NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి..? మహిళలకు స్థానం లేదా..?

Bjp

Bjp

Off The Record: తెలంగాణ బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి 19 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. మరో 19 పెండింగ్‌లో ఉన్నాయి. కానీ… ప్రకటించిన జిల్లాల్లో సమతౌల్యం కనిపించటడం లేదన్న టాక్‌ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. సామాజిక వర్గాల వారీగా చూస్తే… రెడ్లకు 6, మున్నూరు కాపులకు ఐదు, గౌడ సామాజిక వర్గానికి మూడు, ముదిరాజ్, పద్మశాలి, జంగం, బోయ, ఎస్సీ సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. మొత్తం 19 మందిలో 12మంది బీసీలకు ఇచ్చామని చెప్పుకుంటున్నా…. అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తం అవుతోందట. పార్టీలో అంతర్గతంగా కూడా దీనిపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదని ఇప్పటికే కొందరు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో ప్రభావవంతంగా ఉండే యాదవ సామాజికవర్గానికి ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమని అంటున్నారట ఆ కుల పెద్దలు. యాదవ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి వచ్చారంటే… సీరియస్‌నెస్‌ని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఇలా… రకరకాల అభ్యంతరాలు రావడంతో… కొన్ని చోట్ల అసలు ప్రక్రియనే నిలిపివేసినట్టు సమాచారం.ఏకాభిప్రాయం రాకపోవడం, ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యంతరాలతో 11 జిల్లాలకి కేంద్ర పార్టీ ముందే అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం పెండింగ్‌ లిస్ట్‌లో అవి కూడా ఉన్నాయి. ఇక అన్నిటికీ మించి తెలంగాణ బీజేపీలో మహిళల స్థానం ఏంటన్నది లేటెస్ట్‌ క్వశ్చన్‌. ఇప్పటివరకు ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్క చోట కూడా మహిళకు ప్రాతినిధ్యం కల్పించలేదు. అంటే… కాషాయ దళంలో మహిళలకు స్థానం లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు అధ్యక్షులను మార్చిన మూడు నాలుగు జిల్లాల్లో… ఇంతకు ముందు మహిళలు అధ్యక్షులుగా ఉండేవారు. వారి టర్మ్ పూర్తి కావడంతో.. పార్టీ నిబంధనల మేరకు మరోసారి ఛాన్స్‌ ఉండదు. కానీ… అదే ప్లేస్‌లో మరో మహిళకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్న వస్తోంది.

ఇలా ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం పార్టీ భావజాలానికి కూడా విరుద్ధం అన్న మాటలు వినిపిస్తున్నాయి. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ… జిల్లా అధ్యక్ష పదవుల్లో మాత్రం ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ఏంటన్నది అంతు చిక్కడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఒక్కరూ లేరు.. మిగిలిన జిల్లాల్లో అయినా… మిస్‌ అయిన సామాజికవర్గాలకు, మహిళలకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఓసీల్లో కూడా రెడ్లకు తప్ప మిగతా ఏ కులానికీ ఇవ్వకపోడం కూడా అసంతృప్తి రేపే ప్రమాదం ఉందంటున్నారు. తెలంగాణ కమలం పెద్దలు దీన్ని ఎలా సెట్‌ చేస్తారో చూడాలి మరి.