Site icon NTV Telugu

Off The Record: నడిరోడ్డుపై తప్పతాగి ఎమ్మెల్యే పీఏల హంగామా..

Gaddam Vinod Pas

Gaddam Vinod Pas

Off The Record: ఇదిగో… ఇక్కడ నడిరోడ్డు మీద బీరు బాటిల్ పైకెత్తి ఓ పట్టుపడుతున్న వ్యక్తి ఎమ్మెల్యే ప్రైవేట్‌ పీఏ. ఇక ఎడమ వైపున కళ్లజోడు, టక్కుతో డాన్స్ ఇరగదీస్తున్న మరో వ్యక్తి అదే శాసనసభ్యుడికి అధికారికంగా నియమించిన మరో పీఏ. ఇక మిగతా వాళ్ళంతా…. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ప్రధాన అనుచరులుగా చెప్పుకుంటారు. బహిరంగ ప్రదేశం, అందునా అది జాతీయ రహదారి. బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో బ్రిడ్జి పైనే నడిచిన సీన్‌ చూస్తే అర్ధమవుతోంది కదా… వీళ్ళంతా కలిసి ఎమ్మెల్యే పరువును ఎక్కడ పెట్టారో.

Read Also: Oka Parvathi Iddaru Devadasulu : రూ.2 కోట్లు పెట్టాం.. నిండా ముంచేశాడు.. నిర్మాతల ఆవేదన

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక చూసిన కాంగ్రెస్ కేడర్‌ కూడా జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యే వినోద్‌ దృష్టికి కూడా వెళ్ళి ఆయన క్లాస్‌ పీకడంతో…. అది పాత వీడియో సార్… ఇప్పుడెవరో బయటపెట్టారంటూ కవరింగ్‌ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా వర్కౌట్‌ కాలేదట. అది పాతదా ..కొత్తదా అన్న సంగతి పక్కన పెడితే…. నడిరోడ్డు మీద తాగి తందనాలాడటం ఇప్పుడు బెల్లంపల్లిలో హాట్‌టాపిక్‌ అయింది. ఎమ్మెల్యే వినోద్‌కు వివాద రహితుడని పేరుంది. కానీ ఆయన వ్యక్తిగత సిబ్బంది తీరు మాత్రం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. పీఏల విషయంలో గతంలో మావోయిస్టులు సైతం సికాస లేఖ విడుదల చేసి హెచ్చరించారట. ఇవే కాకుండా ఓ పీఏ పర్సంటేజీలు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. దీని గురించి ఒక్కరిద్దరు బహిరంగంగానే ఆరోపించడంతో… ఆ మధ్య ఎమ్మెల్యే తన సిబ్బందిని పిలిచి వార్నింగ్ సైతం ఇచ్చారట. అంతేకాదు తన సోదరుడు వివేక్ సైతం గతంలో లైన్ తప్పే వ్యక్తులను పీఏలుగా ఉంచుకోవద్దని హెచ్చరించినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అంతా అదోలే అనుకున్నా… ఇప్పుడు నడిరోడ్డు మీద తాగి తందనలాడే వీడియోలు బయటకు రావడంతో వినోద్‌ కూడా ఇరకాటంలో పడ్డట్టు తెలిసింది.

Read Also: Arya Marriage : 12 ఏళ్ల కూతురు ఉండగా రెండో పెళ్లి చేసుకున్న యాంకర్

ఆయన నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకే నియోజకవర్గంలో పీఏల పెత్తనం ఎక్కువగా సాగుతుందని, ఆ క్రమంలోనే వారు ఎలాంటి భయం లేకుండా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు చర్చించుకుంటున్నారు బెల్లంపల్లి జనం. అంతేనా… కొందరైతే ఈ చర్యల్ని ఈసడించుకుంటున్నారు. పది మందికి చెప్పాల్సిన పొజిషన్‌లో ఉండి, నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర పనిచేసే వ్యక్తులు ఇలా దారితప్పి ప్రవర్తించి జనానికి ఏం మెస్సేజ్‌ ఇస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పాత వీడియో అని వాళ్ళు చెబుతున్నా… ప్రజల్లో మాత్రం అది ఇటీవల మందుపార్టీ చేసుకున్నదేనన్న అభిప్రాయం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగడం నేరం. పైగా అది జాతీయరహదారి. అలాంటి చోట మందుతాగి చిందులేయడాన్ని ఇప్పుడు పోలీసులు ఎలా తీసుకుంటారన్న ఆసక్తి కూడా పెరుగుతోంది బెల్లంపల్లిలో. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఏదైనా ప్రకటన చేస్తారా.. లేక పీఏలే ముందుకు వచ్చి చెంపలేసుకుంటారా? అదీఇదీ కాదని… అసలు మేం చేసింది తప్పే కాదని సమర్ధించుకుంటారా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. ఏది ఏమైనా… ఎమ్మెల్యేకి కళ్ళు, చెవుల్లా పనిచేయాల్సిన పీఏలు ఇలా ఆయన పరువును హైవే మీదకు ఈడ్చడం మాత్రం బాగా లేదని, ఇలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తారా? లేక దండిస్తారా అన్నది చూడాలంటున్నారు స్థానికులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు.

Exit mobile version