Site icon NTV Telugu

Off The Record: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో చక్రం తిప్పిన ద్వారంపూడి

Dwarampudi

Dwarampudi

Off The Record: ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చింది అధికార పార్టీ. అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఇజ్రాయెల్‌కి ఎమ్మెల్యే కోటాలో.. శెట్టిబలిజ సంఘం నేత కుడుపూడి సూర్యనారాయణకు స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్‌ ఇచ్చారు. అమలాపురం అల్లర్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మాదిగ, శెట్టిబలిజ సామాజికవర్గాలను దగ్గర చేసుకోవడానికి ఆ విధంగా వ్యవహరించింది. అయితే గవర్నర్‌ కోటాలో జిల్లాలో కాపులకు అవకాశం ఇద్దామనే ఆలోచన సాగిందట. దానికి తగ్గట్టుగా గ్రౌండ్‌ వర్క్‌ జరిగినా.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఎంట్రీతో మొత్తం మారిపోయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సామాజిక సమీకరణాల అస్త్రం ప్రయోగించారట.

Read Also: Off The Record: దుబ్బాక కాంగ్రెస్‌లో కొత్త పంచాయితీ..!

కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ సీట్లలో ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ద్వారంపూడి మినహా మిగతా చోట్ల అందరూ కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే. పెద్దాపురం కోఆర్డినేటర్‌గా ఉన్న హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దొరబాబు సైతం అదే సామాజిక వర్గం. కాకినాడ ఎంపీ వంగా గీతా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు సైతం సేమ్ క్యాస్ట్. వీటన్నింటినీ పార్టీ అధిష్ఠానం ముందు పెట్టారట ద్వారంపూడి. ఎన్ని పదవులు ఇచ్చినా కాపులు ఓట్లు కచ్చితంగా అన్ని పార్టీలు పంచుకోవాలని.. అలా కాకుండా మత్స్యకార వర్గానికి ఇస్తే సాలిడ్‌గా వన్ సైడ్ ఉంటారని ప్రతిపాదన పెట్టారట ఎమ్మెల్యే. కాకినాడ సిటీలో 2 లక్షల 52 వేల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 40 శాతం మత్స్యకారులు.. మరో 40 శాతం కాపులు ఉన్నారు. కాకినాడ సిటీ టిడిపి కోఆర్డినేటర్ కొండబాబు సైతం మత్స్యకార సామాజికవర్గమే. అందుకే కాపులకు ఎమ్మెల్సీ ఇస్తే రాజకీయంగా తనకు… పార్టీకి ఉపయోగం ఉండబోదని చెప్పారట ద్వారంపూడి.

Read Also: Off The Record: ఏఐసీసీ కోఆప్షన్‌ మెంబర్‌గా నీలిమ నియామకంపై రగడ.. అది ఒట్టి మాటేనా?

మత్స్యకార కమ్యూనిటీకి చెందిన కర్రి పద్మశ్రీకి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీని చేయడానికి ద్వారంపూడి గట్టిగానే పట్టుపట్టారట. కాకినాడకే చెందిన బందన హరికి స్టేట్ ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్‌ను చేశారు. ప్రతిపాదిత ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ భర్త కర్రి నారాయణ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు. వాస్తవానికి వైసీపీలోని ఓసీ వర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్ఠానం మూడ్‌ తెలుసుకుని ఎమ్మెల్సీ కోసం లాబీయింగ్‌ చేశారట. కానీ.. ద్వారంపూడి వేసిన ఎత్తుగడలతో వాళ్ల ప్రయత్నాలన్నీ చిత్తయినట్టు చెబుతున్నారు. గతవారం జిల్లాలో పర్యటించిన టిడిపి అధినేత.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ తరహా విమర్శలకు వెంటనే కౌంటర్ ఇచ్చే ద్వారంపూడి వారం రోజులుగా దానిని పక్కన పెట్టి మరీ అనుకున్న దానికోసం గట్టిగానే ప్రయత్నించారట. మెయిన్‌ట్రాక్ కోసం సైడ్‌ట్రాక్ పట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ద్వారంపూడి వేసిన ఈ లెక్కలు ఎంత వరకు ఆయనకు వర్కవుట్‌ అవుతాయో చూడాలి.

Exit mobile version