NTV Telugu Site icon

Off The Record: అక్కడ పనులు జరగాలంటే చేతులు తడపాల్సిందేనా..?

Mla Deva Prasada Rao

Mla Deva Prasada Rao

Off The Record: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజవర్గంలో జరక్కూడనిదేదో జరిగిపోతోందని సొంత పార్టీ జనసేన కేడరే గుర్రుగా ఉందట, గుసగుసలాడుకుంటోందట. నాడు నెత్తిన పెట్టుకుని గెలిపించుకున్న ఎమ్మెల్యే దేవ ప్రసాదరావుకు ఇప్పుడు అంత కానివాళ్ళం అయిపోయామా అంటూ… కార్యకర్తలు నిష్టూరాలాడుతున్నట్టు సమాచారం. మమ్మల్వి పక్కన పెట్టేసి కనీసం 10ఓట్లు కూడా వేయించలేని వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారని,ఎవరికి ఏపని కావాలన్నా, కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా… ఆ ఇద్దరు ఛోటా నేతల్ని కలిసి ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోందని, ఎమ్మెల్యే మౌనంగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఇద్దరూ దున్నేస్తున్నారని జనసేన నాయకులు సైతం తీవ్ర అసహనంగా ఉన్నారట. వీరిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు హయాంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి అని చెబుతున్నారు. వెయ్యని రోడ్లు వేసినట్టుగాను, చేయని పనులు చేసినట్టు బిల్లులు తీసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఇప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

ఇప్పుడు మళ్లీ వాళ్ళే తనదైన శైలిలో అవినీతికి తెర తీసినట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. అసలీ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతున్నాయా? లేక తెలియకుండా జరుగుతున్నాయా అన్న చర్చ మొదలైందట రాజోలులో. కష్టపడి గెలిపించుకున్న కార్యకర్తలను గాలికి వదిలేసి, గత ప్రభుత్వంతో పెద్దలతో అంటకాగిన వాళ్ళకే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కూటమి పార్టీల కేడర్‌ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలైతే… మన నాయకుడు చెబుతోంది ఏంటి? రాజోలులో జరుగుతోంది ఏంటంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారట. అందరం కలిసి పనిచేస్తేనే గెలిచామన్న విషయాన్ని మర్చిపోయి ఇద్దరికే పెత్తనం ఇవ్వడం, వాళ్ళు అడ్డేలేదన్నట్టుగా అవినీతి వ్యవహారాలకు తెరతీయడం చివరికి రాజోలు జనసేనకే ముప్పు తెస్తుందని వార్నింగ్‌ ఇస్తున్నారట. ఐఎఎస్‌ అధికారిగా మంచి ట్రాక్ ఉన్న దేవ వరప్రసాద్ పొలిటికల్‌గా బ్యాడ్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారాయన. 2014 టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకానికి రూపకల్పన చేశారు. రిటైర్మెంట్ తర్వాత జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ కు , ప్రజలకు మధ్య అనుసంధానంగా జనవాణి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కానీ… రాజకీయాల్లోకి వచ్చినా… ఇంకా అధికారి తరహాలోనే నాలుగు గోడలకే పరిమితం అవుతున్నారట. కార్యకర్తలను పట్టించుకోరు, ప్రజలను కలవరని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ మొక్కుబడిగానే పాల్గొంటారని చెప్పుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. మళ్లీ 2024 లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడి ఓటర్లు జనసేనకే పట్టం కట్టారు. చాలా రోజులు నాయకుడు లేకున్నా…కార్యకర్తలే సొంత సొమ్ములతో పార్టీని ముందుకు నడిపించిన పరిస్థితి. ఇంత ప్రాధాన్యత కలిగిన రాజోలు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ కేడర్‌ని పూర్తిగా విస్మరించి పైరవీకారులకే పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అవినీతిపరులైన చోటా నాయకులతో కలిసి పార్టీకి అపకీర్తి తీసుకు వస్తున్నారంటూ జీర్ణించుకోలేకపోతున్నారట కార్యకర్తలు. నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి మాఫియా, ఇసుక దోపిడి, మద్యం షాపుల నుండి వసూళ్ళ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా నాకేం తెలియదు, నియోజకవర్గంతో నాకేంటి సంబంధం అన్నట్లు ఎమ్మెల్యే మౌనముద్ర వహిస్తున్నారన్న అసంతృప్తి పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జనసేన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.