Site icon NTV Telugu

OFF The Record: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై బీజేపీ నేతల గుర్రు

Dubbaka Off The Record

Dubbaka Off The Record

OFF The Record: ఆయన బీజేపీలో కీలక నేత. ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తన వాగ్ధాటితో ఎదుటివారిని కట్టడి చేసే ఆయనకు.. సొంత నియోజకవర్గంలో పార్టీ నేతల తీరు ఓ పట్టాన మింగుడు పడటం లేదు. అసమ్మతి పేరుతో నిర్వహిస్తున్న రహస్య సమావేశాలు వేడి రాజేస్తున్నాయి. అదెక్కడో.. ఆ నాయకుడు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.

దుబ్బాక బీజేపీలోని సీనియర్లు ఎందుకు రహస్యంగా భేటీ అయ్యారు? కాషాయ శిబిరంలో ఎందుకు కలకలం? ప్రస్తుతం టీ బీజేపీలో ఈ ప్రశ్నల చుట్టూ చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన దుబ్బాక ఉపఎన్నికలో రఘునందన్‌రావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ నాయకులు అదే ఉత్సాహంతో పోరాటం చేయడానికి దుబ్బాక గెలుపు ఊపిరి పోసిందనే చెప్పాలి. అలాంటి ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై బీజేపీ సీనియర్లు ప్రస్తుతం తిరుగుబాటు ప్రకటించారు. నియోజకవర్గంలోని బీజేపీ సీనియర్లు ఒక్కటై.. అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సొంత ఎమ్మెల్యేను బీఆర్‌ఎస్‌ కోవర్టు అని ఆరోపించేంతంగా విభేదాలు ముదిరిపోయాయి.

దుబ్బాక బీజేపీలో హఠాత్తుగా అసమ్మతి స్వరం ఎందుకు తెరమీదకు వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో పడ్డారు కమలనాథులు. తమకు తమను అసమ్మతి వర్గంగా చెప్పుకొంటున్న కొందరు దుబ్బాక బీజేపీ నేతలు చేగుంటలో రహస్యంగా సమావేశం నిర్వహించారట. సమావేశంలో రఘునందన్‌రావుపైనే ఎక్కువగా చర్చించారట. బీజేపీలో మొదటి నుంచి ఉన్నవారిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనేది సమావేశంలో పాల్గొన్నవారి ఆరోపణ అట. అందరినీ కలుపుకొని ముందుకు సాగడం లేదని.. తమకు ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చారట. ఈ నెలాఖరును మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని చేగుంట భేటీలో నిర్ణయించారట.

అసమ్మతి నేతల వాదన ఇలా ఉంటే.. ఎమ్మెల్యే రఘునందన్‌రావు వాదన మరోలా ఉంది. బీజేపీ సీనియర్లుగా చెప్పుకొంటున్నవారు పార్టీ కోసం ఎప్పుడూ పనిచేయ లేదని.. ఉపఎన్నికలో బీజేపీకి, తనకు వ్యతిరేకంగా పనిచేశారనేది ఎమ్మెల్యే ఆరోపణ. ఉపఎన్నికలో రఘునందన్‌రావుకు ఓటేయొద్దని ఓ సీనియర్ నేత, కొందరు కార్యకర్తలు ప్రచారం చేశారని చెబుతున్నారు. అందువల్లే వారిని తర్వాతి కాలంలో దూరం పెట్టారనేది ఎమ్మెల్యే వర్గీయుల మాట. దుబ్బాకలో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే చేగుంటలో అసమ్మతి రాగం అందుకున్నారని రఘునందన్‌ శిబిరం వాదిస్తోంది. అంతేకాదు ఈ సమస్యను రఘనందన్‌రావు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం.

ఉపఎన్నికలో గెలిచిన రెండేళ్ల తర్వాత అసమ్మతి రాగం
రఘునందన్‌రావు ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు దాటిన తర్వాత అసమ్మతి పేరుతో కొందరు నాయకులు బయటకు రావడంపైనా పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఎప్పుడూ లేనిది.. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్వరం పెంచడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గీత దాటిని పార్టీ నేతపై బీజేపీ పెద్దలు వేటు వేశారు. ఇప్పుడు దుబ్బాక రగడపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version