Site icon NTV Telugu

Off The Record: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టిన మహిపాల్ రెడ్డి

Otr Mahipal Reddy

Otr Mahipal Reddy

Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే. బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఆయన…2024 జూలై 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక కొన్ని రోజులుగా మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో…పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదిపారు. బహిరంగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయకున్నా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, కుమారుడు విక్రమ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు…అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆయన మాత్రం ప్రచారం చేయలేదు. సీన్ కట్ చేస్తే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మహిపాల్ రెడ్డికి కొండంత బలాన్నిచ్చాయి. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో…ఐదింటిని అధికార పార్టీకి దక్కకుండా పావులు కదిపారు. గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలని సింగిల్‌గా కైవసం చేసుకున్న బీఆర్ఎస్…ఇంద్రేశం మున్సిపాలిటీని స్వతంత్ర కౌన్సిలర్‌ను పార్టీలో చేర్చుకుని ముచ్చటగా మూడు మున్సిపాలిటీలను బీఆర్ఎస్‌ ఖాతాలో వేశారు. అంతటితో ఆగకుండా హంగ్ వచ్చిన జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలను వ్యూహాత్మకంగా బీజేపీతో చేతులు కలిపి మున్సిపల్ పీఠాలపై గులాబీ జెండా ఎగరేశారు. బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఆఫర్ ఇచ్చి… ఇస్నాపూర్ మున్సిపాలిటీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటుతో గెలిచారు. మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో 104 వార్డులు ఉంటే…బీఆర్ఎస్ 58 వార్డులు గెలిస్తే…కాంగ్రెస్ 29 స్థానాలకే పరిమితం అయింది.

వాస్తవానికి జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. కానీ పార్టీ పెద్దలు వీటిపై దృష్టిపెడితే పని సులువుగా అయ్యేదని…నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్, కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో పాటు క్యాడర్ అనుకుంటున్నారు. ఇస్నాపూర్ నుంచి తన సతీమణి నీలం కవితని బరిలో దింపిన నీలం మధు…ఆ మున్సిపాలిటీపై గట్టి పట్టు సాధించారు. మొత్తం 26 వార్డుల్లో బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10 వార్డులు గెలవగా 4 స్వతంత్ర కౌన్సిలర్లు గెలిచారు. అందులో ముగ్గురిని తన వైపుకు తిప్పుకున్నారు నీలం మధు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ను కూడా తన క్యాంపులో చేర్చుకోవడంతో మున్సిపల్ చైర్మన్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కింది. కానీ చివరి క్షణంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ కౌన్సిలర్ హ్యండ్ ఇవ్వడం…బీజేపీ ఎంపీ రఘునందన్ ఎక్స్ అఫిషియో ఓటుతో బీఆర్ఎస్‌కు మద్దతివ్వడంతో ఇస్నాపూర్ చేజారింది.

ఈ విషయంలో అధిష్టానం సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేదని నీలం మధు వాదన. ఇక రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టి పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను కాంగ్రెస్ గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు స్థానిక నేతలు. మంత్రి వివేక్ ప్రచారానికి వచ్చినా ప్రయోజనం పెద్దగా లేదన్నది టాక్. అలాగే కాంగ్రెస్ పార్టీతో మహిపాల్ రెడ్డి అంటిముట్టనట్టుగా ఉన్నప్పుడే ఆయనపై చర్యలు తీసుకుంటే…ఫలితాలు మరోలా ఉండేవని అంటున్నారు. ప్రస్తుతం అధికారం, అంగబలం ఎమ్మెల్యే మహిపాల్ వద్దే ఉన్నాయి. అధికారులంతా ఆయన మాటే వింటున్నారు. అలాంటప్పుడు మహిపాల్ రెడ్డి చేతికి కత్తి ఇచ్చి యుద్దం మమ్మల్ని చేయమంటే ఎలా అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారట కాట శ్రీనివాస్, నీలం మధు. మహిపాల్ ని నమ్మితే పార్టీని ఆయన నట్టేట ముంచేశారని వాదిస్తున్నారు. చివరి క్షణంలో ప్లేటు ఫిరాయించి బీఆర్ఎస్ కోసం పనిచేసిన మహిపాల్ పై చర్యలు తీసుకోకుండా పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారని ఆగ్రహానికి గురవుతున్నారట కార్యకర్తలు.

మరోవైపు మహిపాల్ రెడ్డి వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరాక లోకల్ నాయకులు తనను కావాలనే ఇబ్బంది పెట్టారని…అందుకే తన పవర్ ఎంటో ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపించానని తన అనుచరులతో చెబుతున్నారట. ఇస్నాపూర్‌లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున బుల్లెట్ దిగిందా లేదా అంటూ మహిపాల్ చేసిన కామెంట్ కాంగ్రెస్ పార్టీని, లోకల్ లీడర్లని ఉద్దేశించి చేసిందేనన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ఎన్నికల్లో పరిస్థితి ఇలా ఉంటే… జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని ఆందోళనలో ఉన్నారట కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మహిపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించి… ఓ నిర్ణయానికి వస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Exit mobile version