Off The Record: వైయస్ కుటుంబానికి కంచుకోట కడప. ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆ కుటుంబం చెప్పిందే వేదం. వాళ్ళ అనుయాయులే అక్కడ కార్పొరేటర్లు. ఇప్పటివరకు మూడు సార్లు ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పినవాళ్లే.. మేయర్స్ అయ్యారు. అందులో రెండు విడతల నుంచి కొనసాగుతున్నారు కొత్తమద్ది సురేష్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో… పాతికేళ్ళ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డప్పగారి మాధవి… ఎక్స్‌అఫిషియో సభ్యురాలి హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకు హాజరవుతున్నారు. ఫస్ట్ మీటింగ్‌లో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. కానీ…రెండో మీటింగ్‌లో రేగిన వివాదం ఆ తర్వాత రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. నిరుడు నవంబర్ 7న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదిక మీద ఎమ్మెల్యేకి కుర్చీ లేకుండా చేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే… ఆ వ్యవహారాన్ని చాలా దూరం తీసుకువెళ్ళారు. ఆ దెబ్బకు ఇప్పుడు మేయర్ సీటే షేకయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే వాటిని నిగ్గు తేల్చే పనిలో బిజీగా ఉన్నారట. కడప అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం.. మున్సిపల్ పరిధిలో ఉండడంతో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్న కార్పొరేషన్ రెజల్యూషన్ తప్పనిసరి. కానీ… ఎమ్మెల్యే మాధవికి పాలకవర్గం సహకరించకపోవడంతో పాటు వేదికపై కుర్చీ వేయకపోవడం లాంటి పనులతో… ఆమె అసలు పాలకవర్గాన్నే టార్గెట్ చేశారట. నాకే కుర్చీ లేకుండా చేస్తావా, నీ కుర్చీ లాగేస్తా చూడంటూ… నాడు కార్పొరేషన్ సమావేశంలో చేసిన సవాల్‌ని వర్కౌట్ చేస్తున్నారట ఎమ్మెల్యే. అందులో భాగంగానే… కడప కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారట. అందులో…మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ అవతారం ఎత్తినట్టు గుర్తించారట. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం ప్రజా ప్రతినిధులు, వారి పేరున గాని, కుటుంబ సభ్యుల పేరున గాని, కాంట్రాక్టు పనులు చేయకూడదు. ఆ సంగతి మీకు తెలియదా ? అంటూ మున్సిపల్ అధికారులకు విజిలెన్స్ ఆఫీసర్స్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
ఆ మేరకు మున్సిపల్ అధికారులు ఆగమేఘాలపై మేయర్ సురేష్ బాబుకు నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది. ఇలా విజిలెన్స్ విచారణతో మేయర్ సురేష్ బాబు మెడకు ఉచ్చు బిగిసుకుంటున్నట్టేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. నిబంధనలను అతిక్రమిస్తే ప్రజా ప్రతినిధులు వారి పదవులకు అనర్హులు అవుతారంటూ మేయర్‌కి ఇచ్చిన నోటీస్‌లో మున్సిపల్ అధికారులు పేర్కొనడం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. మేయర్ తగిన ఆధారాలతో సమాధానం ఇవ్వాలని కమిషనర్ కోరగా అందుకు సంతృప్తికరమైన సమాధానం రాకుంటే… సురేష్‌బాబు మీద అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తం మీద మున్సిపల్ మీటింగ్‌లో ఎమ్మెల్యేకి కుర్చీ వేయనందుకు ఏకంగా మేయర్ కుర్చీనే మతపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ సెటైర్స్ పడుతున్నాయి కడపలో. ఈ మేటర్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.