Off The Record: ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న లీడర్ జోగి రమేష్. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్ధన్.. వీడియో రిలీజ్ చేసి మాజీ మంత్రి పేరు చెప్పినప్పటి నుంచి ఆయన చుట్టూ రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. నేరుగా జోగి రమేష్ కూడా ఈ అంశంపై రోజూ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి. నేను తప్పు చేయలేదంటూ… బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ప్రమాణాలు కూడా చేసి పొలిటికల్ హీట్‌ని మరింత పెంచారు జోగి. అక్కడితో ఆగకుండా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, తాను ఆమాయకుడినని చెప్పుకోవడంలాంటి కార్యక్రమాల్ని ఏక కాలంలో చేసేందుకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారాయన. ఆ విధంగా బాణం తనవైపునకు తిరక్కుండా చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు ఎక్స్ మినిస్టర్. కావాలనే, కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికిస్తున్నారన్నది ఆయన వాదన. కానీ.. అటు అధికార పార్టీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. నకిలీ మద్యం తయారీలో జోగి రమేష్ పాత్రకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కౌంటర్స్ ఇస్తున్నారు. చేయకూడని పనులన్నీ చేసేసి… ఇప్పుడు నేను అమాయకుడిని, నాకేం తెలియదు,రాజకీయంగా ఇరికిస్తున్నారంటూ… గుండెలు బాదుకుంటే తప్పులు ఒప్పులైపోతాయా అంటూ అటాక్ చేస్తున్నారు.
ఆ మాటల యుద్ధం అలా నడుస్తుండగానే… ఈ ఎపిసోడ్‌పై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోందట. వైసీపీ హయాంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ మీద హద్దులు దాటి నోరుపారేసుకున్నాడనేది టీడీపీ వర్గాల మాట. ఆయన మంత్రికాక ముందే తన అనుచరులతో కలిసి కరకట్ట దగ్గరున్న చంద్రబాబు ఇంటి మీద దాడికి ప్రయత్నించాడంటూ టీడీపీ క్యాడర్ సైతం కోపంగా ఉంది. అసలు ఆ రోజున దాడికి వెళ్ళినందుకే మంత్రి పదవి ఇచ్చారనే టీడీపీ లీడర్సే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఎప్పట్నుంచో జోగి రమేష్ తెలుగుదేశం టార్గెట్ లిస్ట్‌లో ఉన్నారనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ క్రమంలో.. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు వైసీపీ కీలక నేతలు అరెస్టయినా జోగి మాత్రం కాలేదు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసు విచారణ తెర మీదకు వచ్చిన సమయంలో కొన్నాళ్ళు అజ్ణాతంలోకి వెళ్ళి… ఆ తర్వాత సుప్రీం కోర్ట్ ముందస్తు బెయిల్‌తో బయటకు వచ్చారనేది టీడీపీ నేతల మాట. ఇక అగ్రిగోల్డ్ భూముల కేసులో కూడా జోగి రమేష్ కొడుకు జైలుకి వెళ్లాడు తప్ప ఆయన దాకా రాలేదు. ఆ కేసులో జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావు నిందితులుగా మారినా మాజీ మంత్రి పేరు మాత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జోగి రమేష్ పేరు నకిలీ మద్యం తయారీ కేసులో తెర మీదకు రావటంతో టీడీపీ క్యాడర్‌లో ఆసక్తి మొదలైంది.
కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ తాను నకిలీ మద్యం తయారు చేయటం వెనుక జోగి రమేష్ ఉన్నాడని వీడియో విడుదల చేయటంతో కలకలం రేగింది. ఈ వీడియో బయటకు వచ్చిన దగ్గర నుంచి నకిలీ మద్యంతో తనకు సంబంధంలేదని చెప్పటానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ మంత్రి. అలాగే… జనార్ధన్ వీడియో విడుదలై 2 వారాలు గడిచినా జోగి పేరు కేసులోకి ఎక్కలేదు. కానీ… వారం రోజులపాటు జనార్ధన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేయటంతో పాటు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. అందులోనూ…. జోగి రమేష్ పాత్రను నిర్ధారించే కీలక ఆధారాలను సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో… గతంలో రెండుసార్లు మిస్సయిన మాజీ మంత్రి ఈసారి మాత్రం తప్పించుకునే ఛాన్స్ లేదని, నకిలీ మద్యం తయారీ కేసులో పక్కా ఆధారాలతో ఫిక్స్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పుకుంటున్నారు టీటీపీ నాయకులు. గుళ్ళ ముందు ఎన్ని ప్రమాణాలు చేసినా… చట్టానికి ఆధారాలు ముఖ్యమని, ఆ ఆధారాల సేకరణ కోసమే… ఆయన్ని ఇన్నాళ్ళు అలా వదిలేశారని, ఇక ఈసారి తప్పించుకునే ఛాన్సే లేదన్నది టీడీపీ వాయిస్. ఈ ఎపిసోడ్‌లో ముందు ముందు ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.