NTV Telugu Site icon

Off The Record: ఆ విషయంలో కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ అవుతుంది..?

Revanth

Revanth

Off The Record: అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో పార్టీ నాయకులు.. గప్‌చుప్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్ప సినిమా వ్యవహారంలో ప్రభుత్వం.. పోలీసులు చూసుకుంటారని దానిపై రాజకీయ నాయకుల కామెంట్స్ అవసరం లేదని హెచ్చరించారు. అనవసరంగా నాయకులు ఎదురుదాడి చేస్తే తలనొప్పి వస్తుందని ముందే గ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి…పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. పుష్ప వ్యవహారంలో నాయకులు ఎవరు మీడియా సమావేశాలు పెట్టకూడదని…ఆ వ్యవహారం జోలికి వెళ్లడం అంత మంచిది కాదని దిశా నిర్దేశం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు జరిగిన రోజు…ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. దాన్నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేసింది. అయితే అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీనిపై అల్లు అర్జున్ మీడియా సమావేశాన్ని పెట్టి ఇరుకున పడిపోయారు. అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నకి సీఎం సమాధానం చెప్పడం… సీఎం చెప్పిన సమాధానానికి బన్నీ ప్రతిస్పందించడంతో రచ్చ మళ్లీ మొదటికి వచ్చింది.

తన క్యారెక్టర్‌ను హననం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ…అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్దలు… తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించకుండా బన్నీని పరామర్శించడం ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌కి జనం కనెక్ట్ అయ్యారు. దీంతో అల్లు అర్జున్ మీడియా సమావేశంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీటుగానే స్పందించింది. ఇలా ఈ ఎపిసోడ్‌లో అధికార పార్టీకి కొంత పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. లా అండ్ ఆర్డర్ విషయంలో సినిమా వాళ్ళైనా సాధారణ పౌరుడు అయిన ఒకటేనంటూ…రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చిందనే చర్చ నడుస్తోంది. పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు స్పందించాల్సిన పనిలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందిస్తే…ఇష్యూ మరో దారిలోకి వెళ్లే అవకాశం ఉందని గుర్తించారు సీఎం రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరు మీడియా సమావేశాలు పెట్టకూడదని క్లారిటీ ఇచ్చారు. అయినా సోమవారం గాంధీభవన్‌లో నాయకులంతా పోటీపడి మీడియా సమావేశం నిర్వహించారు. ఒకరిద్దరు నాయకులు చేసిన కామెంట్స్ అనవసర తలనొప్పి తెచ్చే ప్రయత్నం జరిగిందనేది పార్టీ అంచనా. ఈ ఇష్యూ పై పోలీసులు వీడియో విడుదల చేశాక…అసలేం జరిగిందన్న విషయంపై చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక నుంచి దీనిపై పార్టీ నుంచి నాయకులు చెప్పాల్సిన అవసరం లేదనే ఆలోచనతో నాయకత్వం ఉంది. అందుకే ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చారు. అయినా గాంధీభవన్‌లో నాయకులంతా క్యూ కట్టారు. దీంతో అటు సీఎం రేవంత్ రెడ్డి… ఇటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పార్టీ నాయకులకి మరోసారి సీరియస్‌గానే చెప్పేశారు. మీడియా సమావేశాల్లో…చర్చల్లో ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు.

ఇదే అంశంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి స్పష్టత ఇచ్చేందుకు గాంధీభవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే నాయకులంతా పోటీపడి మాట్లాడారు. ఇకపై దీని గురించి ఎవరు మాట్లాడొద్దు అంటూ సీఎం మాటగా స్పష్టం చేశారు. ఒకసారి చెప్పిన తర్వాతనే మళ్లీ కంటిన్యూ అయిన నేపథ్యంలో…అటు సీఎం..ఇటు పిసిసి కార్యాలయాల నుంచి పార్టీ నాయకులు అందరికీ మెసేజ్లు పెట్టి ఎవరూ మాట్లాడొద్దని కఠినంగా హెచ్చరించారు.

Show comments