Off The Record: కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయం వ్యవహారం వివాదాస్పదం అవుతోందా? కూటమిలో మనస్పర్ధలకు కారణం అవుతోందా…? అంటే ఎస్ అన్నదే ఎక్కువ మంది సమాధానం. ఇక్కడ కొత్తగా పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం ఒకటో వార్డులో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని లీజుకు కేటాయిస్తూ ఇటీవల నిర్ణయం జరిగింది. ఎకరానికి ఏడాదికి వెయ్యి రూపాయలు చొప్పున 66 ఏళ్ళపాటు అమల్లో ఉండేలా అగ్రిమెంట్ కుదిరింది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయింది. పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలంటూ ఇటీవల కలెక్టర్‌ని కోరారు స్థానిక తెలుగుదేశం నాయకులు. తర్వాత ప్రొసీడింగ్స్ ప్రకారం స్థలం లీజుకి ఇస్తూ జీవో విడుదలైంది. చూపించిన స్థలంలో మూడేళ్ళలోపు నిర్మాణాలు చేపట్టకపోతే వెనక్కి తీసుకుంటామని, పార్టీ అవసరాలకు తప్ప ఇతర కార్యక్రమాలకి ఉపయోగించకూడదని క్లారిటీ ఇచ్చారు. అదంతా బాగానే ఉందిగానీ… అసలా మొత్తం వ్యవహారం మీదే ఇప్పుడు జనసేనలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట. ఉమ్మడి జిల్లా టిడిపి కార్యకలాపాలు గతంలో కాకినాడ కేంద్రంగా నడిచేవి. దానికి అనుగుణంగా విశాలమైన పార్టీ ఆఫీస్ ఉంది. జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో 2018లో ఈ కార్యాలయం ఓపెన్ అయింది.
అయితే.. 2014- 19 మధ్య టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జడ్పీ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరిట లీజుకు ఇచ్చారు. దాంతో…. ఇప్పుడు ఆ స్థలాన్ని, భవనాన్ని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి వదిలేసి పార్టీ కోసం కొత్తగా ఆఫీసు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం. ఇంకేముంది… అందుకు తగ్గట్టే చకచకా పావులు కదిలాయి. అనుమతులు కూడా వచ్చేశాయి. ఇక పునాదులు తీయడమేనని అనుకుంటున్న టైంలో…జనసైనికుల గునగునలు మొదలయ్యాయట. మనకు మాత్రం జిల్లా కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఉండొద్దా…? ఆల్రెడీ ఒక వ్యవస్థ రన్ అవుతున్నప్పటికీ పసుపు పార్టీకి మరో చోట స్థలం కేటాయించారు. ఏదీలేని మనల్ని పట్టించుకోలేదంటూ జిల్లా జనసేన నాయకులు మాట్లాడుకుంటున్నారట. పైగా… జనసేన తరపున జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కాకినాడ ఎంపీ సీటు కూడా జనసేన ఖాతాలోనే ఉంది. నామినేటెడ్ పదవులు విషయంలోనూ జిల్లా పార్టీకి ప్రయారిటీ ఉంది. కానీ…. ఇప్పటివరకు జిల్లా స్థాయి ఆఫీసు మాత్రం లేదంటూ గ్లాస్ లీడర్స్ మాట్లాడుకుంటున్నారట. పార్టీ తరపున ఏదైనా పెద్ద కార్యక్రమం నిర్వహించాలంటే… హోటల్స్‌కు వెళ్ళాల్సి వస్తోంది. మనకంటూ జిల్లా ఆఫీస్ ఉంటే ఆ ఇబ్బందులు తప్పుతాయి కదా అని చర్చించుకుంటున్నట్టు సమాచారం. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జిల్లా హెడ్ క్వార్టర్ లో మనకి ఒక ఆఫీస్ కచ్చితంగా ఉండాల్సిందేనన్నది కేడర్ మాట. అందుకే వాళ్ళు టీడీపీతో పోల్చి చూసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. సైకిల్ పార్టీకి ప్రస్తుతానికి ఒక మంచి ఆఫీసు ఉంది.
అయినప్పటికీ వాళ్ళు అడ్వాన్స్ అయిపోయి మరోచోట స్థలాన్ని లీజుకు తీసేసుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా సునాయాసంగా అనుమతులు వచ్చాయి. దీపం ఉండగానే కంఫర్ట్‌గా ఇల్లు చక్కబెట్టేసుకున్నారు. మరి మన పెద్దోళ్ళకు ఆ మాత్రం అవగాహన లేదా? లేక ఒకవేళ అడిగినా వాళ్ళు ఇవ్వలేదా అంటూ తమలో తాము చర్చించుకుంటున్నారు జనసైనికులు. అన్ని విషయాలు డిప్యూటీ సీఎం ఎలా చూసుకుంటారు? జిల్లాలో ఏం జరుగుతోందో మనం ఏం చేయవచ్చో ఇక్కడున్న వాళ్ళకు ఆ మాత్రం తెలీదా అని కూడా ప్రశ్నించుకుంటున్నారట. అయినా…. మన లీడర్లకు వాళ్ల వ్యహారాలు చెక్కపెట్టుకోవడానికే టైం చాలడం లేదు, ఇక పార్టీ మీద ఇంకేం దృష్టి పెడతారులే అంటూ సెటైర్లు వేస్తున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఓవరాల్‌గా.. జిల్లా పార్టీ ఆఫీస్‌కి స్థలం ఉండాలని అంటున్నారు కాకినాడ జనసైనికులు. మిత్రపక్షం డబుల్ బొనాంజా తీసుకుంటున్నా మనోళ్లకి పట్టకపోవడం ఏంటన్నది వాళ్ల క్వశ్చన్.

