కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ సర్కార్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఈ దూరం కారణంగా బడ్జెట్ ఆమోదించలేదని హైకోర్టు తలుపు తట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పరిణామాల్లో వచ్చిన మార్పుతో గవర్నర్, రాష్ట్ర సర్కార్ మధ్య సయోధ్య కుదిరింది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై తీరుపై అధికార BRS పార్టీ నాయకులు కొంతకాలంగా భగ్గుమంటున్నారు. రాజ్‌భవన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సీన్ మారడంతో గవర్నర్ విషయంలో అధికారపార్టీ నేతల తీరు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఉంది.
అధికారపార్టీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు గవర్నర్ అసంతృప్తితో ఉన్నారు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వచ్చిన దూరంతో గులాబీ పార్టీ నాయకులు మరింత దూకుడుగా విమర్శలు చేశారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమాలకు BRS ప్రజాప్రతినిధుల దూరంగా ఉంటున్నారు. తాజా సయోధ్యతో రాజ్‌భవన్‌లో ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నాయకులు. అయితే కొద్దిరోజుల క్రితం గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ..spot..
మొన్నటికి మొన్న రిపబ్లిక్ డే ఉత్సవాల విషయంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆగమేఘాలపై రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు చేశారు. దీనిపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు బడ్జెట్ అంశం చర్చకు వచ్చింది. తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదని.. ఓపెన్‌గానే చెప్పారు గవర్నర్ తమిళిసై. గతంలోలా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లడం లేదు. చాలా రోజుల తర్వాత ఇటీవలే గవర్నర్, సీఎం పరస్పరం ఎదురు పడ్డారు. రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిదికి వచ్చినప్పుడు ఇద్దరూ పలకరించుకున్నారు. ఆ తర్వాత షరా మామూలే. బీజేపీపై బీఆర్ఎస్ మొదలుపెట్టిన రాజకీయ యుద్ధం ప్రభావం రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య కనిపించింది. ఆ ఎఫెక్ట్ చాలా గ్యాప్ తీసుకొచ్చేసింది. ఖమ్మంలో బీఆర్‌ఎస్ నిర్వహించిన సభలోనూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ల తీరును తప్పుపడుతూ ప్రసంగించారు. అలాంటి వాతావరణం నుంచి ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. హైకోర్టు సూచనలతో వాతావరణ కొంత తేలికపడినట్టు కనిపిస్తోంది. గత ఏడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పుడు మాత్రం గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలా అడుగులు పడ్డాయి. ఆ క్రమంలోనే రెండు రాజ్యాంగ వ్యవస్థలు మరింత చేరువయ్యేలా పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. గవర్నర్లపై విమర్శల విషయంలో బీఆర్ఎస్ నేతలను లక్ష్మణ రేఖ దాటకుండా కట్టడి చేస్తారో లేక సయోధ్యలో విమర్శలకు చోటే లేకుండా చర్యలు తీసుకుంటారో తెలియాలి. ప్రస్తుతం అందరి దృష్టీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై నెలకొంది.