Site icon NTV Telugu

Off The Record: వైసీపీలోకి తిరిగి వెళ్లడానికి ఇగో అడ్డొస్తుందన్న నేత ఎవరు? ఏంటా పరిస్థితి?

Kapu Ramachandra Reddy

Kapu Ramachandra Reddy

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ లీడర్స్‌, కేడర్‌కు గడ్డు కాలం నడుస్తోంది. కొన్ని చోట్ల కేడర్‌కు అండగా ఉండాల్సిన లీడర్స్‌ సేఫ్‌ జోన్స్‌ చూసుకుంటుంటే… గతంలో వాళ్ళనే నమ్ముకుని చెలరేగిపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారట. డైరెక్ట్‌గా అలాంటిది కాకున్నా… దాదాపుగా అదే తరహాలో, ఇంకా చెప్పుకోవాలంటే ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కార్యకర్తలు. రాయదుర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్‌, టిడిపి సమఉజ్జీలుగా ఉండేవి. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ బలంగా కనిపించింది. కానీ… మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి వెళ్లిన తర్వాత.. సీన్‌ మారిపోయి టీడీపీ బలడిందన్నది లోకల్‌ టాక్‌. 2009 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి పాలిటిక్స్‌లోకి వచ్చి వైసీపీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. 2014లో ఓడిపోయినా… 2019లో తిరిగి భారీ మెజార్టీతో గెలిచారు.

Read Also: Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..

అయితే 2024కు వచ్చేసరికి రామచంద్రారెడ్డికి టిక్కెట్‌ ఇవ్వడానికి నిరాకరించింది వైసిపి అధిష్టానం. ఆయన్ని మొదట రాయదుర్గం నుంచి కాకుండా కళ్యాణదుర్గం నుంచి బరిలో దింపాలని భావించారు. కానీ… చివరికి అక్కడ కూడా హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు కాపు. చివరికి పార్టీ అధినేత జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన తాడేపల్లిలోనే సవాల్ చేసి మరీ పార్టీని వీడారాయన. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరినప్పటికీ ఆయనకు ఎక్కడా పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. అలాగని ఏ ఇతర ముఖ్యమైన పదవులు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన వైసిపి మీద కోపంతో బీజేపీలోనే కొనసాగుతున్నారు కాపు రామచంద్రారెడ్డి. ఇక 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి దారుణ పరాభవాన్ని చూడటంతో ఇక వైసిపి శ్రేణులు కష్టాలు మొదలయ్యాయి. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి బిజెపిలోకి వెళ్లినప్పటికీ… కేడర్‌ మాత్రం ఆయన వెంట పార్టీ మారలేదు. ఆయనకు ఎక్కడో ఒక చోట టిక్కెట్‌ ఇచ్చి ఉంటేగనక ఎక్కువ మంది వెళ్లేవారని, అలాంటిదేమీ లేకపోవడంతో… కేడర్‌ మొత్తం ఫ్యాన్‌ కిందే ఉండిపోయిందంటున్నారు పరిశీలకులు.

Read Also: Off The Record: కాపు కులం పొలిటికల్‌గా చీలిపోతోందా..? జనసేనతో పొత్తుతో మారిపోయిన ఈక్వేషన్స్‌..!

మరోవైపు మెట్టు గోవిందరెడ్డికి వైసిపి అధిష్టానం రాయదుర్గం టికెట్ ఇచ్చింది. ఆయన సమర్థవంతంగా పనిచేయకపోవడంతో అటువైపు కూడా మొగ్గలేక సతమతం అవుతున్నారట వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. ఇటు పార్టీని వీడలేక, అటు మెట్టు గోవింద్ రెడ్డి వెంట నడవలేక పొలిటికల్‌ చౌరాస్తాలో మిగిలిపోయారు. అది చాలదన్నట్టు వైసీపీ హయంలో కాపు వెంట నడిచిన ముఖ్య నాయకులందరి మీద ఇప్పుడు వరుసగా కేసులు బుక్‌ అవుతున్నాయట. రామచంద్రారెడ్డి నాటి ముఖ్య అనుచరులందరి మీద కేసుల కత్తి వేలాడుతోందని చెప్పుకుంటున్నారు. మరోవైపు బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసిపి గూటికి వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. బీజేపీలో తనకు కొన్ని బాధ్యతలు అప్పజెప్పారని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నానని సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ నమ్ముకున్న వారిని కాపాడలేక, అలాగని గాలికి వదిలేయలేక రామచంద్రారెడ్డి కూడా పరీక్షను ఎదుర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. దీనికి ఎండ్‌ కార్డ్‌ ఏ రూపంలో పడుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version