NTV Telugu Site icon

Off The Record: సడన్‌గా జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు..! ఇది ప్రమోషనా? డిమోషనా?

Ambati

Ambati

Off The Record: అంబటి రాంబాబు…. ఏపీ పాలిటిక్స్‌ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా….అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా… తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి… ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న మాజీ మంత్రిని, రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలపై వెంటనే రియాక్ట్‌ అయ్యే నాయకుడిని సడన్‌గా వైసీపీ అధిష్టానం జిల్లా స్థాయికి ఎందుకు తగ్గించేసిందన్నది వైసీపీ వర్గాలకే అంతుబట్టడం లేదట. అంబటి రాంబాబును తాజాగా.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఈ చర్చ మొదలైంది. వాస్తవానికి ఒకసారి రేపల్లె, మరొకసారి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటికి డెల్టా , పల్నాడు ప్రాంతాల్లో పట్టుంది. మూడు సార్లు పోటీ చేసి, రెండు విడతలు గెలిచి, ఓసారి మంత్రిగా కూడా పనిచేశారాయన. అలాంటి నాయకుడు, రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా మంచి చరిష్మా ఉన్న వ్యక్తిని ఎందుకు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు అన్నది అంతుబట్టకుండా ఉందని పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్న పరిస్థితి.

అదే సమయంలో అంబటిని డిమోట్‌ చేశారా అన్న వాదన సైతం తెర మీదికి వస్తోంది. మరీ ఎమోషనల్‌ అవుతున్న కొందరు అనుచరులు అయితే… ఆయన దగ్గరికే వెళ్ళి సార్… రాష్ట్ర స్థాయిలో ఉండే మిమ్మల్ని జిల్లా స్థాయికి ఎందుకు మార్చేశారు? మేటర్‌ అమాయకంగా అడుగుతున్నారట. దీంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక వెనక ఉన్న అసలు రహస్యాన్ని అంబటి కుండబద్దలు కొడుతున్నట్టు తెలిసింది. పోరాడే తత్వం ఉన్న నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా అధిష్టానం ఎంపిక చేసిందని, అందులో భాగంగానే తనకు కూడా పదవి ఇచ్చారని, ఇది ప్రమోషనో, డిమోషనో అనే పదాలే రాకూడదంటూ కేడర్‌కు హితబోధ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అంబటి రాంబాబు ఎంత దూకుడుగా ఉంటారో… అంత ఒదిగిపోయే తత్వం ఉందన్నది దగ్గరగా చేసిన వాళ్ళు చెప్పే మాట. ఎంత కటువుగా మాట్లాడతారో, తన దగ్గరికి వచ్చిన వాళ్ళని అంతే సున్నితంగా దగ్గరకు తీసుకుంటారని చెబుతుంటారు. అందుకే… ప్రస్తుతం జిల్లా వైసీపీ కష్టకాలంలో ఉన్నందున అంబటి లాంటి నాయకుడు జిల్లా బాధ్యతలు తీసుకుంటేనే ఉపయోగంగా ఉంటుందని భావించిందట వైసీపీ అధిష్టానం. ఓటమి తర్వాత, పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసుకునేందుకు కార్యచరణ రూపొందిస్తోంది వైసీపీ. అందులో భాగంగా, జిల్లాలో నిలబడి ,కలబడి, పోరాడే నాయకుల్ని అధ్యక్షులుగా పెట్టాలన్న ఆలోచన చేశారట.

అటు డెల్టాలో, ఇటు గుంటూరులో, మంచి సంబంధాలు ఉన్న అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయితే, ఏడు నియోజకవర్గాల ఇన్చార్జిలను సమన్వయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయన్ని జిల్లా అధ్యక్షుడిని చేసినట్టు తెలుస్తోంది. అటు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఇటు గుంటూరులో అంబటి రాంబాబుని అధ్యక్షులుగా చేయడం వెనకున్న ప్లాన్‌ ఇదేనంటున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే…. వయసు రీత్యా కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన అంబటికి లేదని, కష్టాల్లో ఉన్న పార్టీకి తనవంతు సేవలు అందించి తిరిగి నిలబెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన కూడా జిల్లా అధ్యక్ష పదవికి ఒప్పుకున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. మరి పార్టీని నిలబెట్టడానికి రాంబాబు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు? వాటిని ఎలా అమలు చేస్తారు? జిల్లా పార్టీని నడపడం మైక్‌ ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించినంత తేలిగ్గా ఉంటుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Show comments