Site icon NTV Telugu

Off The Record: ఆ మాజీ మంత్రి వ్యవహారం వైసీపీలో బూమ్ రాంగ్ అయ్యిందా..?

Vidadala Rajini

Vidadala Rajini

Off The Record: ఇదే… ఈ గొడవే… ఇప్పుడు వైసీపీలో రకరకాల చర్చలు, కొత్త రకం ప్రశ్నలకు కారణం అవుతోందట. మాజీ మంత్రి విడదల రజిని, సీఐ సుబ్బారాయుడు మధ్య వివాదం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుని రచ్చ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల ముందు నడి రోడ్డు మీద జరిగిన ఈ వ్యవహారం అక్కడితో అయిపోయిందని అనుకున్నారు అంతా. కానీ… ఆ తర్వాతే అసలు కథ మొదలైందని గుసగుసలాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు విడదల రజని. కారులో ఆమెతో పాటు పీఏ కూడా ఉన్నారు. అతని మీద అప్పటికే పోలీస్‌ కేసు బుక్‌ అయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడి గుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏమీ చేయకుండా ఎగ్గొట్టిన కేస్‌ అది. దానికి సంబంధించి పరారీలో ఉన్నారు మాజీ మంత్రి పీఏ. అయితే.. రజనీ కారులో ఆయన ఉండటాన్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన సమయంలో ఆమె అడ్డుపడటంతో రచ్చ జరిగింది.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో భారీ ప్రకంపనలు రాబోతున్నాయా..? బీజేపీ నేతకు ముందే ఎలా తెలిసిపోతున్నాయి?

పోలీసుల మీద ఓ రేంజ్‌లో మాజీ మంత్రి ఎగిరిపడటం, అసలు తప్పంతా ఆమెదేనంటూ టీడీపీ వీడియో రిలీజ్‌ చేయడంతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఇదంతా బయటికి కనిపిస్తున్న వ్యవహారం. అయితే… వైసీపీలో అంతర్గతంగా అంతమించినవి జరిగాయన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు పార్టీ తరపున ఖండించడం, తమ నేతలకు మద్దతుగా నిలవడం సాధారణమే. విడదల రజనీ విషయంలో కూడా అలాంటి సాధారణ స్పందనలే రావడం నచ్చలేదట పార్టీలోని ఓ కీలక నాయకుడికి. అరే… ఆమెకు అంత అన్యాయం జరుగుతుంటే…. మాజీ మంత్రితో పోలీసులు అలా ప్రవర్తిసుంటే…. మీరు స్పందించే తీరు ఇదేనా? పార్టీ తరపున ఆమెకు అండగా నిలబడి న్యాయం చేయాల్సిన అవసరం లేదా.. అంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా… విడదల రజనీని పరామర్శించేందుకు స్థానిక నాయకులంతా కలిసి బృందంగా వెళ్ళిరండని ఆదేశించారట. కానీ.. లోకల్‌ లీడర్స్‌ నుంచి ఆశించిన రియాక్షన్‌ లేకపోవడంతో… ఇక లాభం లేదనుకున్న సదరు కీలక నాయకుడు…. పక్క జిల్లాకు చెందిన నేతను పురమాయించినట్టు సమాచారం.

Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో భారీ ప్రకంపనలు రాబోతున్నాయా..? బీజేపీ నేతకు ముందే ఎలా తెలిసిపోతున్నాయి?

పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా పేరుండి, పైనుంచి ఏ ఆదేశాలు ఇచ్చినా టాస్క్ ఫినిష్ చేసే ఆ పక్క జిల్లా నాయకుడు వెంటనే ఓ బృందంతో రజినీ ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టు చెప్పుకుంటున్నారు. ఆ ఎపిసోడ్‌ మీద అక్కడే ప్రెస్‌కి బ్రీఫ్‌ చేశారుగానీ… ఆ తర్వాతే ఇంకో రకమైన సమస్య మొదలైందట. అసలక్కడ ఏమైందని, ఆమెకు ఏం జరిగిందని ఇంత సీన్‌ క్రియేట్‌ చేస్తున్నారు? పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడని, వ్యక్తిగత గొడవను తీసుకొచ్చి మీద రుద్దుతున్నారంటూ వైసీపీలోనే రుసరుసలు మొదలయ్యాయట. సీఐ విషయంలో మాజీ మంత్రే దురుసుగా ప్రవర్తించినట్టు టీడీపీ విడుదల చేసిన వీడియోలో క్లియర్‌గా అర్ధమవుతోందని, ఆ విషయం తెలిసి కూడా… దీన్ని పార్టీకి ఆపాదించడం కరెక్ట్‌ కాదన్న వాదనలు సైతం ఉన్నాయట. అసలు పక్క జిల్లానుంచి వచ్చిన మాజీ మంత్రి కూడా ఈ ఎపిసోడ్‌ని సరిగా డీల్‌ చేయలేకపోయారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నట్టు సమాచారం. పోనీ… అంతటితో ఆ ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ వేశారా అంటే అదీ లేదట. ఈ విషయాలన్నీ తెలిసి కూడా… సదరు కీలక నేత… రజినీ-సీఐ ఎపిసోడ్‌ మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్‌మీట్స్ పెట్టి రచ్చ చేయాలని ఆదేశాలు ఇచ్చారట.

Read Also: AP Crime: ఏపీలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం, హత్య..!

అంతే కాదు, జిల్లా అధ్యక్షులకు స్వయంగా తానే ఫోన్ చేసి మీరంతా ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా మాట్లాడాలని హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఆ ఆదేశాలతో కొంతమంది అమాయక ఇన్ఛార్జ్‌లు రంగంలోకి దిగిపోగా… మరి కొందరు మాత్రం మావల్ల కాదని ఫోన్‌లోనే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా… వెనక్కి తగ్గని ఆ కీలక నేత విడదల రజనీకి న్యాయం చేయాలంటూ… రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలకు పిలుపు ఇచ్చేందుకు సిద్ధపడటంతో.. అలర్ట్‌ అయిన కొందరు సీనియర్లు మేటర్‌ని హైకమాండ్‌ దృష్టిలో పెట్టి…. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించకపోతే….. పొలిటికల్‌గా డ్యామేజ్‌ తప్పదని చెప్పారట. ఇందులో మనకు రాజకీయంగా కలిసొచ్చే అంశం వీసమెత్తుకూడా లేదు. అలాంటి ఎపిసోడ్‌ని నెత్తికెత్తుకుని ఆందోళనలు చేస్తే మనదే దెబ్బ అని నచ్చజెప్పినట్టు సమాచారం. అసలు రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల్నే అరెస్ట్‌లు చేస్తున్నప్పుడు మోసం కేసులో అరెస్ట్‌ అయిన మాజీమంత్రి పీఏ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు? దాని మీద ఎంత ఎక్కువ రచ్చ చేస్తే… మనకు అంత ఎక్కువ డ్యామేజ్‌ జరుగుతుందన్నది వైసీపీ సీనియర్స్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. ఏ నేత విషయంలో లేని రియాక్షన్‌ మాజీ మంత్రి పీఏ విషయంలో ఎందుకు? సదరు కీలక నేత అంత శ్రద్ధ తీసుకోవడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నాయట వైసీపీ వర్గాలు.

Exit mobile version