NTV Telugu Site icon

Off The Record: టాలీవుడ్ సీనియర్ నటుడు ఫెయిల్యూర్ పొలిటిషన్‌గా మిగిలిపోయాడా..?

Ali

Ali

Off The Record: 1999లో బాపట్ల ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి రామానాయుడుకి మద్దతుగా ప్రచారం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు అలీ. అప్పటి నుంచి ఇరవై ఏళ్లపాటు ఆ పార్టీలోనే కొనసాగారాయన. నాటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకునే అలీకి పెద్ద కోరికే ఉంది. ఎప్పటికైనా మంత్రి కావాలని… రాష్ట్రాన్ని ఏలాలనేది ఆయన టార్గెట్‌ అట. ఇది ఎవరో అనడం కాదు.. అలీనే అనేకసార్లు చెప్పుకున్నారు కూడా. కానీ, టీడీపీలో అయితే ఎప్పుడూ ఎక్కడా కనీసం పోటీ చేయలేదు. అసలా ఆలోచన ఉన్నట్టు కూడా బయట కురాలేదు. కానీ.. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో ప్రత్యక్షం అయ్యారు ఈ స్క్రీన్‌ కమెడియన్‌. అప్పటికే రాజకీయాల్లో ఉన్న హీరో పవన్ కల్యాణ్‌ను పట్టించుకోకుండా వైసీపీలో చేరడం నాడు చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్‌ కూడా ప్రస్తావిస్తూ.. ఎన్నో రకాలుగా ఆదుకున్న అలీ లాంటి వాళ్లే తనను వదిలిపెట్టి వెళ్లిపోతే ఎలా అని అన్నారు కూడా.

దానికి దీటుగా స్పందించిన అలీ.. తనను ఆదుకున్నానంటున్న పవన్ అది ఏ విధంగానో చెప్పాలంటూ నిలదీశారు. డబ్బు ఇచ్చారా? వేషాలు ఇప్పించారా? అంటూనే అసలు పవన్ కల్యాణ్ కంటే ముందే తాను ఇండస్ట్రీలో ఉన్నానని, పవన్ హీరోగా వచ్చేనాటికే సెటిల్ అయ్యానని కూడా గట్టిగానే తిరుగు సమాధానం చెప్పారాయన. అలా మెగా కాంపౌండ్‌ను టచ్ చేసిన అలీ వ్యాఖ్యల మీద అప్పుడే ఇండస్ట్రీలోను, బయటా చర్చ జరిగింది, కాస్తో కూస్తో రచ్చ కూడా అయింది. వైసీపీ అండ చూసుకునే అలీ అలా రెచ్చిపోయారని అప్పట్లో అనుకున్నారు అంతా. ఈసారి రాజమండ్రి లేదా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారాయన. రాజమండ్రి అలీ స్వస్థలం కాగా.. గుంటూరు ఈస్ట్ బంధుమిత్రులున్న నియోజకవర్గం. కానీ ఆ రెండుచోట్లా జగన్ అవకాశం ఇవ్వలేదు. ఓ దశలో మైనార్టీ కోటాలో రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అది వాస్తవంలోకి రాలేదు. వైసీపీకి మద్దతుగా ఉన్న ఉన్న సినిమా నటుల్లో పోసాని కృష్ణమురళి, ఆ తర్వాత అలీ మాత్రమే. అయినాసరే.. ఆయన్ని వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకున్నారు.

అయితే గియితే… మంత్రినే అవుతానని చెప్పుకున్న నటుడికి చివరికి ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు పదవి ఇచ్చి సరిపెట్టారు జగన్. దాన్లోనైనా సరిగ్గా చేశారా అంటే అదీ లేదు. బాధ్యతలు చేపట్టిన రోజున ఏదేదో చేస్తానని గొప్పలుపోయి ఏం చేయకుండానే పదవీకాలాన్ని ముగించారాయన. మొన్నటి ఎన్నికల్లో కూడా ఎక్కడా కనిపించలేదు అలీ.. బహుశా సీట్ ఇవ్వలేదని అలిగి మోహం చాటేశారని అనుకున్నారు అంతా. కట్ చేస్తే కూటమి బంపర్ మెజార్టీతో గెలిచింది.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో రాజకీయాలకు రాం రాం చెబుతున్నానంటూ వీడియో విడుదల చేశారు అలీ. సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రావడం లేదు ఆయనకు. చిన్నా చితకా సినిమాల్లో అడపాదడపా కొద్ది కొద్ది వేషాలు తప్ప వేరే ఏం లేవు. మెగా కాంపౌండ్‌తో ఏర్పడిన గొడవల కారణంగా పోసాని అవకాశాలకు తెరపడిపోయింది. ఒకప్పుడు కాల్‌షీట్స్ ఇవ్వడానికి ఖాళీలేని డైరీతో ఉండే పోసానికి ఇప్పుడు పేజీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయట. ఈ పరిణామ క్రమంలో అలీకూడా ముందే జాగ్రత్తపడ్డారా అన్న డౌట్స్‌ వస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో.

పవన్ కల్యాణ్ ఏదో అంటే… దానికి గట్టిగా రియాక్షన్ ఇచ్చిన ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుతుందేమోనన్న భయంతోనే అలీ వైసీపీకి రాజీనామా… రాజకీయాలకు దూరం అని తెల్లజెండా ఊపారా అనే అనుమానాలు లేకపోలేదు. 2023లో నగరిలో కొండచుట్టు ఉత్సవం సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలీ.. పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కానీ, ఈ ఎన్నికల్లో చివరికి సీటు కూడా దక్కలేదాయనకు. కానీ.. ఎవరి మీద అయితే ఛాలెంజ్ చేశారో… అదే పవన్ కల్యాణ్ 73వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో పిఠాపురం నుంచి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దాంతో కంప్లీట్‌గా జ్ఞాన నేత్రాలు తెరుచుకున్న కమెడియన్‌… లేని దాని కోసం ఆశపడటం, ఆయాసపడటం కంటే… నమ్ముకున్న ఇండస్ట్రీని అంటిపెట్టుకుని ఉండటమే సేఫ్‌ అనుకున్నట్టు తెలుస్తోంది. పెద్దోళ్ళతో పెట్టుకుని పరిశ్రమలో మంచి జీవితాన్ని పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ యూ టర్న్ తీసుకున్నట్టు చెబుతున్నారు. వాస్తవంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పినా చెప్పకున్నా అలీకి వచ్చేదీ పోయేదేం లేదు. కానీ బహిరంగ ప్రకటన చేశారంటేనే… అక్కడ ఎవరికో… ఏ వర్గానికో తెల్లజెండా చూపించిన సంకేతం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేకుంటే ఇన్నాళ్లు ఉన్న పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పుడు అండగా ఉండాల్సిన అలీ…. వైసీపీని అర్ధాంతరంగా వదిలేయడం ఏంటనే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మారిన నటుడు.. ముందు చూపుతోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.