Site icon NTV Telugu

Off The Record: మేరుగు నాగార్జున పార్ట్‌టైం పాలిటిక్స్‌..! గందరగోళంగా ఉన్న ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఏది..?

Merugu Nagarjuna

Merugu Nagarjuna

Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్‌… మాజీ మంత్రి మేరుగు నాగార్జున. 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జునను గత ఎన్నికల్లో సంతనూతలపాడు షిఫ్ట్‌ చేసింది పార్టీ అధిష్టానం. అక్కడాయన ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మేరుగు. అక్కడి వరకు బాగానే ఉన్నా… సంతనూతలపాడులో మాత్రం పార్ట్ టైం పాలిటిక్స్‌ చేస్తున్నారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. నాగార్జున తిరిగి వేమూరు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారని.. అందుకే సంతనూతలపాడుకి ఫుల్ టైం కేటాయించటం లేదని చెప్పుకుంటున్నారు. కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరవడం తప్ప.. అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండటం లేదన్నది కేడర్‌ మాట. ఇటీవల సంతనూతలపాడు నియోజకవర్గంలో సంచలనంగా మారిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ముందు పలువురు వైసీపీ కీలక నేతలపై ఆరోపణలు వచ్చాయి. వాళ్ళ ప్రమేయం లేకున్నా విచారణ పేరుతో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని, అయినా సరే…. ఇన్ఛార్జ్‌గా నాగార్జున ఆశించిన స్దాయిలో స్పందించలేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గం మీద ఆసక్తి లేకపోవడం, పార్ట్‌టైం పాలిటిక్స్ చేస్తున్నందున నాగార్జునను మార్చవచ్చన్న ప్రచారం కూడా మొదలైంది. అదే జరిగితే… ప్రస్తుతం ప్రస్తుతం వేమూరు ఇన్ఛార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్ బాబు ఇటువైపు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన పలువురు నేతల్ని సపోర్ట్‌ చేయమని కోరినట్టు సమాచారం. వరికూటి అశోక్‌బాబు ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండేపికి వెళ్లాలన్నా… ప్రస్తుతం అక్కడున్న గ్రూపు గొడవలు తనకు సెట్ కావన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది.

Read Also: GHMC: వర్షకాలంలో వచ్చే సమస్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్షా..

అదే సమయంలో కొండేపి వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా….తన సొంత నియోజకవర్గమైన యర్రగొండపాలెం వైపు చూస్తున్నారు. కానీ…అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. సిట్టింగ్‌ ఉండగా సురేష్‌కు సీన్‌ ఇస్తారా అన్నది డౌటేనంటున్నాయి పార్టీ వర్గాలు. దీంతో తాను 2014లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచి ఉన్నందున ఇప్పుడున్న కొండేపి కంటే ఈ నియోజకవర్గమే బెటరని సురేష్‌ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీకే చెందిన సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కూడా అవకాశం వస్తే మరోసారి ఇటు రావాలనుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వకున్నా… జిల్లా వ్యాప్తంగా ప్రచారానికి కూడా వెళ్ళానంటూచెప్పుకొస్తున్నారట ఆయన. ఇన్ఛార్జ్‌ మార్పు అంటూ ఉంటే… అవకాశం తనకే ఇవ్వాలని ఆయన ఇప్పటికే అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. అయితే సంతనూతలపాడు ఇంచార్జ్ విషయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అభిప్రాయం కూడా అవసరం కావటం.. అలాగే చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో బూచేపల్లికి గట్టి పట్టు ఉండటంతో ఆయన నిర్ణయమే కీలకం అనుతుందని అంటున్నారు. అందుకే ఆశావహులు బూచేపల్లికి కూడా టచ్‌లో ఉన్నారట. వీళ్ళంతా ఎవరికి వారే సైలెంట్ మోడ్‌లో ఆపరేషన్ నడిపిస్తున్నారు. అంతా అయోమయం గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో కొత్త ఇన్ఛార్జ్ ఎవరొస్తారోనని ఆసక్తిగా చూస్తోంది పార్టీ కేడర్‌.

Exit mobile version