Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు

  • నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు..
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్‌లు, ఎన్నికల్లో నో టిక్కెట్స్‌..
  • అధికారం వచ్చాక కూడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరి ఆవేదన..
  • ఎన్నికలకు ముందు ఆత్మకూరు ఇన్ఛార్జ్‌గా కన్నబాబు..
  • వైసీపీ నుంచి వచ్చిన ఆనంకు టిక్కెట్‌, మంత్రి పదవి..
  • పార్టీ హామీ నిలబెట్టుకోలేదంటూ కన్నబాబు, కొమ్మి వర్గాల ఆవేదన..
  • కోవూరులో పోలంరెడ్డి దినేష్‌రెడ్డిదీ అదే ఆవేదన..
  • కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఇచ్చినా జనంతో సంబంధంలేనిదంటూ అసంతృప్తి..
  • కోవూరులో దినేష్‌రెడ్డి పట్టు సడలుతోందని అనుచరుల మధ్య టాక్‌..
Otr Nlr Tdp

Otr Nlr Tdp

Off The Record: ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు నానా కష్టాలు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం. సరే… జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పవర్‌లోకి వచ్చాం. ఆ మేరకు న్యాయం జరుగుతుందని ఆశించిన నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయట. అప్పట్లో నాలుగేళ్లు ఇన్చార్జ్‌లుగా పనిచేసిన తమకు.. ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన అధిష్టానం.. అధికారం వచ్చాక కూడా అన్యాయం చేస్తోందంటూ… తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరికి పదవులు ఇచ్చినా అందులో ఆశించిన స్థాయి ఆర్థిక వనరులు లేకపోవడంతో…. అలాంటి పోస్ట్‌ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటేనన్న ఆవేదన వినిపిస్తోందంటున్నారు. ఆత్మకూరు నుంచి కోవూరు, సూళ్లూరుపేట దాకా అసంతృప్త నేతల నోట కరివేపాకు మాటలే వినిపిస్తున్నాయి. అప్పట్లో నాలుగేళ్లు ఇన్ఛార్జ్‌ హోదా ఇచ్చి పార్టీకి సేవ చేయించుకుని… తీరా ఎమ్మెల్యే టిక్కెట్‌ దగ్గరికి వచ్చేసరికి అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందని, కనీసం అప్పుడు తమకు ఇచ్చిన హామీల్ని కూడా ఇప్పుడు నెరవేర్చడంలేదని కొందరు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు కన్నబాబు.ఈసారి టికెట్ నాదేనని అప్పట్లో ధీమా వ్యక్తం చేసిన ఆయనకు… ఆనం రామనారాయణరెడ్డి రూపంలో టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది.

అయితే… అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో పార్టీ పెద్దలు బుజ్జగించారట. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ్ నాయుడికి సైతం ఇదే హామీ వచ్చిందంటున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది.. వైసీపీ నుంచి జంప్‌కొట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం మంత్రి అయ్యారు. రెండేళ్ళు గడిచిపోయాయిగానీ…. టికెట్ త్యాగం చేసిన మావాళ్ళకు మాత్రం న్యాయం జరగలేదంటూ… కన్నబాబు, కొమ్మి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆనం దెబ్బకు వారిద్దరూ కనుమరుగయ్యారన్న చర్చ లోకల్‌లో గట్టిగానే జరుగుతోంది. ఇక కోవూరు నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. పోలంరెడ్డి దినేష్‌రెడ్డి ఎన్నికల ముందు వరకు టీడీపీ ఇన్ఛార్జ్‌ బాధ్యతల్లో ఉన్నారు. కానీ… చివరి నిమిషంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టికెట్ సంపాదించుకున్నారు. పార్టీ అధికారంలోకి రాగానే దినేష్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ.. అది ప్రజలతో సంబంధం లేని పదవి కావడంతో ఆయన కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నట్టు చెబుతున్నారు. నా భవిష్యత్తు ఏందిరా సామీ…. అంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తూ… లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ప్రాధాన్యత లేని నామినేటెడ్ పదవి ఇచ్చారని, చివరికి కార్యకర్తలకు పనులు కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నానన్నది దినేష్ రెడ్డి ఆవేదన. కోవూరులో తమ నాయకుడికి ఉన్న పట్టు సడలిపోతోందంటూ దినేష్‌రెడ్డి అనుచరులే మాట్లాడుకోవడం ఇక్కడ కొసమెరుపు. ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా ఉన్న అజీజ్ స్థానంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. అజీజ్‌కు ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన అనుచరులు భావించారు. చివరికి ఆయనకు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. అందులో ఏదో ఉంటుందని ఆశించిన అజీజ్‌కు ఇప్పుడు తత్వం బోధపడిందని అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రోటోకాల్ ఐతే ఉందిగాని.. అనుకున్నంత ప్రాధాన్యం దక్కడం లేదట.

దీంతో… ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందన్న ఆవేదనలో అజీజ్ ఉన్నట్టు సమాచారం. మైనార్టీగా తమ నాయకుడికి అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని అనుకున్న క్యాడర్‌కు రియల్ సీన్ అర్థమైందంటున్నారు. ఇదే సమయంలో గతంలో ఆయన దగ్గరకు వచ్చే కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇంటి వైపు చూడ్డం మానేశారట.ఇక నందమూరి బాలకృష్ణ చొరవతో నెల్లూరు సిటీకి చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి నుడా చైర్మన్ పదవి వచ్చింది.. ఆయన పరిస్తితి కూడా ఇంచుమించు ఇలాగే ఉందని చెబుతున్నారు. అటు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, వెంకటగిరిలో KVK ప్రసాద్ వంటి నేతల భవిష్యత్తు కూడా అయోమయంగానే ఉందట. పార్టీ అధికారంలోకి రాగానే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని భావించిన నేతలకు సైకిల్ అధిష్టానం షాక్ ఇచ్చిందన్న చర్చలు సొంత పార్టీలో జరుగుతున్నాయి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడి కేసులు పెట్టించుకుంటే…. ఇప్పుడు ఎవరూ తమని పట్టించుకోవడం లేదన్న నిట్టూర్పు మాటలు వినపడుతున్నాయి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే తాము గుర్తొస్తామని.. అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ముద్దొస్తారంటూ పాత టీడీపీ లీడర్స్‌ ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఈ అసంతృప్తిని చల్లార్చకపోతే… దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న వార్నింగ్స్‌ గట్టిగానే వస్తున్నాయి.