NTV Telugu Site icon

Off The Record: బాబాయ్.. అబ్బాయ్.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారా..?

Kethireddy

Kethireddy

Off The Record: వైసీపీ హయాంలో తమ నియోజకవర్గాల్లో హవా కొనసాగించిన ఆ ఎమ్మెల్యేలు.. మాజీలు కాగానే.. సీన్ మొత్తం మారిపోయింది. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన వారి సంగతి ఒక ఎత్తైతే.. రాయలసీమలో బాబాయ్- అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాబాయ్‌కాగా.. అబ్బాయ్ ధర్మవరం మాజీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వీరద్దరి పరిస్థితి చూస్తే… లోపల-బయట గేమ్ ఆడుతున్నటుగా ఉందంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. వీరిలో ఒకరు నియోజకవర్గంలోకి రావాలని తహ తహలాడుతుంటే.. మరొకరు బయటే ఉండాలన్నట్టుగా వెళ్లిపోతున్నారు. ముందు బాబాయ్ విషయానికొస్తే..తాడిపత్రి ఆధిపత్య పోరు పీక్స్‌లో ఉంది. 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలిచాక తాడిపత్రిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో ఆయన కొన్ని తప్పిదాలు ప్రస్తుతం శాపంగా మారాయని అంటున్నారు.

అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి… ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుర్చీలోనే కూర్చున్నారు. దీంతో నాడు నానా హంగామా అయింది. అప్పుడు అధికారం ఉందికాబట్టి చెల్లిపోయిందిగానీ… తర్వాత అదే ఆయనకు శాపంగా మారిందట. సీన్‌కట్ చేస్తే.. 2024ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో కోర్టు ఇటు జేసీ, అటు పెద్దారెడ్డి ఫ్యామిలీల్ని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది. కొన్ని రోజులకు ఆ ఆంక్షలు ఎత్తి వేశారు. ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డికి మాత్రం తాడిపత్రిలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా మీరు తాడిపత్రికి వెళ్ళకూడదంటూ పోలీసులు ఎప్పటికప్పుడు ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 9నెలల నుంచి ఇదే సాగుతోంది. దీంతో ఆయన నియోజకవర్గానికి రావాలనుకుంటున్నా రాలేకపోతున్నారు.

ఇక అబ్బాయ్‌… కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్ననాయకుడు ఆయన. 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి గెలిచాక అప్పటి వరకు ఎవరూ చేయని విధంగా డిఫరెంట్‌ పాలిటిక్స్‌ చేశారాయన. ప్రజల మధ్య ఉండటంలో కేతిరెడ్డి తర్వాతే ఏవరైనా అనే మార్క్‌ వేసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నెగిటివ్ ప్రచారం కూడా జరిగింది. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి… సమస్యలు పరిష్కరించడం ఒకవైపు అయితే.. ఇంకోవైపు ఆయన ప్రజల ఆస్తులు పై కన్నేసి కబ్జాలు చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేవలం ఎన్నికలకు ముందు నియోజకవర్గానికి వచ్చిన సత్యకుమార్‌ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారట ఆయన.పొద్దున లేవగానే ప్రతి ఇంటి వద్దకువెళ్లి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ పేరు పేరునా పలుకరిస్తూ.. ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడితే.. ప్రజలు ముక్కు మోహం తెలియని వ్యక్తిని ఓటు వేశారన్నది ఆయన ఆవేదన అట. అందుకే ఫేస్ బుక్కులు లేదా ఏదైనా ఫంక్షన్లలో తప్ప ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ హయాంలో ఎప్పుడూ బిజీగా గడిపిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి , కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. జనానికి ఎంత చేసినా.. చివర్లో వచ్చి నాలుగు అబద్దాలు, కల్లబొల్లి మాటలు చెప్పే వారికే ఓటు వేస్తారన్నది ఆయన లేటెస్ట్‌ ఫీల్‌ అట. స్వయానా బాబాయ్‌, అబ్బాయ్‌ అయిన ఈ ఇద్దరూ కారణాలు వేరైనా నియోజకవర్గాలకు దూరం కావడంపై చర్చ జరుగుతోంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో.