్గర పంచాయితీలు అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మహేందర్‌రెడ్డికి తోడు ఆయన భార్య.. జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీత సైతం స్వరం పెంచారు. ఇప్పటి వరకు మహేందర్‌రెడ్డి ఒక్కరే అసంతృప్తిని వ్యక్తం చేసేవారు.. తనపై కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే గెలిచి.. గులాబీ శిబిరంలో చేరిన పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై కయ్‌మనేవారు. సునీతా మహేందర్‌రెడ్డి పెద్దగా చర్చల్లోకి వచ్చేవారు కాదు. కానీ.. ఆమె కూడా రూటు మార్చేశారని వికారాబాద్‌ జిల్లా రాజకీయాల్లో చెవులు కొరుక్కుంటున్నారు.

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రొటోకాల్‌ పాటించడం లేదని.. ప్రజాప్రతినిధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సునీత భగ్గుమన్నారు. కలెక్టర్‌ వైఖరి వల్ల ప్రభుత్వ పరువు పోతోందని కూడా ఆమె మండిపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమం సమీక్షా సమావేశంలో ఈ విధంగా నిప్పులు చెరగడంతో పార్టీలో చర్చగా మారిపోయారు జడ్పీ ఛైరపర్స్‌న్‌ సునీత. అధికారపార్టీ నేతగా ఉండి జిల్లా కలెక్టర్‌పై ఆరోపణలు చేయడంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా కలెక్టర్‌తో సమస్య ఉంటే.. జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అయ్యేది. కానీ.. సమీక్షా సమావేశంలో ఓపెన్‌ కావడం ద్వారా.. సునీతా మహేందర్‌రెడ్డి వ్యూహం ఇంకేదైనా ఉందా అని ఆరా తీస్తున్నారు.

పట్నం మహేందర్‌రెడ్డి సైతం గతంలో పోలీసులతోపాటు అడిషనల్‌ కలెక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మహేందర్‌రెడ్డి సదరు అధికారులకు క్షమాపణలు చెప్పారు కూడా. అటు భర్త.. ఇటు భార్య.. ఒకే టోన్‌లో వెళ్తుండటంపై అధికారపార్టీలో ఇద్దరూ చర్చగా మారారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై తాండూరులో తానే పోటీ చేస్తానని మహేందర్‌రెడ్డి గతంలో ప్రకటించారు. పరిణామాలు మారిపోవడంతో ఇప్పుడు టికెట్‌ వస్తుందో రాదో అనే డైలమాలో ఉన్నారట. ఇతర పార్టీలు కూడా ఈ దంపతులిద్దరికీ గాలం వేస్తున్నాయి. దీంతో ఎటూ తేల్చుకోని స్థితిలో పడ్డారని సమాచారం.

వైఖరి మార్చడం వెనుక అధిష్ఠానం దృష్టిలో పడాలని.. హైకమాండ్‌పై ఒత్తిడి పెంచి టికెట్‌ తెచ్చుకోవాలనే కోణం కూడా ఉందనేది పట్నం దంపతుల విషయంలో అధికారపార్టీలో మరికొందరి వాదన. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఏదో ఒకటి తేల్చాలని అనుచరుల నుంచి కూడా మహేందర్‌రెడ్డిపై ఒత్తిడి ఉన్నట్టు సమాచారం. అందుకే ఏదో ఒకటి తేల్చుకునే పనిలో పట్నం మహేందర్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి ఉన్నట్టు చెవులు కొరుక్కుంటున్నారట. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయని కూడా భావిస్తున్నారట. మరి.. పట్నం దంపతుల మదిలో ఏముందో.. వారేం చేస్తారో చూడాలి.