Off The Record: ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ సొంత జిల్లాలో ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు పొలిటికల్ హాట్‌గా మారిపోయింది. నేను ఒకర్ని కెలకను, నన్ను కెలికితే ఊరోకోబోనంటూ సొంత పార్టీ నాయకులకే ఆయన సీరియస్‌గా హెచ్చరికలు చేయడం గురించి రకరకలా విశ్లేషణలు నడుస్తున్నాయి. మంత్రి హోదాలో ఉండి కూడా… ఇతర నియోజకవర్గాల్లో తాను వేలు పెట్టి రాజకీయాలు చేయడం లేదని, తన ఆలోచన అంతా కర్నూలు జిల్లా అభివృద్ధి మీదే ఉందన్నారాయన. కావాలని నన్ను టార్గెట్ చేయొద్దు, నేను రాజకీయం చేయాలనుకుంటే మీకే ఇబ్బంది..అంటూ వార్నింగ్ ఇచ్చారు టీజీ భరత్. సీఎం చంద్రబాబు, లోకేష్‌కు తానేంటో తెలుసునని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు తాను కేబినెట్‌లో ఉంటానని కూడా క్లియర్‌గా చెప్పారాయన. దీంతో… అసలు ఆయన్ని టార్గెట్ చేసిందెవరు, ఎవరికి ఆ రేంజ్ వార్నింగ్ ఇచ్చారంటూ చర్చలు నడుస్తున్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని 3 డివిజన్లు కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అక్కడ టీడీపీ ఇన్చార్జ్‌గా జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.
అలాగే… ఆయన అనుచరుడు బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే. ఈ క్రమంలో…కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లో విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారనేది టీజీ వర్గీయుల అభ్యంతరంగా తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి అనుచరుడు నాగరాజు నియమితులయ్యారు. దీన్ని కూడా విష్ణువర్ధన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. ఆ రకంగా రెండు వర్గాల మధ్య విబేధాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తాజాగా మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కోడుమూరు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు టీజీ వెంకటేష్. అ సమయంలో కూడా మంత్రి అనుచరులు ప్రోగ్రామ్‌లో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగిందట. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టీజీ భరత్ పేరు కూడా ఉచ్ఛరించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది.
ఈ విషయాన్ని కొందరు విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా… వేదిక మీదే…. మైక్ ఆన్‌లో వుండగానే ‘నోరు మూసుకో’ అనడం టీజీ వర్గీయుల చెవిన పడింది. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో ఉంచుకునే.. ఆ మరుసటిరోజే భరత్ హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. అంత గట్టిగా మాట్లాడినా… ఎవర్ని ఉద్దేశించి అన్నారో అర్ధం అవుతున్నా, డైరెక్ట్‌గా లేకపోవడంతో… వ్యతిరేక వర్గం కౌంటర్ ఇవ్వలేకపోతున్నట్టు తెలిసింది. కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపించి 4 దశాబ్దాల చంద్రబాబు కలనేరవేర్చానంటూ విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి భరత్ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారట. చంద్రబాబు, టీడీపీ లేకుండా విష్ణువర్ధన్ రెడ్డి గెలిపించారా….అలాగైతే 2019లో కూడా గెలిపించాలి కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తమ్మీద మంత్రి టీజీ వార్నింగ్స్ దుమారం గట్టిగానే రేగుతోంది కర్నూల్ పాలిటిక్స్‌లో.
