Off The Record: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో రేగుతున్న అగ్గిని చల్లార్చేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నిస్తున్నా… కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. తగ్గినట్టే తగ్గి తిరిగి అంటుకుంటూ ఉండటం సమస్యను మరింత పెంచుతోందట. సాధారణంగా సౌమ్యంగా కనిపించే మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎమ్మిగనూరు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట. అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తే లేదని పట్టుబట్టినట్టు సమాచారం. తనను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్‌గా తప్పించి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్‌గా నియమించినా… ఇది కూడా ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధే కదా అంటూ లాజిక్ లాగుతున్నట్టు తెలిసింది. 2024 ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని, ఇపుడు అధిష్టానం మీద వత్తిడి తెచ్చి ఇంచార్జి బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించారంటూ మండిపడుతున్నారామె. అందుకే ఎమ్మిగనూరును వదిలి ప్రసక్తే లేదని, ఇక్కడే అమీతుమీ తేల్చుకుంటూనని అంటున్నట్టు తెలిసింది.
తాజాగా పార్టీ అధ్యక్షుడు జగన్ బర్త్‌డే సందర్బంగా బుట్టా రేణుక చేసిన వ్యాఖ్యలు, అంతకు ముందు నుంచి ఆమె అనుసరిస్తున్న విధానాన్ని చూస్తుంటే… ఎంత క్లారిటీగా ఉన్నారో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చెన్నకేశవరెడ్డి మనవడు రాజీవ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా వున్నారు. అటు రేణుక కూడా ఎమ్మిగనూరులోనే తన ఆఫీస్ కొనసాగిస్తూ చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీన్ని భరించలేని చెన్నకేశవరెడ్డి వర్గం ఆమె ఇంకా ఎమ్మిగనూరులోనే ఎందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇదే విషయమై పార్టీలో ఓ స్థాయి నాయకులకు ఫిర్యాదు చేశారట. వాస్తవంగా చూస్తే… ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కర్నూలు పార్లమెంట్ సీటు పరిధిలోనిదే. ఈ క్రమంలోనే… తాజాగా ఎమ్మిగనూరు నుండి, మీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరని మాజీ ఎంపీ అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాడర్ బలంగా ఉందని, ఆ బలమే తనను క్యాడర్ దగ్గరకు చేరుస్తుందని ఎమోషనల్‌గా అన్న మాటలు కొత్త చర్చకు దారి తీశాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ తనకు అవకాశం కల్పించారని, రెండేళ్ళుగా క్యాడర్ అంతా తనపై నమ్మకం పెట్టుకొని నాయకురాలిగా నిలబెట్టిందని చెప్పుకొచ్చారు.
జగనన్న మాట కాదనలేక , క్యాడర్ అభిమానాన్ని వదులుకోలేక ఇబ్బంది పడుతున్నానని, బలంగా నిలబడి మరోసారి తనకు ధైర్యాన్నిచ్చారంటూ చేసిన కామెంట్స్ ఆమె నియోజకవర్గాన్ని వదిలేలా లేదని చెప్పకనే చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. ఎమ్మిగనూరులో కుల సంఘాల స్మశాన స్థలం అంశాన్ని కూడా రేణుక తెరపైకి తీసుకురావడం హాట్ టాపిక్ అయింది. కులసంఘాల స్థలాన్ని కబ్జా చేసారని ఆరోపించిన మాజీ ఎంపీ… ఆక్రమణదారులపై అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.15 రోజుల్లో కబ్జా స్థలాన్ని కులసంఘాలకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారామె. స్మశాన స్థలాన్ని కబ్జా దారులు ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారన్నది బుట్టా ఆరోపణ. ఇది కూడా భవిష్యత్తు వ్యూహమేనా అనే చర్చ జరుగుతోంది. కుల సంఘాల స్మశాన స్థలం బుట్టా వ్యతిరేక వర్గీయులు ఆక్రమించారని, అందుకే పోరాటానికి సిద్ధమైనట్లు భావిస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇప్పటికే బుట్టా రేణుక, రాజీవ్ రెడ్డి వర్గాలు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై చెన్న కేశవ రెడ్డి వర్గం వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఎమ్మిగనూరు వైసీపీలో రచ్చ పీక్ కి చేరింది. ఫైనల్‌గా ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
