Off The Record: తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మళ్లీ అధికారం కోసం తహతహలాడుతోంది. ఏ చిన్న ఛాన్స్‌ని వదిలిపెట్టకుండా… వీలైనంతగా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఈ క్రమంలోనే… పార్టీ తరపున గెలిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం పేరిట ఖమ్మం జిల్లాలో పర్యటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ సందర్భంగానే ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదే… మొత్తం రాష్టంలోనే హాట్ హాట్ పొలిటికల్ డిస్కషన్స్‌కు కారణం అవుతోంది. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోకి కేటీఆర్ కాన్వాయ్ ఎంటరవగానే… ఆయనకు ఘనస్వాగతం పలికాయి బీఆర్‌ఎస్ శ్రేణులు. ఆ సందర్భంగా కనిపించిన సీన్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలకడం, ర్యాలీ తీయడం కామన్. కానీ…. అదే ర్యాలీలో అనూహ్యంగా వైసీపీ జెండాలు ప్రత్యక్షం కావడం ఇంట్రస్టింగ్ టాపిక్ అయింది.
వైసీపీ అధ్యక్షుడు జగన్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో సరిపెట్టకుండా…. జై జగన్.. జై కేటీఆర్ అంటూ ఇద్దర్నీ కలిపి నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే తరహాలో ఆ మధ్య ఏపీలో కూడా ఓ ఘటన జరిగింది. జగన్మోహన్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో అక్కడక్కడా…కేసీఆర్ ఫోటోలు కనిపించాయి. దాని గురించే రకరకాల విశ్లేషణలు జరుగుతున్న టైంలో… ఇప్పుడు డైరెక్ట్‌గా జై జగన్, జై కేటీఆర్ నినాదాలు వినిపించడం యాదృచ్చికం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. మొదట్నుంచి మంచి అవగాహన ఉన్న రెండు పార్టీలు తెలంగాణలో దగ్గరవుతున్నాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. రెండు పార్టీల అధిష్టానాల మధ్య ఆది నుంచీ సఖ్యత ఉంది. కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ పరిస్థితుల్లో… ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్న వరుస ఘటనల్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. అంచనాలు తిరగబడ్డాయిగానీ…. గత ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ జగనే గెలుస్తారంటూ… అందరికంటే ముందే చెప్పారు కేసీఆర్. ఆ రకంగా పరస్పరం ప్రేమగా ఉంటున్నప్పటికీ… ఇప్పటిదాకా ఎక్కడా ఒకర్ని ఒకరు రాజకీయంగా సపోర్ట్ చేసుకున్నట్టు బహిరంగంగా కనిపించలేదు.
కానీ… మొన్న ఏపీలో, నిన్న ఖమ్మం జిల్లాలో కనిపించిన దృశ్యాలు మాత్రం రెండు పార్టీలు ఇక ఓపెనైపోతున్న సంకేతాలు పంపుతున్నాయంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. ఒక పరిధి వరకు సామాజికవర్గం లెక్కలు కూడా అనుకూలిస్తాయి. దాంతో వాళ్ళంతా బీఆర్‌ఎస్‌కే సపోర్ట్ చేస్తారని ఇన్నాళ్ళు లోలోపల చర్చలు జరిగేవి. ఇప్పుడిక అది ఓపెన్ అయిపోతోందని, కేటీఆర్ ఖమ్మం మీటింగ్‌లో వైసీపీ జెండాలు కనిపించడమే అందుకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న బంధం ఇంకా బలపడుతోందనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీకి కొంత క్యాడర్ ఉంది. గతంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా… ఖమ్మం ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే సీట్లను కూడా వైసీపీ గెల్చుకుంది. ఇన్నాళ్ళు కాస్త అటు ఇటుగా ఉన్నా… ఇప్పుడు ఆ కేడర్, బలం మొత్తం పరిపూర్ణంగా బీఆర్‌ఎస్ వైపు నడిచే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. భవిష్యత్ పరిణామాలకు సూచికగానే ఇప్పుడు కేటీఆర్ ర్యాలీ, మీటింగ్‌లో వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి మద్దతిస్తామన్నా కాదనేది ఉండబోదని, ఇప్పుడు వైసీపీ కేడర్ సపోర్ట్ చేస్తామంటే మేమెందుకు వద్దంటామన్నది బీఆర్‌ఎస్ నేతల వాయిస్. వోవరాల్‌గా చూస్తుంటే… రెండు ప్రతిపక్ష పార్టీల బంధం మరింత బలపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.