Site icon NTV Telugu

Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

Otr Praja Varadhi Bjp Rjy

Otr Praja Varadhi Bjp Rjy

Off The Record: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓవైపు ఏపీ యంత్రాంగం పనిచేస్తున్నా…దానికి సమాంతరంగా రాజమండ్రిలో బీజేపీ చేస్తున్న కార్యక్రమం చర్చనీయాంశమైంది. ప్రజావారధి పేరుతో మొదలుపెట్టిన ప్రోగ్రామ్‌ చుట్టూ…. సరికొత్త ప్రశ్నలు పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్స్‌ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్టేటస్‌ను ట్రాక్ చేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. పారదర్శకంగా, అధికారికంగా సమస్యల పరిష్కారానికి అమలవుతున్న విధానం అది. కానీ… దానికి సమాంతరంగా రాజమండ్రి బీజేపీ ఆఫీస్‌లో ప్రతి శుక్రవారం ప్రజావారధి పేరుతో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మీ సమస్య- మా బాధ్యత అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్‌ నడుస్తోంది. ఇందులో పార్టీ నాయకులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వికలాంగుల పెన్షన్లు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల్లాంటి అంశాలపై వినతి పత్రాలు ఇస్తున్నారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు ఫార్వార్డ్‌ చేస్తామని చెబుతున్నారు పార్టీ నాయకులు. ఇక్కడే సరికొత్త సందేహాలు వస్తున్నాయి. ప్రతి సోమవారం ప్రభుత్వ గ్రీవెన్స్ వ్యవస్థ నడుస్తుండగానే మళ్లీ ఈ ఫ్రైడే ప్రోగ్రామ్‌ ఏంటి? అధికారులకు ఫార్వార్డ్‌ చేస్తామని చెప్పడం తప్ప… బీజేపీ నాయకులు చూపిస్తున్న పరిష్కారాలేంటన్న చర్చ జరుగుతోంది.

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ఫిర్యాదులు అధికారికంగా నమోదు అవుతున్నాయి. సమస్య పరిష్కారం ఎలా జరుగుతుందో కూడా ఫిర్యాదుదారులకు తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అదే లక్ష్యంతో పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద బీజేపీకి పూర్తి నమ్మకం లేదా? లేక ప్రజల ఇబ్బందుల గురించి అధికారులకు తెలియడంలేదని నమ్ముతున్నారా? ఈ రెండూ కాకుండా పార్టీ స్థాయిలో ప్రజలతో నేరుగా కనెక్ట్ కావాలన్న వ్యూహమా? అంటూ రకరకాల డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్ని రెండు లక్ష్యాలతో నిర్వహించే అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో ఒకటి ప్రజలతో డైరెక్ట్‌గా కనెక్ట్‌ అవడం. ఇలాంటి ఫిర్యాదుల స్వీకరణ ద్వారా నాయకులు ప్రజల సమస్యలను నేరుగా వింటే, స్థానికంగా పార్టీ ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. పొలిటికల్‌ మైలేజికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక పార్టీ స్థాయిలో వినతులు స్వీకరించడం ద్వారా మేం ప్రజల కోసం పనిచేస్తున్నామన్న ఇమేజ్‌ బిల్డ్ చేసుకోవచ్చన్న లెక్కలున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం కూడా రాజకీయంగా చర్చకు వస్తోంది.

ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీనే ప్రభుత్వ వ్యవస్థకు సమాంతరంగా కార్యక్రమం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు కొందరు. ఇది కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదన్న సంకేతమా?లేక పార్టీ తన సొంత రాజకీయ కార్యక్షేత్రాన్ని విస్తరించుకునే ప్రయత్నమా? అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. అయితే ఈ విషయంలో స్థానిక బీజేపీ నాయకుల వెర్షన్‌ వేరుగా ఉంది. ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవచ్చని అలాంటి వాటిని స్థాయిలో పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ ఇంపాక్ట్‌ వేరుగా ఉంటుందంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. ఇది ప్రభుత్వ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని, ప్రజా సమస్యల పరిష్కారానికి మరో వేదిక మాత్రమేనని చెబుతున్నారు కాషాయ లీడర్స్‌. కానీ…. ఎట్నుంచి ఎటొచ్చినా….ఒక పారదర్శక వ్యవస్థ ఉన్నప్పుడు వీళ్ళు కొత్తగా చేసేదేంటి? ప్రజలకు అదనంగా ఒరిగేదేంటన్న చర్చలు మాత్రం ఆగడం లేదు రాజమండ్రిలో. ఆ చర్చలు ఎలా ఉన్నా… బీజేపీ నాయకుల ఉద్దేశ్యం ఏదైనా…. అంతిమంగా ప్రజలకు మేలు జరిగితే అదే పదివేలన్నది బాటమ్‌లైన్‌.

Exit mobile version