Off The Record: రొయ్యల మేత ధరలు తగ్గించండి మహా ప్రభో…. మమ్మల్ని ఆదుకోండి మహాశయా….. అంటూ హాహాకారాలు చేస్తున్నా, ఆందోళనలు నిర్వహిస్తున్నా ఎప్పటికప్పుడు ఓదార్పు మాటలే తప్ప వాస్తవంలో ఉపయోగం ఉండటం లేదని అంటున్నారు ఆక్వా రైతులు. అస్సలు మమ్మల్ని పట్టించుకునే దిక్కులేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు ఫీడ్ కంపెనీల లాభాల కోసం నాలుగు లక్షల మంది ఆక్వా రైతుల పొట్టగొడుతున్నారంటూ ఆగ్రహంగా ఉన్నారు కూడా. ఒక స్థాయిలో ఆందోళన చేస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దల్ని కలుస్తున్నా ఫలితం లేకపోవడంతో… ఆక్వా రైతులు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారట. దీంతో విషయం తెలుసుకున్న కూటమి నేతల్లో కూడా కంగారు మొదలైనట్టు తెలుస్తోంది. ఆక్వా రైతుల దెబ్బతో కూటమి కొంప మునుగుతుందా అనే చర్చ సైతం మొదలైందట ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో. త్వరలోనే అమలాపురంలో బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఛలో అమరావతి అంటూ పాద యాత్ర చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు రైతులు. వాస్తవంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరిలో మొదలైన రైతుల ఆందోళనలు ఇపుడు రాష్ట్రంలో ఆక్వా సాగు జరుగుతున్న అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఇప్పటికే ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపినా ఫలితం రాకపోవడంతో… ఫీడ్ కంపెనీల సిండికేట్‌కు ప్రభుత్వం వంత పాడుతోందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇటు రైతులు, అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వాసులు కూడా అదే నిజమని నమ్మే స్థితిలో ఉన్నారట.
ఈ వివాదంతో ఇప్పటికే ఆక్వా సాగు చేసే రైతులతో పాటు దాని మీద పరోక్షంగా ఆధారపడిన అనేక రంగాలకు సంబంధించిన వారిలో కూడా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతున్నట్టు సమాచారం. ఆ వ్యతిరేకతే ఇంతా పెరిగిపోయి కూటమికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తాయని అంచనాలు వేస్తున్నారట ప్రత్యర్థులు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కీలకమైన ఆక్వా రైతులు నుంచి వ్యతిరేకత పెరిగితే అది కూటమిపై స్పష్టమైన ప్రభావం చూపడానికి ఎంతోకాలం పట్టదని అంటున్నారు ఇక్కడి రైతులు. రైతు బాగుండాలంటూ మైకుల ముందు ఊదరగొట్టే నాయకులు అదే రైతు ఇబ్బందులు పడుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి పెరిగిపోతోంది. ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేయడంతోనే ఇటీవల వైసీపీ భీమవరంలో పెట్టిన బహిరంగ సభ సక్సెస్ అయిందని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఒక రకంగా ఇది కూటమి సర్కార్‌కు వార్నింగేనని అంటున్నారు వాళ్ళు. కంపెనీలు ఫీడ్ ధరలు తగ్గించినట్టే తగ్గించి మళ్లీ పెంచడానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రభుత్వం అటు కంపెనీలను కంట్రోల్ చేయలేక ఇటు రైతులకు సర్ది చెప్పలేక ఇరకాటంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 లక్షలకు పైగా ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి.
అయితే… క్రమంగా ఈ బంగారు బాతు చుట్టూ, రాజకీయ పార్టీలు, బడా నేతలు చేరిపోయారని, రైతులకు ప్రోత్సాహం పేరుతో ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టేసి చివరికి ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరినట్టు చెప్పుకుంటున్నారు. అలాంటి వారిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సైతం భయపడుతోందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి రైతుల్లో. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఆక్వా రైతులు నష్టపోవడానికి కేవలం ఐదుగురు వ్యక్తులే కారణమని, ఫీడ్ కంపెనీలు, హేచరీస్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఎక్స్‌పోర్ట్స్ అన్నీ ఆ ఐదుగురి చేతుల్లోనే ఉన్నాయని, వాళ్ళంతా మా వాళ్ళేనని కూటమి పార్టీల కీలక నేతలే చెబుతున్నారట. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యవహరిస్తున్న తీరుతో భవిష్యత్తులో మొత్తంగా కూటమికే గట్టి ఎదురు దెబ్బ తగులుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సిండికేట్ దెబ్బకు కూటమి కొంప మునగడం ఖాయమని రైతులు డైరెక్ట్‌గా కామెంట్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఆక్వా రైతుల కొనసాగిస్తున్న ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చి ఫీడ్ కంపెనీల దూకుడుకు కళ్లెం వేస్తుందో, లేక సెల్ఫ్ గోల్ చేసుకుంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు. కీలకమైన ఆక్వారంగాన్ని ఆదుకోకుంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి పట్టు సడలినట్టేనని కూడా అంచనా వేస్తున్నారు రాజకీయ నిపుణులు.

