Site icon NTV Telugu

Off The Record: భద్రకాళి అమ్మవారి సాక్షిగా విభేదాలు భగ్గుమన్నాయా?

Konda Surekha

Konda Surekha

Off The Record: వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైంది. ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి అమ్మవారి ఆలయ పాలకమండలి ఏర్పాటు మంత్రి కొండా సురేఖకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మధ్య అగ్గి రేపింది. అమ్మవారి ఆలయం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్న క్రమంలో… అక్కడి కార్యకర్తలు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం లైన్‌లోకి వచ్చారు. దీంతో… మొత్తం 16 మంది ఉన్న కమిటీలో ఏడుగురు సభ్యులను సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్‌ నుంచి నియమించారు. ఇక నాయిని ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్‌ నుంచి ఐదుగురికే చోటు దక్కింది. మిగిన ఇద్దరిలో అమ్మవారి ఆలయం ప్రధాన పూజారి.. ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు ఉంటారు. ఇదే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి కోపం తెప్పించిందట. వాస్తవానికి ఆలయం ఉన్న వెస్ట్‌ నియోజకవర్గానికే ఏడు పదవులు ఇవ్వాలనుకున్నారట. అలా కాకుండా ఈస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం, లోకల్‌ ఎమ్మెల్యేగా…. కనీసం తనను సంప్రదించకుండా మంత్రి కొండా సురేఖ కమిటీ సభ్యుల్ని ఎలా నియమిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారాయన. తాను ఏం చేసినా నడుస్తుందని కొండా అనుకుంటే కుదరదని కూడా ఫైరైపోయారాయన. దేవాదాయశాఖకు మంత్రి అయినంత మాత్రానా ఏదైనా చేయొచ్చా..? అని నిలదీశారు.

Read Also: Tollywood: చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. కానీ లవర్స్‌ అని ఒప్పుకోరు!

అయితే… ఈ కామెంట్స్ మీద సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు కొండా సురేఖ. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అంటూనే… దేవాదాయశాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ నాకు లేదా అని ప్రశ్నించారు. వాళ్ళు పేర్లు ఇవ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరు అని మండిపడ్డారు. అందుకు నాయిని కూడా తగ్గేదేలే అంటూ… ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రిని హెచ్చరించారు. నేను కూడా నాలుగు పార్టీలు మారి ఉంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యే వాడినేమోనంటూ సెటైర్లు వేశారు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని అందర్నీ కలుపుకొని వెళ్ళాలిగానీ… ఇలా గిల్లికజ్జాలు కరెక్ట్‌ కాదంటూ రియాక్ట్‌ అయ్యారు నాయిని. మంత్రి వైఖరి మీద పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారాయన. మొదట్నుంచి పార్టీలో ఉన్నవాళ్ళ మీద నాలుగు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళ పెత్తనం ఏంటంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు ఎమ్మెల్యే. ఇక లాభం లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దగ్గరే ఈసారి విషయం తేల్చుకుంటానని రాజేందర్‌రెడ్డి తన అనుచరులతో అంటున్నట్టు తెలిసింది.

అంతకు ముందు కూడా…. భద్రకాళి అమ్మవారికి బోనాల సమర్పణ ప్రతిపాదన విషయంలో మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వందల ఏళ్ళ నుంచి ఇక్కడ బోనాల సంప్రదాయం లేదని, అలాంటిది మంత్రి కొత్తగా ప్రతిపాదిస్తూ… సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నారంటూ…ఎమ్మెల్యేతో పాటు ఆలయ పూజారులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సురేఖ వెనక్కి తగ్గారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పార్టీ పదవుల భర్తీ విషయంలో ఇరువర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇక మంత్రి సురేఖ వ్యవహారశైలిపై అధికార పార్టీలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌ నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా ఫైరవుతున్నారు. ఈ గొడవపై ఇప్పటికే పంచాయితీ నడుస్తోంది. ఇది ఎప్పటికీ తెగని లొల్లిగా మారిపోవడంతో… పార్టీ కేడర్‌లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది.

Exit mobile version