NTV Telugu Site icon

Off The Record: బీఆర్‌ఎస్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తుందా..? కలిసొచ్చే పార్టీలేంటి?

Brs Party

Brs Party

Off The Record: టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత మొదటిసారి బహిరంగ సభకు రెడీ అవుతోంది. మొదట్లో దేశ రాజధాని డిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే తొలిసభ తెలంగాణలోనే అట్టహాసంగా నిర్వహించి ప్రయాణం మొదలుపెట్టాలని డిసైడైంది. ఈ నెల 18న ఖమ్మంలో 5 లక్షల మందితో సభ పెట్టి దేశం దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు గులాబీ నేతలు. తెలంగాణలోపాటు ఏపీ సరిహద్దు నియెజకవర్గాల్లోని ప్రజలను సభకు సమీకరించాలనేది పార్టీ నిర్ణయం. మొదటి సభ కావడంతో ప్రతి అంశాన్నీ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.

Read Also: Off The Record: వైసీపీలోనే ఉంటానంటారు.. వేడి రాజేస్తారు.. ఎమ్మెల్యేపై బంధువు ఒత్తిడి ఉందా?

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని అనుకుంటున్న బీఆర్‌ఎస్‌.. ఖమ్మం సభకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలను ఆహ్వానిస్తోంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇద్దరు మాజీ సీఎంలు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆహ్వానాలు వెళ్లినా.. వీరిలో ఎంతమంది ఖమ్మం సభకు వస్తారు.. ఎవరు దూరంగా ఉంటారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఒకవేళ సభకు వస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు ఉంటాయి. బీఆర్‌ఎస్‌ ఆహ్వానించిన వారిలో ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లతోపాటు కేరళ సీఎం పినరాయి విజయన్‌ తదితరులు ఉన్నారు.

ఆ మధ్య సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం కేజ్రీవాల్‌తో కలిసి అక్కడి ప్రభుత్వ స్కూల్స్‌లో పర్యటించారు. అలాగే పంజాబ్‌లో రైతులకు ఆర్థిక సహాయం అందించే సమయంలో కేసీఆర్‌తో కలిసి వేదిక పంచుకున్నారు కేజ్రీవాల్‌. ఆ తర్వాత ఈ ఇద్దరు సీఎంలు రాజకీయ వేదికలపై కలిసి కనిపించిన సందర్భాలు లేవు. దేశవ్యాప్తంగా ఆమ్‌ ఆద్మీపార్టీని విస్తరింప చేయాలని కేజ్రీవాల్‌ చూస్తున్నారు. ఇటీవల వరకు జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్‌ పోటీ చేసింది. తెలంగాణలోనూ వేళ్లూనుకోవాలన్నది ఆప్‌ ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగినప్పుడు కేజ్రీవాల్‌ రాలేదు. అందుకే ఖమ్మం సభకు కేజ్రీవాల్‌ వస్తారా అనేది ప్రశ్న.

ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో కలిసి సీఎం కేసీఆర్‌ ప్రయాణం మొదలు పెట్టడంతో.. సభకు కామ్రేడ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా ఖమ్మం జిల్లాలో లెఫ్ట్‌ పార్టీలకు పట్టు ఉంది. మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో వామపక్ష పార్టీలతో గులాబీపార్టీ బంధం బలపడింది కూడా. వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ మాత్రం జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ అజెండా కోసం ప్రయత్నం చేస్తోంది. కొన్ని ప్రాంతీయపార్టీలు కాంగ్రెస్‌ విషయంలో సానుకూల ధృక్పథం ప్రదర్శిస్తున్నాయి. పార్టీలన్నీ క్రమంగా 2024 లోక్‌సభ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నాయి. కొన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ తరుణంలో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ నిర్వహించే సభవైపు ఆ పార్టీల చూపు ఉంది. సభలో బీఆర్ఎస్‌ అజెండాను సీఎం కేసీఆర్‌ ప్రకటించాక జాతీయ రాజకీయాల్లో గులాబీ పార్టీ ప్రయాణంపై మరికొంత క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్‌తో కలిసి నడిచేది ఎవరు అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.