NTV Telugu Site icon

Off The Record: టీడీపీ ఎమ్మెల్యే – వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒక్కటయ్యారా..?

Off The Record: మన్యం జిల్లా… పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చందర్. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు. మామూలుగా అయితే… ఉప్పు నిప్పులా ఉండాల్సిన రాజకీయం ఇద్దరిదీ. అసెంబ్లీ ఎన్నికల‌ ముందు వరకు అలాగే ఉందట కూడా. కానీ… ఎలక్షన్స్‌ తర్వాత సీన్‌ కంప్లీట్‌గా మారిపోయిందట. మనం మనం పార్వతీపురం అనుకుంటూ… ఇద్దరూ యుగళగీతాలు పాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. ఇదసలు స్థానిక టీడీపీ కేడర్‌కు మింగుడు పడటం లేదట. వైసీపీ వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించవద్దని ఓవైపు స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెబుతుంటే…. పార్వతీపురంలో ఈయనగారు అలయ్‌బలయ్‌ చేసుకోవడం ఏంటని తెలుగుదేశం కార్యకర్తలు ఫైరైపోతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు, ఆ టైంలో…. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నట్టుగా వ్యవహరించారు ఇద్దరూ. నన్ను గెలిపించండి ఆ ఎమ్మెల్యే అక్రమాల సంగతి తేలుస్తా… ఉక్కు పాదం మోపుతానంటూ… వీరావేశంతో స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేశారట బోనెల విజయ్ చందర్. కానీ… గెలిచాక ఉక్కుపాదం సంగతి తర్వాత…జోగారావు పాదాలు ఎక్కడ కందిపోతాయోనన్నట్టుగా… పూల కార్పెట్స్‌ పరుస్తున్నారంటూ టీడీపీ నాయకులు మండిపడుతున్నట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జోగారావు వేసే మంత్రాలకి సిట్టింగ్‌ శాసనసభ్యుడు విజయ్‌ ముగ్ధుడైపోవడమే అందుకు కారణం అన్నది నియోజవర్గంలో నడుస్తున్న టాక్. అప్పుడు అంతలా ఊగిపోయిన బోనెల ఇప్పుడు మాత్రం అసలు పాత తప్పుల ప్రస్తావనే తేవడం లేదట.

పార్వతీపురంలో దేవుని బంద, బిల్ల బంద చెరువులు కబ్జా అయ్యాయని, తాను గెలిస్తే… వాటి సంగతి తేలుస్తానని ప్రచారంలో చెప్పిన బోనెల… ఇప్పుడేం చేస్తున్నారన్నది ఎక్కువ మంది క్వశ్చన్‌. విజయ్ చందర్ గెలిచిన తరువాత హడావుడిగా ఓ చెరువుని స్వయంగా పరిశీలించారు. సుమారు 8 ఎకరాలు ఉంటుందన్న అంచనాతో… సమగ్ర విచారణ జరిపి ఆక్రణలను తొలగించాలని చెప్పి వెళ్ళిపోయారు. ఇక అంతే….. మా నాయకుడు చెప్పాడంటే తిరుగుండదంటూ కూటమి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సోషల్ మీడియాలో హోరెత్తించారు. అక్రమాలపై ఉక్కు పాదం తప్పదు అంటూ పెద్ద స్లోగన్స్ మోగిపోయాయి. కట్‌చేస్తే… 9నెలలు కావస్తున్నా… ఇంతవరకు ఆ ఊసే లేదని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట. ఇదొక్కటే కాదు…ఆ మధ్య రేషన్ డీలర్ల ఎంపికలో కూడా వైసిపి చెందిన వారికే ఎక్కువగా ప్రాధాన్యం దక్కిందని చెప్పుకుంటున్నారు. అలాగే… గతంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించిన ఉద్యోగులు కొందర్ని తొలగించారు. ఇందులో కూడా తనవారిని జోలికి వెళ్ళవద్దని మాజీ ఎమ్మెల్యే జోగారావు చెబితే… అందుకు ఎమ్మెల్యే తలాడించారన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో స్థానికంగా వేస్తున్న లే ఔట్స్‌ నుంచి ఎమ్మెల్యే బోనెల అక్రమ వసూళ్ళు చేస్తున్నారని, దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పల్లెత్తు మాట అనకపోవడం చూస్తుంటే… ఇద్దరి మధ్య మిలాఖత్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారట రెండు పార్టీల కార్యకర్తలు.

అయితే… ఇక్కడో లాజిక్‌ ఉందని అంటున్నారు కొందరు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం రిజర్వేషన్ మారవచ్చని ప్రచారం జరుగుతోంది. అలా ఏదన్నా మార్పు జరిగితే ఇద్దరం నష్టపోవాల్సి వస్తోందన్న ఆలోచనతో… ఇప్పుడు ఒక్కటై వ్యవహారాలు నడిపిస్తున్నారని ఇటు టీడీపీ, అటు వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా.. ఇద్దరూ కలిసిపోయారన్నది నియోజకవర్గం టాక్. కానీ… వీరి మూలంగా మేం ఇబ్బందులు పడుతున్నామన్నది కార్యకర్తల బాధగా తెలుస్తోంది. నాడు నాయకుల మాటలు నమ్మి కత్తులు నూరిన మాలాంటి వాళ్లం ఇప్పుడు వాళ్ళు కలిసిపోయినంత తేలిగ్గా ఎలా కలవగలమని మధనపడుతున్నారట. అందుకే ఎమ్మెల్యే బోనెల విజయ్ చందర్ చివరికి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా భయపడుతున్నట్టు చెబుతున్నారు. ఈ మిలాఖత్‌ల గురించి.. ఇప్పటికే టీడీపీ పెద్దలు నివేదిక తెప్పించుకున్నట్టు సమాచారం. రెండు పార్టీల పెద్దలు దీన్ని ఎలా డీల్‌ చేస్తారో చూడాలి మరి.