Site icon NTV Telugu

Off The Record: మేయర్ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య కోల్డ్ వార్..?

Otr Eluru Mayor Post

Otr Eluru Mayor Post

Off The Record : ఏలూరు నగరం.. వసతుల పరంగా అంతంత మాత్రంగానే ఉన్నా… పొలిటికల్‌గా ఎప్పుడూ పొగలు రేగుతూ ఉండే ప్రాంతం. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలో ఉన్నాసరే… మేయర్‌గా మాత్రం షేక్ నూర్జహాన్ పెదబాబు కొనసాగుతున్నారు. అప్పట్లో టీడీపీ తరపున గెలిచి పదవిలో పాతుకుపోయిన నూర్జహాన్.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జగన్ హయాంలోనూ కొనసాగారు. ఇక 2024 ఎన్నికల ముందు తిరిగి తెలుగుదేశం కండువా కప్పుకుని కూటమి హయాంలోనూ తన పదవి చేజారి పోకుండా వ్యూహాత్మకంగా అడుగులేశారామె. పదేళ్ళ వ్యవధిలో మూడు సార్లు అధికారం మారినా…. ఏలూరు మేయర్ ఛాన్స్‌ మాత్రం ఒకే ఒక్క నేతకు దక్కడంపై గతంలో వైసీపీ, ప్రస్తుతం కూటమి నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. వైసీపీ సంగతి అలా వదిలేస్తే…. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు టైం అవుతున్న తరుణంలో… ఈసారి పీఠం మాకే కావాలంటూ… టీడీపీ, జనసేన నేతలు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకుని ఇన్నాళ్ళు నీరసించిపోయన వాళ్ళు కూడా ఇప్పుడు మెల్లిగా స్వరం సవరించుకుంటున్నారట.

దాదాపు 200 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆయువుపట్టులాంటి మేయర్ పదవిని ఈసారైనా దక్కించుకోవాలని ఇటు టీడీపీ, అటు జనసేన నాయకులు పోటీపడుతున్నారన్న సమాచారం ఆసక్తి రేపుతోంది. ఇక్కడే కొన్ని కొత్త లెక్కలు కూడా వెలుగు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేయాలని భావించింది జనసేన. కానీ… రకరకాల సమీకరణలతో ఛాన్స్‌ టీడీపీకి వెళ్ళిపోయింది. అందుకే ఈసారి కనీసం మేయర్ పదవి అయినా తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు గ్లాస్‌ లీడర్స్‌. అదే సమయంలో టీడీపీ తరపున మేయర్ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా… మెల్లిగా పెరుగుతూ ఆసక్తి రేపుతోంది. లోకల్‌ ఎమ్మెల్యేకి కూడా ఇప్పుడిది సవాల్‌గా మారిందట. అదే సమయంలో సీటు ఏ పార్టీ కోటాలోకి వెళ్ళినా… పార్టీ కోసం కష్టపడిన వారికి పదవి కేటాయిస్తారా లేక గతంలో మాదిరిగా డబ్బు వెదజల్లే వారికే అవకాశం కల్పిస్తారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. వైసీపీ నుంచి టిడిపిలో చేరిన జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ వ్యవహారం ఇప్పుడు పార్టీ నేతలకు కొంత తలనొప్పిగా మారిందట. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు అవకాశం కల్పిస్తే… మళ్ళీ పాత ఇబ్బందులే వస్తాయని అంటున్నాయి ఏలూరు తెలుగుదేశం వర్గాలు. మరోవైపు జనసేనకు అవకాశం కల్పిస్తే టీడీపీలో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాళ్ళకు అన్యాయం చేస్తున్నట్టు అవుతుందనే వాదన సైతం ఉంది.

ఈ క్రమంలో.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కీలకమైన మేయర్ పదవిపై జనసేన టిడిపి మధ్య కోల్డ్ వార్ మొదలైనట్టు సమాచారం. మేయర్ పదవి ఆశిస్తున్న జనసేన నేతలకు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ఎన్నికల్లో పూర్తిస్థాయి సహకారం అందిస్తారా లేదా అనే అనుమానాలు కూడా టీడీపీని వెంటాడుతున్నాయి. ఈ విభేదాలు పెరిగితే…. అసలుకే ఎసరొస్తుందన్నది తమ్ముళ్ళ కంగారు. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం 50 డివిజన్లలో జనసేన నేతలు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే…. రెండు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరే ప్రమాదం ఉంది. టీడీపీ, జనసేన విభేదాలు ఇలాగే కొనసాగితే…. అది వైసీపీకి అడ్వాంటేజ్‌ అవుతుందన్న లెక్కలు సైతం ఉన్నాయి. ఏ పార్టీ అయినా….. అసెంబ్లీ నియోజకవర్గంలో బలపడాలంటే…. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలి. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా మారిన ఏలూరు మేయర్ పదవి విషయంలో కూటమి పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version