Off The Record: కరీంనగర్ డెయిరీపై ఆ కాంగ్రెస్ మంత్రి గుర్రుగా ఉన్నారా? అసలేం జరుగుతోంది?

  • కరీంనగర్‌ డెయిరీ వ్యవహారాల్లో పొలిటికల్‌ తుఫాన్‌..
  • డెయిరీ ఛైర్మన్‌కు ప్రభుత్వంతో పొసగడం లేదా?..
  • గతంలో ఆలయాలకు నెయ్యి, హాస్టల్స్‌కు పాలు సరఫరా..
  • కాంగ్రెస్‌ వచ్చాక ఆ ఆర్డర్స్‌ మొత్తం విజయ డెయిరీకి..
  • కరీంనగర్‌ డెయిరీకి రూ.60 కోట్ల విలువైన ఆర్డర్స్‌ రద్దు..
  • తాజాగా 11ఎకరాల భూమి డెయిరీ పేరు నుంచి డీడీఎఫ్‌ పేరిట మార్పు..
  • రూల్స్‌ ప్రకారమే మార్చామంటున్న అధికారులు..
  • గతంలో సిరిసిల్ల ప్లాంట్‌ వివాదంతో పెరిగిన గ్యాప్‌..
Otr Karimnagar Dairy Row

Otr Karimnagar Dairy Row

Off The Record: సహకార వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో ఏర్పడిన సంస్థ కరీంనగర్‌ డెయిరీ. 50 ఏళ్ళ క్రితం 12వేల లీటర్ల సామర్ధ్యంతో మొదలై ఇప్పుడు రెండు లక్షల లీటర్ల పాల సేకరణ సామర్ద్యంతో నడుస్తోంది. లక్ష మంది పాడిరైతుల సభ్యత్వం… తెలంగాణలోని అతిపెద్ద డెయిరీల్లో ఒకటి. ఇలా… చెప్పుకోవడానికి ట్రాక్‌ రికార్డ్‌ బాగానే ఉందిగానీ… ఇటీవల సంస్థకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. డెయిరీలో ఉన్న పెద్ద తలకాయకు ప్రభుత్వంతో పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టే… రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీని ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం ప్రభావం కరీంనగర్ డెయిరీ మీద పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలకు నెయ్యి, హాస్టల్స్‌కి పాల ఉత్పత్తులను దశాబ్దాలుగా కరీంనగర్‌ డెయిరీ సరఫరా చేస్తోంది. కానీ… కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ ఆర్డర్స్‌ను విజయ డెయిరీకి ఇవ్వడంతో దాదాపు 60కోట్ల రూపాయల విలువ చేసే ఆర్డర్స్ రద్దయ్యాయి.

దీనికి తోడు డెయిరీ చైర్మన్ రాజకీయంగా అధికార కాంగ్రెస్‌కు కాస్త దూరంగా ఉంటున్నారన్న ప్రచారం సైతం ఉంది. అలాగే… డెయిరీని చైర్మన్ తన జేబు సంస్థగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా… కాంగ్రెస్‌ పెద్దలకు బాగా కాలిపోతోందని చెప్పుకుంటున్న టైంలోనే… భూ బదలాయింపు ఆసక్తి రేపింది. డెయిరీకి చెందిన భూములను సంస్థ పేరిట కాకుండా.. భూ భారతిలో డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్‌కు చెందిన ఆస్తులుగా మార్చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ డెయిరీ అన్నట్టుగా మారింది. మా భూములను రాష్ట్ర ఫెడరేషన్ భూములుగా ఎలా మారుస్తారంటూ రోడ్డెక్కింది డెయిరీ యాజమాన్యం. కనీసం తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా మారుస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే… ఆ విషయంలో సర్కార్ వాదన మరోలా ఉంది. జిల్లా డెయిరీ ఫెడరేషన్‌కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం11 ఎకరాల భూమి ఇచ్చిందని, దాన్ని సహకార రంగంలోని సంస్థకు మార్చడం సాధ్యం కాదు కాబట్టే…. ఫెడరేషన్ పేరు మీదకు తిరిగి మార్చామని చెబుతున్నారు. అలాగే…పద్మానగర్‌లో ఉన్న స్థలం, నిర్మాణాలను కూడా డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్‌కు అప్పగించాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. అయితే… ఇవన్నీ పైకి చెబుతున్న టెక్నికల్‌ రీజన్సేగానీ… కాంగ్రెస్‌ నేతల ఆగ్రహానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. గతంలో సిరిసిల్ల అగ్రహారంలో ఉన్న డెయిరీకి చెందిన బల్క్ మిల్క్ చిల్లింగ్ పాయింట్‌ రిటైల్‌ ఔట్‌లెట్‌కు ప్రభుత్వం నుంచి అనుమతులను తీసుకోలేదని నోటీసులు ఇచ్చారు జిల్లా అధికారులు. అయినా పట్టించుకోకపోవడంతో యూనిట్‌ని సీజ్ చేశారు. కానీ… డెయిరీ యాజమాన్యం ప్రభుత్వంతో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించకుండా…సిరిసిల్ల- కరీంనగర్ రహదారిపై రాస్తారోకో చేయడం, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాల కేంద్రాల పరిధిలో నిరసనలు చేయించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. చివరికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో చర్చించి సాయంత్రానికల్లా తిరిగి యూనిట్‌ని తెరిపించారు. కానీ… ఆందోళనల వెనక బీఆర్‌ఎస్‌ ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అప్పటిదాకా కోల్డ్ వార్‌ లాగా అనిపించిన డెయిరీ వ్యవహారం… రాస్తారోకోలతో రచ్చకెక్కినట్టయింది.

అయితే….ఈ వివాదం ఇప్పటిది కాదని…. ఒకటిన్నర దశాబ్దం క్రితమే వివాదానికి బీజం పడిందని అంటున్నారు. నాడు కరీంనగర్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్‌లో కీలకంగా వ్యవహరించి… ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న ఓ నేతకు, డెయిరీ చైర్మన్‌ రాజేశ్వరరావుకు మధ్య జరుగుతున్న యుద్ధమే సమస్యకు ప్రధాన కారణం అంటున్నారు ఈ వ్యవహారాలను దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు. కరీంనగర్ డెయిరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అన్నీ తానై నడిపిస్తున్నారు రాజేశ్వరరావు. పేరుకు సహకార సంస్థేగానీ….. కరీంనగర్ డెయిరీ అంటే రాజేశ్వరరావు అనే స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే… రాజకీయ నాయకులు కొందరికి లోపాయికారిగా సహకరిస్తారన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి ఆయన క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో…. రాజేశ్వరరావును చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయట. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన శివయ్య అనే వ్యక్తికి చైర్మన్ పీఠం దక్కేలా అప్పటి కాంగ్రెస్ నేతలు గట్టి ప్రయత్నాలే చేసినట్టు చెబుతారు. కానీ…. ఛైర్మన్‌ తనదైన శైలిలో చక్రం తిప్పి… పీఠం కాపాడుకున్నారని అంటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన తన కుర్చీని మరింత పదిలం చేసుకోవడంతో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు బాగా దగ్గరయ్యారని అంటారు. ఇది సహజంగానే కాంగ్రెస్ నేతలకు నచ్చకపోవడంతో సమయం కోసం వేచిచూసి…అధికారంలోకి వచ్చీ రాగానే ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే చిన్న ఛాన్స్‌ దొరికినా వదలకుండా మంత్రి రివెంజ్‌ తీర్చుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. డెయిరీకి గవర్నమెంట్‌ ఆర్డర్స్ నిలిపివేయడం.. ఇప్పుడు భూములను బదలాయించడంతో అసలేం జరగబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది. మంత్రి తనదైన మార్క్‌తో వేసిన ఎత్తుకు డెయిరీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందన్నది ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.