Site icon NTV Telugu

Off The Record: అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయా..?

Otr Acb

Otr Acb

Off The Record: తెలంగాణలో అవినీతి అధికారులకు నిద్ర లేకుండా చేస్తోంది ఏసీబీ. గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను దారిలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి అధికారులపై ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించింది. రెండేళ్లలో వందలాది మంది అక్రమాలపై కేసులు నమోదు చేసింది. వందల కోట్ల నగదు, ఆస్తులను సీజ్ చేస్తూ అధికారులను జైలుకు పంపించింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, జిహెచ్ఎంసి, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ శాఖపై ఎసిబి దృష్టి సారించింది.

బీఆర్ఎస్ పాలనలో చక్రం తప్పిన కొందరు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. శాఖల వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. కొందరు ప్రభుత్వ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. ప్రభుత్వంలో లేని వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కూడా సర్కారుకు నివేదికలు అందాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ఉన్నతాధికారులు, ఇంజినీర్లను ఏసీబీ లక్ష్యంగా చేసుకుందనే చర్చ నడుస్తోంది.

బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన ఇంజినీర్లే లక్ష్యంగా ఏసీబీ దాడులు చేస్తుండటం శాఖల్లో ప్రకంపనలు సృష్టిస్తోందట. తదుపరి ఎవరిపై దాడులు జరుగుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోందని టాక్‌. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 2023లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం భారీ సీపేజీలు ఏర్పడ్డాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో విచారణ జరిపించింది. ఏకంగా 38 మంది ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆ విభాగం సిఫారసు చేసింది. దీంతో వీరికి సర్కారు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు పదోన్నతులను నిలుపుదల చేసింది. మరోవైపు…సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసి బరాజ్ నిర్మాణంలో అవినీతి, అవకతవకలపై సమాంతర విచారణ జరిపిస్తోంది. ఈ నెలాఖరులోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఏసీబీ అరెస్టుల పర్వానికి తెరతీసిందని సమాచారం.

నీటిపారుదల శాఖలో గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా రెండు కీలక హోదాల్లో కొనసాగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన భూక్యా హరిరామ్‌ను ఏప్రిల్‌లో అరెస్టు చేసింది. ఎస్సారెస్పీ డివిజన్-8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను ఆతర్వాత అరెస్టు చేసింది. 2011 ఆగస్టు 1 నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీగా కొనసాగుతున్న మురళీధర్రావు 2013లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, తెలంగాణ వచ్చాక కూడా ఆయన అదే పోస్టులో కొనసాగారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. శివబాలకృష్ణ వద్ద ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఆయన నివాసంతోపాటు దాదాపు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అధికారులు భారీగా ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ దాదాపు 36 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారుల అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఆయనకు 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక రెవెన్యూశాఖలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు భారీ అవినీతికి పాల్పడినట్లు ఎసిబి కేసులు నమోదు చేసింది. సదరు అధికారులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిత్యకృత్యంగా మారింది. ప్రతీ రోజు ఎక్కడో ఒక దగ్గర సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరుకుతున్నారు. మున్సిపల్ శాఖలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అవినీతి పెరిగి పోయింది. ఇటీవల నార్సింగి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.

Exit mobile version