Off The Record: శత్రువులు ఎక్కడో ఉండరన్న సినిమా డైలాగ్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సరిగ్గా సరిపోతుందన్న టాక్ నడుస్తోంది నెల్లూరు జిల్లాలో. కాకుంటే…ఆ డైలాగ్ లెక్క అయితే ఇంట్లో ఉంటారు, ఇక్కడ మాత్రం సొంత పార్టీలో, అనుచరుల రూపంలో ఉన్నారట. నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న అడ్డగోలు పనులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి తలనొప్పిగా మారినట్టు చెప్పుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ వ్యవహారాలేగాక, తమ ట్రస్ట్ ద్వారా కూడా ఎమ్మెల్యే దంపతులు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారని, కానీ… నాయకుల దందాలతో ఆ పనులు మొత్తం ఎక్కడో కొట్టుకుపోతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. వాళ్ళను కట్టడి చేయకుంటే ఇక కష్టమేనన్న సూచనల మేరకు ఇటీవల ప్రశాంతి రెడ్డి వార్నింగ్ ఇచ్చినా… ఇంకా చాలామంది మారలేదని తెలిసింది. పైగా కొందరైతే ఓ అడుగు ముందుకేసి సీరియస్ కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం. ఆమెకేం… ఒడ్డున కూర్చుని ఎన్నయినా చెబుతారు, అధికారం ఉన్నప్పుడు మేం మాత్రం నాలుగు రాళ్ళు వెనకేసుకోవద్దా అని అంటున్నట్టు తెలుస్తోంది.
కోవూరు నియోజకవర్గంలో చాలామంది నాయకులు పార్టీ పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారట. చికెన్ వెస్టేజ్ నుంచి మొదలుపెడితే…. గ్రావెల్, ఇసుక దాకా.. దేన్నీ వదలకుండా బిజినెస్ చేస్తున్నారన్నది లోకల్ టాక్. అధికారులు, అనుచరుల స్థాయిలో జరిగిపోతున్న ఈ వ్యవహారాలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూ… పద్ధతి మార్చుకోమని చెబుతున్నారట. దాంతో… కొందరిలో మార్పు వచ్చినా, మరికొందరు మాత్రం మాకు కాదులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాంటి వాళ్ళ మీద ఇటీవల ప్రశాంతిరెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది. కొందరు చేసే చిల్లర పనుల వల్ల తనకు చెడ్డ పేరు వస్తోందని, ఇక ఊరుకునే ప్రసక్తే లేదని అన్నట్టు సమాచారం. అలాగే..ఈ అవినీతి వ్యవహారాలతో…గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి కూడా జనాల్లోకి పెద్దగా వెళ్లడం లేదన్న ప్రచారం సైతం జరుగుతోంది. దీంతో….. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారి విషయంలో ఇక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని అన్నట్టు సమాచారం. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలిసినా…. కొందరు సీనియర్స్‌ని పిలిపించి చెబితే హర్ట్ అవుతారన్న అభిప్రాయంతో అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చారట. అలాగే…. కొందరు అధికారులతో ఎమ్మెల్యే నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో కూడా తమ నేతల గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. తన పేరు చెప్పుకుని ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమని అడిగితే చెయ్యవద్దని, తన దృష్టికి తీసుకురావాలని సూచించారట. సరిగ్గా ఈ ఆదేశాలే కొందరు తమ్ముళ్ళకు నచ్చక ఫైరైపోతున్నట్టు తెలిసింది. పార్టీ కోసం పనిచేశాం, ఖర్చు పెట్టుకున్నాం, అధికారం వచ్చింది కదా….. నాలుగు రాళ్ళు సంపాదించుకుందామనుంటే.. ఎమ్మెల్యే మరీ స్ట్రిక్ట్‌గా ఉండటం కరెక్ట్ కాదంటూ తెగ ఫీలైపోతున్నారట సదరు దందా రాయుళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో పార్టీ కోసం ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి సంపాదించుకోకపోతే ఎలాగంటూ తమ సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యే వైఖరిని విమర్శిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో శాసనసభ్యురాలు కూడా…. వ్యూహం మార్చారు. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతోందో తెలుసుకునేందుకు మండలానికొకరి చొప్పున తన మనుషుల్ని పెట్టుకున్నారట. తాను ఆయా మండలాలకు వెళ్ళే ముందు ఆ చిట్టా తీసి…పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నవాళ్ళను పిలిపించి మాట్లాడుతున్నారు. చేసే అభివృద్ధి చేస్తూ కూడా…. ప్రతిపక్షం వైసీపీ నేతలతో మనం మాటలు పడాల్సిన అవసరం ఉందా అంటూ పార్టీ నేతల్ని నిలదీస్తున్నారట ప్రశాంతిరెడ్డి. స్థానిక ఎన్నికలు జరగబోతున్న టైంలో అవినీతి అక్రమాల వల్ల పార్టీ డామేజ్ అవుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే. ముఖ్యంగా బుచ్చి, ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాల్లో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడానికి అధికారులు కూడా భయపడుతున్నారట. దీంతో తన మనుషుల ద్వారా సమాచారం తెప్పించుకుని వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ధన దాహంతో అల్లాడిపోతున్న ద్వితీయ శ్రేణి ఎమ్మెల్యే వార్నింగ్స్‌ని ఎంతవరకు చెవికెక్కించుకుంటుదో చూడాలి మరి.
