Site icon NTV Telugu

అక్కడ టీడీపీని నడిపించే దిక్కు లేకుండా పోయిందా..?

Pilli Mogaluy

Pilli Mogaluy

కాకినాడ రూరల్‌లో టీడీపీ పరిస్థితి ఉందా లేదా అన్నట్టు తయారైంది. పార్టీని నడిపేవారు లేక కేడర్‌ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పిల్లి అనంతలక్ష్మి గెలిచారు. 2019లో పిల్లి అనంతలక్ష్మి.. అంతకుముందు 2009లో ఆమె భర్త సత్యనారాయణ కాకినాడ రూరల్‌లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దిరోజులు బాగానే పనిచేశారు. తర్వాతే పరిణామాలు మారిపోయాయి. అనంతలక్ష్మి కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ ఘటన ఒక సంచలనం. అతనితోపాటు కుటుంబసభ్యులపైనా కేసు నమోదైంది.

టీడీపీలో ముందు నుంచి మాజీ మంత్రి చినరాజప్పకి పిల్లి ఫ్యామిలీకి వైరం ఉంది. చినరాజప్ప హోంమంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ రూరల్‌లో తమకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహించారని.. పిల్లి ఫ్యామిలీ అనుమానం. తన కుమారుడు కేసు విషయంలోనూ చినరాజప్ప తెరవెనక తమ వ్యతిరేకవర్గంతో తప్పుడు ప్రచారం చేయించారని పిల్లి అనుచరులు ప్రచారం చేశారు. అప్పటి నుంచి తాము టీడీపీలో ఉంటాం కానీ.. పదవులు అవసరం లేదని తెగేసి చెప్పేశారు మాజీ ఎమ్మెల్యే అండ్‌ బ్యాచ్‌. తాజాగా జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అధినేత టూర్‌లో పిల్లి ఫ్యామిలీ కనిపించలేదు. కనీసం అటువైపు తొంగి కూడా చూడలేదు. అసలు తమకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించారు.

కాకినాడ రూరల్‌ టీడీపీలో వర్గాలు పెరిగిపోయాయి. ఎవరికివారు తామే నాయకుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పెత్తనం చేసేవాళ్లు ఎక్కువై.. పనిచేసేవాళ్లు తక్కువైపోయారు. బాబూ టూర్‌లో రూరల్‌ నియోజకవర్గం నుంచి పట్టుమని పదిమంది కూడా రాలేదు. తమను అఫీషియల్‌గా ఎవరూ ఆహ్వానించలేదని అలకబూని చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారట స్థానిక తమ్ముళ్లు. తాళ్లరేవుకు వెళ్తూ మధ్యలో ప్రతిచోటా చంద్రబాబు కాన్వాయ్‌ ఆగింది. కాకినాడ రూరల్‌ సెగ్మెంట్‌కు వచ్చేసరికి పార్టీ అధినేతకు స్వాగతం చెప్పేవారు కూడా లేరట.

ముందు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉంటుందని కాకినాడ రూరల్‌లో బాదుడే బాదుడు కార్యక్రమం పెడదామని అనుకున్నారట. కానీ పిల్లి ఫ్యామిలీ నుంచి స్పందన లేక లైట్‌ తీసుకున్నారట. నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం నమోదు ఊసే లేదట. పార్టీలో సీనియరైన యనమల రామకృష్ణుడు.. పిల్లి ఫ్యామిలీతో మాట్లాడి చంద్రబాబు టూర్‌కి రావాలని ఆహ్వానించారట. దానికి వారి నుంచి ఉలుకు పలుకు లేదని టాక్‌. తమను ఇబ్బందిపెట్టిన వారిని కనీసం పిలిచి అడగలేదని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రావాలని ప్రశ్నించారట. స్వయంగా అధినేత పిలిచి మాట్లాడితేనే పార్టీలో యాక్టివ్‌ అవుతామని.. లేదంటే మా దారి మాదేనని తేల్చి చెప్పేస్తున్నారట. మొత్తానికి కాకినాడ రూరల్‌లో టీడీపీ పరిస్థితి లీడర్ లేని కేడర్‌గా తయారైంది. స్వయంగా చంద్రబాబు జిల్లాకి వచ్చినా పిల్లి వర్గం పట్టించుకోలేదు. పార్టీ పెద్దలకు అన్ని తెలిసినా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదు. దీంతో పార్టీ ఇంఛార్జి ఉన్నట్టా.. లేనట్టా అనే గందరగోళంలో ఉన్నారట కాకినాడ రూరల్‌ తెలుగు తమ్ముళ్లు.

Exit mobile version