Off The Record about Anil Kumar Yadav: కార్పొరేటర్‌గా రాజకీయ జీవితం మొదలుపెట్టి రెండుసార్లు ఎమ్మెల్యే, మూడేళ్లపాటు మంత్రిగా పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రికాక ముందు వరకు అందరితో కలిసి ఉన్నట్టు.. అందరికీ కావాల్సినవాడు అన్నట్టుగా అనిపించుకునేలా ఉన్న అనిల్ మంత్రి అయ్యాక రూటు మార్చారట. అయినా అప్పట్లో ఆయన మీద అసమ్మతి రాలేదు. ఎప్పుడైతే ఆయన మాజీ మంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయన చుట్టూ ఉన్నవాళ్లు రివర్స్ కావడం మొదలుపెట్టారట. సొంతం అనుకున్న బంధువు మొదలు.. ఒక్కొక్కరుగా ఈ మాజీ మంత్రికి ఝలక్ ఇస్తున్నారు. సీఎం జగన్ ఒక్కడికి భక్తుడిలా ఉంటే చాలు.. పదవి ఉంటుంది.. తోచినట్టు చేసుకోవచ్చు అనుకున్న అనిల్‌కు కేబినెట్ నుంచి తప్పించాక కానీ తన నాయకత్వపు బలం ఏంటో బోధపడలేదు. మంత్రి అయ్యాక అనిల్ కొందరు నేతలకే ప్రాధాన్యం ఇవ్వడం.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో ఆయనపై నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. మూడేళ్ల తర్వాత అనిల్ స్థానంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి కేబినెట్లో స్థానం కల్పించారు. ఇది అనిల్‌కు షాక్ ఇచ్చింది. జగన్‌కు భక్తుడిగా ఉన్నట్టు కనిపించే తనకు మంత్రి పదవి పోదనే ధైర్యంతో ఉన్న అనిల్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. జగన్ నిర్ణయాన్ని గౌరవిస్తానని పైకి చెబుతూనే.. అదే జగన్ మంత్రిగా ఎంపిక చేసుకున్న కాకాణిని పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మంత్రి పదవి పోయిన కొన్ని రోజులపాటు అనీల్ ప్రవర్తించిన తీరు, ఆయన మాటలు విన్నవారికి.. ఏంటి ఇతనికి ఏమైంది అనుకున్నారట.
Read Also: Off The Record: పొరుగు రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్
మంత్రిగా తొలిసారి నగరానికి వస్తున్న కాకాణికి స్వాగతం చెబుతూ నెల్లూరు నగరంలో అభిమానులు పెట్టిన ఫ్లెక్సీలను అనిల్ వర్గీయులు చించివేయడం వివాదానికి దారి తీసింది. అంతేకాదు.. కాకాణి జిల్లాకు వస్తున్న రోజునే కార్యకర్తల సమావేశాన్ని అనిల్ ఏర్పాటు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. అప్పట్లో పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. అయినప్పటికీ అనిల్ మారలేదు. కాకాణి టార్గెట్‌గా అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీంతో జగన్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అనిల్‌ను, కాకాణిని పిలిపించుకుని కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు సీఎం జగన్. అయినా ఇప్పటికీ వారు ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి తిరిగి నెల్లూరు నగర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఒక్కసారిగా రూటు మార్చారు. అనిల్‌ను వదిలి కాకాణికి మద్దతుదారుగా మారారు. కొద్దిరోజుల తర్వాత అనిల్‌కు బాబాయ్ వరసయ్యే రూప్ కుమార్ యాదవ్ సైతం పక్కకు వచ్చేశారు. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ రూప్‌కుమారే చక్కబెట్టేవారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రూప్‌కుమార్ సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Off The Record: పెనుకొండలో పక్కలో బల్లెం
జగనన్న భవన్ పేరుతో కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరులోని వైసీపీ కార్పొరేటర్లు సైతం ఇరువర్గాలుగా విడిపోయారు. ఇలా దూరమైన నేతలను తనవైపు తిప్పుకొనేందుకు అనిల్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. దీంతో సహనం కోల్పోయి కక్షపూరిత చర్యలకు దిగుతున్నారట. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న మున్వర్.. రూప్‌కుమార్‌కు మద్దతుగా ఉన్నారు. దీనికి ఆగ్రహించిన మాజీ మంత్రి వర్గం.. మున్వర్ దుకాణం మెట్టు రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని చెప్పి.. మున్సిపల్ అధికారులతో మెట్లను తొలగించారు. తాజాగా నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్‌పేట అర్బన్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ద్వారకానాథ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనిల్‌ను ఆహ్వానించలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య ప్రశాంతిరెడ్డితోపాటు అనిల్ వ్యతిరేకవర్గానికి చెందిన రూప్‌కుమార్ హాజరయ్యారు. ఎమ్మెల్యే లేకుండా కార్యక్రమం చేయడం చర్చగా మారింది. అనిల్‌కు దూరంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించినట్టు తెలుస్తోంది. అనిల్ తన వ్యవహారశైలి మార్చుకోకపోతే మరికొంత మంది దూరమయ్యే అవకాశం ఉందని చెవులు కొరుక్కుంటున్నారు.