NTV Telugu Site icon

Off The Record: ఆ జిల్లా నేతల మధ్య పదవుల చర్చ..! మంత్రివర్యా అని పిలిపించుకోవడానికి ఉబలాట పడుతున్నారా?

Balu Naik

Balu Naik

Off The Record: తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు తొక్కని గడప లేదు… మొక్కని దేవుడు లేడు అన్నట్లుగా ఉందట వ్యవహారం. మంత్రి పదవుల కోసం ఎవరి వ్యూహాల్లో వారు మునిగి తేలుతున్నారు. పదవి కోసం కొందరు నేతలు పార్టీ పెద్దలకు తలలో నాలుకలా మారుతుంటే….. మరికొందరు కంట్లో నలుసులా తయారయ్యారనే చర్చలు కూడా జోరుగానే జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న మాట వినిపిస్తే చాలు… ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మేమున్నామంటూ తమ గాఢ్ ఫాదర్స్ దగ్గర వాలిపోతున్నారట. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతా మంత్రులేనని క్యాడర్ బాహాటంగానే మాట్లాడుకుంటోంది. ఈ చర్చోప చర్చలు ఇలా నడుస్తుండగానే.. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ రకరకాల ఈక్వేషన్స్‌ని తెర మీదికి తెస్తున్నారట.

మంత్రి వర్గంలో లంబాడా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనందున తనకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారట ఆయన. అంతేకాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని, తనకు మంత్రి పదవి ఇస్తే…. ఆ సామాజిక వర్గానికి గౌరవం, ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుందంటూ లెక్కలు చెబుతున్నారట ఆయన. అమాత్య యోగం కోసం విన్నపాలు వినవలే… అంటూ తన పొలిటికల్ గాడ్‌ఫాదర్, సీనియర్ నేత జానారెడ్డితో పాటు జిల్లా సీనియర్స్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట ఎమ్మెల్యే. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో లంబాడాలు కీలకం కావడం.. ఆ నియోజవర్గాలపై జానారెడ్డికి కూడా గట్టి పట్టు ఉండటంతో వ్యూహాత్మకంగానే సీనియర్ నేత ఆశీస్సులు కోరుతున్నారట బాలు నాయక్… గతంలోనూ, తాజాగా ప్యానల్ స్పీకర్ గా పనిచేసిన అనుభవం మంత్రి పదవికి చాలదా అని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

రెండోసారి గెలిచిన తాను మంత్రి పదవి అడిగితే తప్పేంటని అంటూ, ఈసారి మనకు గ్యారంటీ అని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. ఓవైపు మంత్రి పదవి చర్చ, రచ్చ ఇలా జరుగుతుంటే…… బాలునాయక్‌కు అదికాకున్నా… డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయమన్న మరో ప్రచారం మొదలైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ లో కీలకంగా, క్రీయాశీలకంగా ఉన్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికిచెందిన ఇద్దరు బలమైన నేతలు ఉమ్మడి జిల్లా నుండి మంత్రులుగా ప్రాతినిథ్యం వహిస్తున్న టైంలో… అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్‌ ఉంటుందన్న చర్చ ఇప్పటికే నడుస్తోంది. అదే సమయంలో… కులాలు కాకున్నా, ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవులు అంత తేలికకాదని, బాలు నాయక్‌ని డిప్యూటీ స్పీకర్‌తో సర్దుకోమని చెప్పవచ్చన్న వాదన బలపడుతోంది. బాలు లక్‌ అండ్‌ టైం ఎలా ఉందో చూడాలి మరి.