NTV Telugu Site icon

Nagari YCP: రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సొంత జిల్లాలో తప్పని చిక్కులు

Nagari Ycp

Nagari Ycp

అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్‌ వినిపిస్తోంది.

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో బలంగానే ఉంది.

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వివాదాలకు, విభేదాలకు, కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆఖరికి ఇక్కడి గొడవలు అయితే అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. రోజా వరుసగా రెండుసార్లు ఇక్కడ గెలిచినపప్పటికీ, నియోజకవర్గంపై మాత్రం పట్టు మాత్రం సంపాదించుకోలేకపోయారనే టాక్‌ ఉంది. రోజాను నియోజకవర్గంలో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రారంభమైన విబేదాలు, పంచాయతీ, జెడ్పిటిసి, ఎంపీటీసీ, మున్సిపల్ పోరు…ఇలా ప్రతిసందర్భంలో తెరపైకి వస్తూనే ఉన్నాయి.

కెజి కుమార్‌, అమ్ములు, రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఇలా చాలామంది నగరి వైసీపీలో గ్రూపులతో హీట్ ఎక్కిస్తూనే ఉన్నారు. పార్టీనుండి సస్సెండ్ చేస్తామనే హెచ్చరికలున్నా, గ్రూపుల గోల మాత్రం ఆగలేదు. నగరి సమస్య ఓ పక్కనుంటే, రోజా జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా పేచీ పెట్టుకున్నారు.. ఓ దశలో ఆయనతో డైరెక్ట్ ఫైట్ కు కూడా సిద్ధపడ్డారు. మీడియా వేదికగానే తనను ఇబ్బంది పెడుతున్నరంటూ చెప్పుకున్నారు.

Read Also: OTR: రాజోలు వైసీపీలో రచ్చ.. బొంతు వర్సెస్ రాపాక

ఇన్ని సమస్యలున్నా, రోజాను మంత్రి పదవి వరించడంతో అన్ని సర్దుకుంటాయని ఆమె అనుచరులు భావించారు. వ్యతిరేక వర్గం సైతం సైలెంట్ గా ఉండటంతో ఇక సమస్యలేం లేవు అనుకుంటున్న సమయంలో నగరి ప్లీనరీగా సాక్షిగా సీన్‌ మారింది. పాత విభేదాలన్నీ మళ్లీ తెరపైకి వచ్చి రోజా ఒంటరిగా మారారనే సంకేతాలు కనిపిస్తున్నాయని టాక్‌ నడుస్తోంది.

రోజాకు నియోజకవర్గంలో వ్యతిరేకవర్గం ఉందనే అంశం స్పష్టం. కానీ, తాజా ప్లీనరీ సమావేశానికి డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ, పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండటం చర్చకు దారితీసింది. నారాయణ స్వామి ఉమ్మడి జిల్లాలో చంద్రగిరి, తిరుపతి, పలమనేరు, సత్యవేడు సహా పలు ప్లీనరీల్లో పాల్గొన్నారు. కానీ, నగరి ప్లీనరీలో మాత్రం కనడపలేదు. పలమనేరు వేదికగా చిత్తూరు జిల్లా స్ధాయిలో ప్లీనరీ జరిగితే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. కాని జిల్లా నుండి మంత్రిగా ఉన్న రోజా మాత్రం ప్లీనరీకి డుమ్మా కొట్టారు. నగరిలోనే రోజా ఉన్నప్పటికీ, పలమనేరు వైపు కన్నెత్తి చూడలేదట. అదే సమయంలో నగరిలోని అసమ్మతి నేతలు కేజే శాంతి, కేజే కుమార్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో మరోసారి జిల్లాలో మంత్రుల మధ్య ఏ రేంజ్ లో గ్యాప్ ఉందనే టాక్ మొదలైంది.

ఇలా ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా సాగుతున్న చిత్తూరు వైసీపీలో అసలు ప్లీనరీలకు రోజాను పిలిచారా లేదా అన్న ప్రశ్నలు ఓ వైపు ఉంటే.. రోజా సైతం నగరి ప్లీనరీకి అందరినీ పిలిచారా లేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఈ విభేదాలతో రోజా ఒంటరిగా మిగిలారా అనే టాక్‌ పెరుగుతోంది.